Thursday, May 2, 2024

Delhi: కాంగ్రెస్ ఆందోళన్ పథ్, ‘భారత్ జోడో’ యాత్రకు మోగిన సైరన్.. క్రియాశీలపాత్రలో టీపీసీసీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభంకానున్న ‘భారత్ జోడో’ యాత్రలో తెలంగాణ కాంగ్రెస్ క్రియాశీల పాత్ర పోషిస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘భారత్ జోడో యాత్ర’ సమీక్షలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఆయా రాష్ట్రాల వ్యవహారాల ఇంచార్జిలు, భారత్ జోడో యాత్ర కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ మీడియా-కమ్యూనికేషన్ విభాగం హెడ్ జైరాం రమేశ్, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఈ సమావేశానికి నేతృత్వం వహించి పలు సూచనలు చేశారు.

సమావేశం అనంతరం ఏఐసీసీ కార్యాలయం వద్ద రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో సెప్టెంబర్ 4న బీజేపీ-మోదీ సర్కారుకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనకు ఏఐసీసీ పిలుపునిచ్చిందని తెలిపారు. నిత్యావసర ధరల పెరుగుదల, తీవ్రతరమైన నిరుద్యోగ సమస్య, అవినీతి, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టడం, సీబీఐ, ఈడీ వంటి సంస్థలను తమ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్‌గా మార్చుకుని రాజకీయ కక్షసాధింపులకు వినియోగిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ నిరసన ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ నేతలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమయ్యే ‘భారత్ జోడో’ యాత్రలో కూడా టీపీసీసీ క్రియాశీలంగా వ్యవహరిస్తుందని అన్నారు.

భారత్ జోడో యాత్ర తెలంగాణలో 14-15 రోజుల పాటు 360-370 కి.మీ మేర సాగనుందని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశాన్ని ఏకంగా ఉంచడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి, ప్రజలకు మనోధైర్యాన్ని కల్గించడానికి 160-170 రోజుల పాటు ఏకధాటిగా రోజుకు 25 కి.మీ నడుస్తూ సమాజంలో అన్ని వర్గాలను కలిసి, వారి సమస్యలను రాహుల్ గాంధీ తెలుసుకుంటారని వెల్లడించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, కోట్లాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించకుండా కట్టడి చేయడం కోసం 2024లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగిస్తారని వివరించారు.

భాష, మతం పేరుతో బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి.. విభజన తీసుకొస్తొందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. దేశాన్ని చీల్చే ఈ తరహా ప్రయత్నాలను తిప్పికొట్టడం కోసమే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి నేతలు దేశం కోసం బలయ్యారే తప్ప దేశాన్ని బలికానివ్వలేదని గుర్తుచేశారు.

- Advertisement -

భారతీయ జనతా పార్టీ రూ. 6,300 కోట్ల ఖర్చుపెట్టి 8 రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను పడగొట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చే ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాటం కొనసాగిస్తారని రేవంత్ చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులే కాదు, తెలంగాణ సమాజం మొత్తం భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అంటే పార్టీ ఫిరాయింపులకు, అవినీతికి, అత్యాచారాలకు చిరునామాగా మారిందని, చివరకు రాష్ట్రాన్ని అన్ని అరాచకాలకు ప్రయోగశాలగా కేసీఆర్ మార్చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో ఈ అంశాలను కూడా జోడించి.. మోదీ – కేసీఆర్‌ వంటి నేతల కారణంగా రాష్ట్రానికి, దేశానికి జరుగుతున్న నష్టాన్ని వివరిస్తామని అన్నారు. ఈ నేతలను ప్రజా జీవితం నుంచి బహిష్కరించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement