Saturday, May 4, 2024

సర్కారు బడులకు టీచర్ల కొరత.. ఉన్నటీచర్లతోనే సిలబస్‌ చెప్పిస్తున్న వైనం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీచర్‌ కావాలి…టీచర్‌ రావాలి అనే పరిస్థితి రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా టీచర్లు లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందడంలేదనే విమర్శులున్నాయి. దీంతో విద్యార్థులు నష్టపోయేప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా 9, 10వ తరగతి విద్యార్థులు ఎక్కువగా నష్టపోనున్నారు. మరో 35 రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ప్రీఫైనల్‌ పరీక్షలను విద్యార్థులు రాస్తున్నారు. అయితే కొన్ని సబ్జెక్టులకు బోధించడానికి సంబంధిత టీచర్లు లేకుండానే పదో తరగతి పరీక్షల కోసం విద్యార్థులను సిద్దం చేస్తుండడం గమనార్హం. చాలా స్కూళ్లలో సాంఘీకశాస్త్రం, గణితం, బయోసైన్స్‌ సబ్జెక్టులకు సార్లేలేరు. ఆ సబ్జెక్టు టీచర్లు లేకుండానే సిలబస్‌ పూర్తికావడం, రివిజన్‌ క్లాసులు జరుగుతుండటం గమనార్హం. సుమారుగా నాలుగు వేల స్కూళ్లలో ఒక్కో స్కూల్లో సగటున ఇద్దరు చొప్పున సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు.

ఇది పదో తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఏ సబ్జెక్టులకైతే టీచర్లు లేరో ఆ సబ్జెక్టుల క్లాసులను ఉన్న టీచర్లతోటే బోధిస్తున్నారు. సంబంధిత సబ్జెక్టు టీచర్‌ బోధిస్తేనే విద్యార్థులకు సరిగా అర్థం కానీ పాఠాలు.. ఇతర టీచర్లతో చెప్పిస్తే ఎలా అర్థమవుతాయనే ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి. ఈ మూడు సబ్జెక్టులే కాకుండా మరికొన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్‌, హిందీ, సోషల్‌ లాంటి సబ్జెక్టులకు సైతం టీచర్లు సరిపడా లేరని తెలుస్తోంది. దీంతో ఆరు నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు రెండు, మూడేళ్లుగా సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది.

- Advertisement -

ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కరోనా అప్పుడు పాఠాలు వినకుండా, పరీక్షలు రాయకుండానే పైతరగతులకు ప్రమోటయ్యారు. దీనికితోడూ ఇప్పడు టీచర్లు కూడా లేకపోవడంతో వాళ్లు వార్షిక పరీక్షలు ఏలా రాస్తారో! వాటి ఫలితాలు ఎలా ఉండబోతాయో అనేది సందేహమే. ఇక సక్సెస్‌ స్కూళ్లలోనూ సరిపడా టీచర్లు లేక విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ స్కూళ్లలో తెలుగు, ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థులకు వేర్వేరుగా తరగతులు నిర్వహించాలి. కానీ సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో తెలుగు, ఇంగ్లీష్‌ మీడియం స్టూడెంట్లను కలిపి పాఠాలు బోధిస్తున్న పరిస్థితి కొన్ని పాఠశాల్లలో నెలకొంది.

విద్యావాలంటీర్లనైనా తీసుకోవాల్సింది…

సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని తెలిసినా విద్యా వాలంటీర్లను విద్యాశాఖ రెన్యూవల్‌ చేయడంలేదు. కరోనా కంటే ముందు ప్రభుత్వ బడుల్లో 16 వేల మంది విద్యావాలంటీర్లు పనిచేశారు. కానీ రెండేళ్లుగా వారిని రెన్యూవల్‌ చేయనేలేదు. ఈ ఏడాది ఇంగ్లీషు మీడియం సెక్షన్లు మొదలైనా, విద్యార్థుల సంఖ్య పెరిగినా విద్యావాలంటీర్లను మాత్రం తీసుకోవడంలేదు. దీంతో హైస్కూళ్లతోపాటు ప్రైమరీ స్కూళ్లలోనూ టీచర్ల కొరత వెంటాడుతోంది.

ఆరేళ్లవుతున్నా నియామకాల ఊసేలేదు…

ఒకవైపు టీచర్ల నియామక ప్రక్రియను చేపట్టడంలేదు..మరోవైపు విద్యావాలంటీర్లను నియమించడంలేదు. ఫలితంగా సర్కారు బడులకు టీచర్ల కొరత వేధిస్తోంది. 2017 అక్టోబర్‌ 21న 8792 టీచర్‌ ఖాళీలకు నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్‌సీ జారీ చేసింది. 2018 ఫిబ్రవరి 24 నుండి మార్చ్‌ 4 వరకు వీటి పరీక్షలు పూర్తి చేశారు. ఈ ప్రకారంగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేపట్టి దాదాపు 6 ఏళ్లవుతున్నా ఇంతవరకూ మరోక నోటిఫికేషన్‌ వెలువడలేదు. గత ఏడాది జూన్‌ 12న టెట్‌ నిర్వహించారు. 10 నుండి 12 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వ పెద్దలు ఎన్నోసార్లు గొప్పగా ప్రకటించారు. అయితే ముందుగా టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టిన తర్వాత టీచర్ల ఖాళీలు భర్తీ చేస్తామన్నారు.

ప్రస్తుతం బదిలీలకు హైకోర్టు మార్చి 14 వరకు స్టే ఇవ్వడంతో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు బ్రేక్‌ పడ్డ విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది? టీచర్ల ఖాళీలను ఎప్పుడు చేపడతారు? టీచర్ల కొరత ఎప్పుడు తీరుతుంది? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మరోవైపు కొత్త విద్యా సంవత్సరం జూన్‌ 12 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈక్రమంలో బడులు ప్రారంభం కాకముందే టీచర్ల కొరత తీరుతుందో? లేదో చూడాలి. వచ్చే విద్యాసంవత్సరానికైనా విద్యావాలంటీర్లను తీసుకుంటారో లేదో చూడాలి మరీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement