Friday, May 17, 2024

Delhi | ఆరు గ్యారంటీలే మా అభ్యర్థులు.. ఎన్ని అవాంతరాలొచ్చినా అమలు చేస్తాం : రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆరు గ్యారంటీలే తమ అభ్యర్థులని, ఎన్ని అవాంతరాలొచ్చినా వాటిని అమలు చేసి తీరుతామని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది చెబుతూ రాజకీయ ప్రత్యర్థులు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై విరుచుకుపడ్డారు.

ఈ రెండు పార్టీలకు లోపాయకారి ఒప్పందం ఉందని తాము మొదటి నుంచి చెబుతున్నామని, తాజాగా ప్రధాన మంత్రి వ్యాఖ్యలతో అది నిరూపితమైందని రేవంత్ అన్నారు. కాంగ్రెస్‌ను ఓడించడం కోసం బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఇందుకు ఉదాహరణగా..  2018లో కాంగ్రెస్‌ను ఓడించడం కోసం బీజేపీ తన ఓటుబ్యాంకు మొత్తం బీఆర్ఎస్‌కు బదిలీ చేసిందని, అందుకే బీజేపీ 105 స్థానాల్లో డిపాజిట్లు కూడా కోల్పోయిందని గుర్తుచేశారు.

ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి బీఆర్ఎస్‌కు ప్రయోజనం కల్పించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, అందుకే రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పదే పదే తెలంగాణకు వస్తున్నారని ఆయన సూత్రీకరించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ప్రజలకు అర్థమైందని, ఈ రెండు పార్టీల కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతీ తెలంగాణ బిడ్డపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.

- Advertisement -

తాముబీజేపీ, బీఆరెస్ పై విమర్శలు చేస్తుంటే అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారో అర్థం కావడం లేదని రేవంత్ అన్నారు. ఓవైసీ సోదరులిద్దరూ ఎవరిపక్షాన నిలబడ్డారో, ఎవరికి మద్దతుగా నిలుస్తారో తేల్చుకోవాలన్నారు. నవంబరు 30న తెలంగాణకు విముక్తి కలగబోతోందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రానికి పట్టిన చీడ నుంచి తెలంగాణకు విముక్తి లభించనుందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలతో ప్రజల జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోతున్నామన్న భయం బీఆర్ఎస్ నేతల్లో మొదలైందని రేవంత్ రెడ్డి అన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలలో వేటిపైనైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకుందని,  పదివేల ఎకరాల భూములను ఆక్రమించుకుందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

అమరవీరుల స్థూపం, సచివాలయ నిర్మాణంలో కూడా దోపిడీకి పాల్పడ్డారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. “కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రకటించగానే కేసీఆర్ చలి జ్వరం వచ్చింది. కేసీఆర్ విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది… ఆయన ఫాం హౌస్ నుంచి బయటకు రావాల్సిన పనిలేదు. వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు.

డిసెంబర్ లో అద్భుతం జరగబోతుంది… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని రేవంత్ అన్నారు. ఈ పదేళ్లలో కేసీఆర్ కుటుంబీకులు శ్రీమంతులు  అయ్యారు తప్ప, ప్రజలకు ఒరిగిందేం లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  ప్రతీ మహిళకు నెలకు రూ.2,500 అందిస్తామని, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి మహిళలను ఆదుకుంటామన్నారు.

ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షల సాయం అందిస్తామన్నారు. ప్రతీ పేద ఇంటికి  200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబోతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం, కౌలు రైతుతో సహా ప్రతీ రైతుకుప్రతీ ఏటా రూ.15వేలు అందిస్తామని ఆయన వెల్లడించారు. సంపద పెంచాలి… పేదలకు పంచాలి అన్నదే కాంగ్రెస్ విధానమని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement