Wednesday, May 22, 2024

TS | ముందుకు కదలని శ్రీపాద ఎల్లంపల్లి వరదకాలువ పనులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సుజలం సువర్ణాన్ని పండిస్తోంది. ఎక్కడ సంవృద్ధిగా జలప్రవాహం ఉంటుందో అక్కడ సిరులు పండుతాయని అనేక నాగరికతలు నిరూపించడంతో ప్రతినీటిచుక్కను ఒడిసిపట్టేందుకు దేశవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణాల్లో మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడపలు దాటడంలేదనే చందంలా మారింది. వేల కోట్ల అంచనావ్యయాలతో ప్రాజెక్టుల ప్రణాళికలు రూపకల్పన జరుగుతున్నప్పటికీ పనుల్లో నిర్లక్ష్యం తాండవిస్తోందనడానికి శ్రీపాద ఎల్లంపల్లి సమాంతర వరద కాలువ నిర్మాణం అద్దంపడుతున్నాయి.

గతసంవత్సరం లోనే ఈ కాలువపనులు పూర్తి కావల్సి ఉండగా ప్రస్తుతం 25 శాతం మించిన పనులు కూడా పూర్తి కాలేదు. సర్వేల పేరుతో కాలాయాపన జరుగుతోంది. ఇప్పటివరకు స్పష్టమైన సర్వేలతో పాటు పనుల్లో వేగం పెరగలేదు. ఫలితంగా కోట్లాది రూపాయల అంచనావ్యయం రోజురోజుకు పెరుగుతోందని నీటిపారుదల శాఖ అసహనం వ్యక్తం చేస్తోంది. టెండర్లు పొందిన నిర్మాణ సంస్థలు కొంతకాలం భూసేకరణ, మరికొంతకాలం భారీ వర్షాలతో కాలం కరిగిపోగా పనులు నిలిచి పోయాయి.

ఇక వివరాల్లోకి వెళ్లితే భారీ వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎప్పటికప్పుడు ప్రవాహం పొటెత్తడంతో దిగువప్రాంతం నుంచి భారీగా వచ్చే వరదలను సమాంతర కాలువలు నిర్మించి మిడ్‌ మానేరుకు తరలించి అక్కడి నుంచి చెరువులు, కుంటలు నింపాలనే ఉద్దేశంతో 1.10 టీఎంసీ(361 క్యూమెక్స్‌) సామర్ధ్యం అదనపు జలాల తరలింపుకోసం 14 పిబ్రవరి 2020న రాష్ట్ర ప్రభుత్వం జీఎ ఎస్‌ నంబర్‌ 4ద్వారా నీటిపారుదల శాఖకు 11వేల 806 కోట్ల పరిపాలన పరమైన అనుమతులు ఇచ్చింది.

- Advertisement -

నాలుగు ప్యాకేజీల ద్వారా ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరు వరకు సమాంతర వరద కాలువ నిర్మాణం కోసం టెండర్లు పిలిచి నిధులు కేటాయించింది.నిర్మాణ నిర్ణీత సమయం 14పిబ్రవరి 2022 గా నిర్ధారించింది. అయితే పనులు సర్వేల పేరుతో కొంతకాలం, భూసేకరణ పేరుతో మరికొంత కాలం ముందుకు జరిగింది. అయితే వర్షాల్లో మరికొంత కాలం పనులు నిలిచిపోయాయి. ఫలితంగా 100శాతం పనులు పూర్తి కావల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 25నుంచి 30 శాతం పనులు పూర్తి అయినట్లుగా నిపుణులు అంచనావేస్తున్నారు.

ప్యాకేజీ ఒకటిలో రూ. 7వేల 392 కోట్ల పనులు 2మే 2022 వరకు జరగాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 30శాతం పనులు మాత్రమే పూర్తి అయ్యాయి. ప్యాకేజీ పనుల్లో అప్రోచ్‌ ఛానల్‌, సర్జ్‌ పూల్‌, ఫోర్‌ బే, పంపు హౌజ్‌ నిర్మాణం, ప్రెజర్‌ మెయిన్స్‌, దేవికొండ రిజర్వాయర్‌ పనులు పూర్తి కావల్సి ఉంది. అయితే నీటిపారుదల శాఖ కఠినంగా వ్యవహరిస్తూ నిర్మాణ సంస్థలపై ఒత్తిడి తెచ్చినా ప్రస్తుతం 30 శాతం పనులు మాత్రమే పూర్తి అయినట్లు సమాచారం.

ఇక రెండవ ప్యాకేజీలో రూ. 3వేల 903 కోట్ల పనులు టెండర్‌ పొందిన 24 నెల్లలో పూర్తి కావల్సి ఉండగా ఇప్పటికీ అప్రోచ్‌ ఛానల్‌, టన్నల్‌, సర్జ్‌ పూల్‌ పనులు 30 శాతం వరకు పూర్తి కాగా మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. ప్యాకేజీ మూడు మేరకు రూ. 261 కోట్ల పనులు జరగాల్సి ఉంది. ఇందులో పది కిలో మీటర్ల వరకు వరదకాలువ నిర్మాణం అత్యంత ప్రాధాన్యత పనిగా నిర్ధారించారు. అలాగే వరదకాలువకు సమాంతరంగా లైనింగ్‌ పనులు పూర్తి కావల్సి ఉంది.

ప్యాకేజీ నాలుగులో రూ. 250 కోట్ల అంచనావ్యయం తో పనులు పూర్తి కావల్సి ఉండదగా సుమారు 40శాతం వరకు పూర్తి అయినట్లు సమాచారం. ఈ పనుల్లో 10 కిలోమీటర్ల నుంచి 23 కిలో మీటర్ల వరకు వరదకాలువ నిర్మాణం, సమాంతరంగా లైనింగ్‌ పనులు పూర్తికావల్సి ఉంది. అయితే ప్రాజెక్టు ఉద్దేశాన్ని నిపుణులు హర్షిస్తున్నప్పటికీ పనులు ముందుకు కదలకపోవడంతో విచారం వ్యక్తం అవుతోంది.

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కు సమాంతరంగా వరదకాలువ నిర్మిస్తే ప్రాజెక్టు నుంచి పొంగిపొరలే నీటిని అదుపు చేయడంతో పాటుగా సుమారు 10వేలకు పైగా అదనంగా ఆయకట్టు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంచనావేస్తున్నారు. అయితే నీటిపారుదలశాఖ పనుల్లో వేగం పెంచాలని ఎంత శ్రమించినా నిర్మాణ సంస్థలు వేగంగా ముందుకు వెళ్లితేనే పనులు పూర్తి అయ్యే అవకాశాలున్నాయి. లేదంటే కరిగిపోయో కాలంలో పనులు ఎక్కడికక్కడ నిలిపోతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement