Thursday, May 16, 2024

ఆరుగురు జిల్లా అధ్యక్షులకు పదవీ గండం.. హెచ్చరించిన బీజేపీ నాయకత్వం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : క్షేత్రస్థాయిలో బీజేపీని పటిష్టతపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ నాయకత్వం పోలింగ్‌ బూత్‌ల వారిగా కమిటీల ఏర్పాటుపై ఆరా తీస్తోంది. జిల్లా అధ్యక్షులతో భేటీ జరిపిన సంజయ్‌ సంస్థాగత నియామకాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం, కమిటీల ఏర్పాటులో పారదర్శకత పాటించకపోవడంపై కొన్ని జిల్లాల అధ్యక్షులకు సుతిమెత్తగా క్లాస్‌ తీసుకున్నారు. కమిటీల ఏర్పాటుపై జిల్లా అధ్యక్షులు పార్టీని దృష్టిలో పెట్టుకుని నియమించకుండా వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడంపై ప్రధానంగా ప్రస్తావించారు. మొత్తంగా అయిదారు జిల్లాల పార్టీ అధ్యక్షుల పనితీరును బేరీజు వేసుకున్న నాయకత్వం వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని నిర్ణయించింది.

ఇప్పటికే వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడి మార్పు దాదాపు ఖాయమైంది. ప్రస్తుత అధ్యక్షుడు సదానందరెడ్డి స్థానంలో రమేష్‌ను నియమించాలని నిర్ణయించినట్లు తెలిసింది. జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సదానందరెడ్డి క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం, పార్టీ పని కంటే పార్టీ పేరుతో స్వంత పనులకు ప్రాధాన్యమివ్వడం వల్లే ఈ మార్పు అని రాష్ట్ర నాయకత్వం పేర్కొంటోంది. రామగుండం జిల్లాకు కూడా కొత్త అధ్యక్షుడిని నియమించాలని నాయకత్వం నిర్ణయించింది. ఆసిఫాబాద్‌- కొమురం భీం జిల్లా అధ్యక్షుడి ఆకస్మిక మరణంతో అక్కడ కొత్త నేతకు పార్టీ పగ్గాలను కట్టబెట్టాలని నిర్ణయించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒకరు తన స్వగ్రామానికి చెందిన ఎడుగురిని జిల్లా కార్యవర్గంలో చోటు కల్పించినట్లు తేలడంతో ఆశ్చర్యపోయిన రాష్ట్ర నాయకత్వం వెంటనే జిల్లా కార్యవర్గాన్ని రద్దు చేయాలని సదరు నేతను ఆదేశించారు. అయినప్పటికీ ఆ నేత ఇప్పటికీ మౌనంగా ఉండటంతో ఏకంగా అధ్యక్షుడిని తొలగించడంతో పాటు కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని నిర్ణయించింది.

పోలింగ్‌ బూత్‌ల వారిగా పార్టీని పటిష్టం చేయాలన్న సంకల్పంతో గత కొంత కాలంగా రాష్ట్ర స్థాయి నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు విస్తృతంగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు దేశంలోని నరేంద్ర మోడీ పాలన, చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళేలా కింది స్థాయి శ్రేణులలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని జిల్లాలలో క్షేత్రస్థాయి నాయకుల నుంచి ఆశించిన తరహాలో స్పందన లేకపోవడం, మరికొన్ని చోట్ల నామ్‌ కే వాస్తే అన్నట్లుగా రాష్ట్ర నేతల పర్యటనలను జరగడం పట్ల రాష్ట్ర పార్టీ తీవ్ర ఆసంతృప్తితో ఉంది.
రాబోయేది ఎన్నికల కాలం కాబట్టి జిల్లా పార్టీలను పటిష్టం చేయడం తప్ప మరో మార్గం లేదని భావిస్తున్న నాయకత్వం వీలైనంత మేర గెలుపు బాధ్యతలను జిల్లా అధ్యక్షులకే అప్పగించాలని భావిస్తోంది. అప్పటిలోగా జిల్లా పార్టీని పటిష్టం చేయాలన్న ఉద్దేశ్యంతో కొన్ని జిల్లాల అధ్యక్షులను మార్చడం తప్ప మరో మార్గం లేదని నేతలు అంటున్నారు. నియోజకవర్గాలలో గెలుపు గుర్రాలను గుర్తించడంతో పాటు అధికార టీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కునే సత్తా కలిగిన నేతలపై దృష్టి కేంద్రీకరించిన నాయకత్వం జిల్లా నేతల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలని భావిస్తోంది.

అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీలవుతారు..

బీజేపీని గెలిపించిన జిల్లా నేతలకు రాబోయే రోజులలో ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అభ్యర్థులుగా ఎవరిని పార్టీ ఖరారు చేసినా వారిని గెలిపించి తీసుకు రావాలని, అందుకు నజరానాగా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని జిల్లా అధ్యక్షుల బేటీలో స్వయంగా బండి సంజయ్‌ ప్రకటించారు. రాజకీయాలలో పని చేసినపుడు ఎవరైనా పదవిని ఆశిస్తారని, అయితే పార్టీ పురోగతిని దృష్టిలో పని చేసిన వారికి పార్టీ ఎప్పుడూ అన్యాయం చేయదన్న భరోసాను కూడా సంజయ్‌ ఇచ్చారు. పార్టీ ఇచ్చిన పదవిని అడ్డు పెట్టుకుని పైరవీలు చేసుకోవడం, గొప్పలు చెప్పుకోవడం కాదని, కట్టబెట్టిన పదవికి ఎంత మేర న్యాయం చేశామన్నది కూడా ముఖ్యమని నేతలకు సూచించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement