Friday, June 14, 2024

TS | వానాకాలం సీజనుకు ఎరువులు సిద్ధం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మరో వారం రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం, ఆ తర్వాత ఖరీఫ్‌ సాగు ఊపందుకోనున్న నేపథ్యంలో రైతుల అవసరాలకు మేర అసవరమైన ఎరువులు, క్రిమిసంహారక మందులను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈసారి సరికొత్తగా నానో యూరియా (ద్రవరూపంలో ఉండే యూరియా)ను కూడా అందుబాటులోకి తెచ్చింది.

దాదాపు 10వేల టన్నుల నానో యూరియాను అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో అన్ని రకాల ఎరువులు కలిసి దాదాపు 10లక్ష మెట్రిక్‌ టన్నుల మేర అవసరమవుతాయని వ్యవసాయశాఖ పరిధిలోని మార్క్‌ఫెడ్‌ అంచనా వేసింది. అందుకు తగిన విధంగా ఎరువులను సిద్ధం చేసి ఉంచినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

మునుపెన్నడూ లేని రీతిలో యూరియా 6.30లక్షల మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 78వేల మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 4 లక్షల మెట్రిక్‌ టన్నులు, పోటాష్‌ 26వేల మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 15వేల మెట్రిక్‌ టన్నుల మేర అందుబాటులో ఉన్నాయి. ప్రతీ ఏటా రాష్ట్రంలో ఖరీఫ్‌, రబీలో వరి, పత్తి పంటలు పెద్ద విస్తీర్ణంలో ‘సాగవుతాయి. అందులో వరి 66 లక్షల ఎకరాల్లో, పత్తి 60.53లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా.

ఈ రెండు పంటలకే అత్యధిక మోతాదులో ఎరువులను రైతులు వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో దాదాపు 10లక్షల టన్నుల వివిధ రకాల ఎరువులను సిద్దంగా ఉంచినట్లు మార్క్‌పెడ్‌ సంస్థ తెలిపింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో కోటి 34లక్షలా 35వేల 175 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు అవనున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతోపాటు వ్యవసాయ ఉపకరణాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

మరోవైపు రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈనెల 24న రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో విత్తన మేళాను నిర్వహించనున్నారు.ఈ మేళాను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చేతుల మీదుగా ప్రారంభించి రైతులకు విత్తన పంపిణీని ప్రారంభిస్తారు.

- Advertisement -

అదే రోజున వరంగల్‌లోని పాలెం, జగిత్యాల, ఆదిలాబాద్‌ ప్రాంతీయ పరిశోధనా స్థానంతోపాటు ఇతర కృషి విజ్ఞాన కేంద్రాల ప్రాంగణాల్లో విత్తన మేళాలు జరగనున్నాయి. వివిధ పంటలకు సంబంధించి నాణ్యమైన విత్తన రకాలను విక్రయానికి రైతులకు అందుబాటులో ఉంచనున్నారు.

ఖరీఫ్‌పై రైతుల గంపెడాశలు…

ఈ ఖరీఫ్‌పై రాష్ట్ర రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. గడిచిన యాసంగిలో సరిపడ సాగు నీరు లేక, కరువు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. వరుస తడుల మీద వరిని చివర వరకు కాపాడుకున్నా… ఆశించిన స్థాయిలో దిగుబడి రాక రైతులు ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయారు.

ఈ సమయంలో ఈ ఖరీఫ్‌లో నిర్ణీత సమయంలోనే రుతుపవనాలు ప్రవేశించనున్నాయన్న భారత వాతావరణశాఖ ప్రకటన రైతుల్లో గంపెడాశలు నింపింది. ఇప్పటికే తెలంగాణలో ఖరీఫ్‌ కోసం వరి నారు మళ్లను రైతులు సిద్దం చేస్తున్నారు. ఈ సారి వరి, పత్తి ఈ రెండు పంటలు కలిపే దాదాపు కోటి 20లక్షల ఎకరాలకు పైగా సాగవుతుందని వ్యవసాయశాక అంచనా.

Advertisement

తాజా వార్తలు

Advertisement