Monday, April 29, 2024

ప్రైవేటు వాహనాలకు దీటుగా బస్సులను పెంచే యోచనలో ఆర్టీసీ.. పోటీని తట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రైవేటు వాహనాలను తట్టుకుని ఆదాయం పెంచుకునే దిశగా ఆర్టీసీ దృష్టి సారించింది. రాష్ట్ర్రంలో ప్రైవేటు వాహనాల సంఖ్య ఇప్పటికే కోటిన్నర మించినందున వాటి రూపంలో పోటీ భారీగానే ఉంటుందని భావిస్తున్న ఆర్టీసీ ఆ పోటీని తట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సులను పెంచడంతో పాటు ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించే విధంగా భారీ ఎత్తున ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ప్రజలు ప్రైవేటు వాహనాల్లో కాకుండా సురక్షితంగా గమ్యస్థానం చేరాలంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలన్న నినాదాన్ని దృశ్య, శ్రవణ మాధ్యమాల రూపంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. సోషల్‌ మీడియాలో ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితమనీ, ప్రైవేటు వాహనాలలో వెళితే నేరుగా యమలోకానికే అనే అర్థం వచ్చే విధంగా ప్రత్యేక యాడ్‌లను రూపొందించి వివిధ ప్రసార మాద్యమాలలో ప్రచారం చేస్తున్నది. దీనికి తోడు బస్సుల సంఖ్యను కూడా భారీగా పెంచనుంది.

ఇటీవలే కొత్తగా సమకూర్చుకున్న సూపర్‌ లగ్జరీ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్‌ ప్రారంభించారు. రాబోయే మూడు నెలల్లో కొత్తగా 760 బస్సులు ఆర్టీసీ యాజమాన్యం సమకూర్చుకోనుంది. దీంతో మొత్తంగా టీఎస్‌ ఆర్టీసీలో బస్సుల సంఖ్య 10 వేలకు చేరనుంది. గత రెండేళ్లుగా కరోనా, సమ్మె ప్రభావంతో ఆర్టీసీ భారీ నష్టాలను చవిచూసింది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా తరచూ పెరుగుతున్న డీజిల్‌ రేట్లు ఆర్టీసీని మరింత కునారిల్లే విధంగా చేశాయి. ఈ నేపథ్యంలో టీఎస్‌ ఆర్టీసీ ఆదాయం పెంచుకునే మార్గాలపై కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే కార్గో సర్వీసులను ప్రారంభించింది. అలాగే, పండుగల సందర్భంగా టికెట్‌ చార్జీపై రాయితీలు ప్రకటించడం ద్వారా కూడా గత ఏడాది ఆర్టీసీ భారీగా ఆదాయాన్ని పెంచింది.

గత ఏడాది రక్షా బంధన సందర్భంగా ప్రకటించిన రాయితీతో ఒక్క రోజే దాదాపు 40 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ప్రయాణించగా రూ.20 కోట్ల ఆదాయం సమకూరింది. ఏసీ బస్సులలో ప్రయాణించే ప్రయాణికులకు ఉచితంగా వాటర్‌ బాటిల్‌ సరఫరా వంటి పథకాల ద్వారా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను ఆకర్శించడంలో టీఎస్‌ ఆర్టీసీ సఫలమైంది. ఈ వినూత్న పథకాల అమలు ద్వారా ప్రస్తుతం సగటున రోజకు 30 లక్షల మంది ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తుండగా, గతంలో నెలకు రూ.100 కోట్ల నష్టాలలో ఉన్న ఆర్టీసీ వాటిని రూ.70 కోట్లకు తగ్గించుకోగలిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement