Monday, May 6, 2024

మిర్చి పంటలో కొత్త తెగులుపై స్పైసెస్ బోర్డ్ సమావేశం..

తెలుగు రాష్ట్రాల్లో మిర్చి పంటను నాశనం చేస్తున్న కొత్త రకం పురుగు చీడపై కేంద్రం అప్రమత్తమైంది. వేల కోట్ల మేర మిర్చి రైతులకు నష్టాన్ని కల్గిస్తున్న ఈ కొత్త రకం చీడపీడలపై దృష్టి పెట్టి పరిశోధనలు చేయాల్సిందిగా శాస్త్రవేత్తలు, మిరప పంట నిపుణులను మిర్చి టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ జీవీఎల్ నరసింహారావు కోరారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ పరిధిలోని స్సైసెస్ బోర్డ్ – మిర్చి టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మిర్చి పంటలపై థ్రిప్స్ (కొత్త రకం పురుగు) దాడితో పంట దిగుబడి తీవ్రంగా ప్రభావితమవుతోంది. దాడి చేస్తున్న థ్రిప్స్ జాతుల వల్ల మిర్చి పంటకు వాటిల్లే ముప్పు నుంచి పరిష్కారం కనిపెట్టేందుకు మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ సమావేశాన్ని నిర్వహించి, అధ్యక్షత వహించారు. ఇందులో ఐసిఎఆర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ (ఐఐహెచ్‌ఆర్), డాక్టర్ వైఎస్ఆర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఐసిఎఆర్- నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్‌సెక్ట్ రిసోర్సెస్ (ఎన్‌బీఏఐఆర్), ఇండియన్ కార్డమం రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐసిఆర్ఐ), స్పైసెస్ బోర్డు; డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్ అండ్ స్టోరేజీ (డిపిపిక్యూఎస్), న్యూఢిల్లీతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉద్యాన పంటల విభాగాలు, మిర్చి సీడ్ సరఫరాదారుల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సమావేశానికి ముందే తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకోవడం కోసం జీవీఎల్ నరసింహారావు నేతృత్వంలోని మిర్చి టాస్క్‌ఫోర్స్ ప్రతినిధులు, గత నెల శాస్త్రవేత్తల బృందాలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. దాంతో శాస్త్రవేత్తలకు కొత్త రకం థ్రెప్స్ జాతి పురుగు దాడి, పరిస్థితి తీవ్రత గురించి సమగ్ర అవగాహన ఏర్పడింది. బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో ఈ బెడద ఉన్న చోట మిర్చి పంటను కాపాడే మార్గాల గురించి చర్చించారు. బహుముఖ వ్యూహాన్ని అమలుచేయాల్సిన అవసరముందని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. చీడపీడల బెడద లేకుండా ఉత్తమ వ్యవసాయ విధానాలపై రైతులకు సలహాలు ఇచ్చే వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ క్రమంలో పురుగును ఆకర్షించి, అతుక్కుపోయేలా చేసే బ్లూ స్టికీ ట్రాప్ విధానాలు, స్వల్పకాల మిర్చి రకాల సాగు వంటి తక్కువ ఖర్చుతో కూడిన విధానాలపై చర్చ జరిగింది. ఈ కొత్త రకం పురుగు చీడను ఎదుర్కొనే క్రిమిసంహారకాలను తయారుచేసే వరకు ఈ విధానాలు అవలంబించడం ఉత్తమమని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో థ్రిప్స్ దాడి తట్టుకునే మిర్చి రకాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టాలని జీవీఎల్ నరసింహారావు ఐసిఎఆర్-ఐహెచ్ఆర్‌ను అభ్యర్థించారు. ఐసిఎఆర్-ఎన్‌బిఎఐఆర్ వంటి ఇతర సంస్థల సహాయంతో థ్రిప్స్ సహజ శత్రువులను గుర్తించాలని ఆయన ఐఐహెచ్ఆర్ కీటక శాస్త్రవేత్తలను కోరారు.

క్రిమి సంహారక మందుల విచక్షణారహిత వినియోగం, నత్రజని ఎరువుల అధిక వాడకం, అక్టోబర్-నవంబర్ వర్షాలు, తరువాత వేడి ఇంకా తేమ పరిస్థితులు థ్రిప్స్‌ను ప్రేరేపించినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చర్చల సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ, మామిడి తోటలో కూడా థ్రిప్స్ వ్యాప్తి గుర్తించామని, ఇది దిగుబడిని ప్రభావితం చేయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. తెగులు సోకిన మిరప పొలాలను ధ్వంసం చేసి, శనగ పంట వేస్తే అది కూడా ధ్రిప్స్ బారిన పడినట్టు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

కర్ణాటక రాష్ట్ర ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రధానంగా మిర్చి పండించే బళ్లారి, రాయచూర్ బెల్ట్‌లో, పండ్ల కుళ్లు ప్రధాన సమస్య అని, రైతులు ధ్రిప్స్ దాడితో పెద్దగా ప్రభావితం కాలేదని అన్నారు. స్పైసెస్ బోర్డు డైరెక్టర్ మాట్లాడుతూ, పండు కుళ్లిపోవడం వల్ల, మిర్చి దాని రంగును కోల్పోతోందని, ఇది దేశం నుండి మిర్చి ఎగుమతిని ప్రభావితం చేయవచ్చని మిర్చి తయారీదారుల నుండి బోర్డుకు విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. ఈ సమావేశంలో వ్యక్తమైన అన్ని అభిప్రాయాలను ప్రస్తావిస్తూ, క్రిమి సంహారక మందులను విచక్షణ మేరకు ఉపయోగించడం, సమగ్ర సస్య రక్షణ పద్దతులను ఉపయోగించడం, చీడలను నిరోధించడానికి, అలాగే తెగుళ్లను నిరోధించడానికి పొలాలలో మంచి పరిశుభ్రమైన విధానాలు అవలంబించడం గురించి శాస్త్రవేత్తలు నొక్కి చెప్పారు. మంచి వ్యవసాయ విధానాలపై విజ్ఞానాన్ని అందించడానికి ఉమ్మడి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని జీవీఎల్ ఐఐహెచ్‌ఆర్, స్పైసెస్ బోర్డును కోరారు. మార్కెట్ యార్డుల నుండి మిర్చి నమూనాలను తీసుకుని చీడలు, వ్యాధులు మిర్చి నాణ్యతను ఎలా ప్రభావితం చేస్తున్నాయో పరీక్షించాలని, అలాగే ధ్రిప్స్ దాడి వృద్ధి కాకుండా రైతులు పురుగుమందులను విచక్షణారహితంగా ఉపయోగించడం వల్ల మిర్చిపై పురుగుమందుల అవశేషాల తీవ్రత కూడా పెరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు సూచించిన అంశాలను జోడిస్తూ.. ఏకీకృత నివేదికను తయారు చేసి, వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి సమర్పించాలని ఆయన డిపిపిక్యూఎస్ జాయింట్ డైరెక్టర్‌ని కోరారు.

వివిధ పంటలలో థ్రిప్స్ దాడిని గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచురించడం, అది ఎంత మేరకు నష్టాన్ని కలిగించింది, భారతదేశంలో థ్రిప్స్ పార్విస్పినస్ ఎలా ప్రవేశించింది, వివిధ దేశాలు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తున్నారో గుర్తించడానికి అంతర్జాతీయ చీడల నిర్వహణ సంస్థలతో సంప్రదింపులు జరపాలని జీవీఎల్ సూచించారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖతో చర్చించడానికి వీలుగా సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement