Sunday, April 28, 2024

TS: బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు..

తొర్రూరు : పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తొర్రూర్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, యూత్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జీనుగా సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు దొంగరి రేవతి, బిజ్జాల మాధవి, ముఖ్య నాయకులు దొంగరి శంకర్, బెజ్జాల అనిల్, యూత్ నాయకులు దొంగరి ఉపేందర్ లతోపాటు పలువురు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డిల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పతనం కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పోటీ కాదని, కేవలం బీజేపీ పార్టీనే కాంగ్రెస్ పార్టీకి పోటీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పాత, కొత్త కాకుండా అందరూ కలిసి పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు కల్పిస్తామన్నారు. త్వరలో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో 50వేల మెజార్టీ వచ్చే విధంగా కృషి చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement