Sunday, April 28, 2024

రెవెన్యూ ప్రక్షాళన.. రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 17 తహసీల్దార్లకు స్థాన చలనం…

  • మరికొంతమందిని కూడా బదిలీ చేసే ఛాన్స్‌..
  • రెండేళ్లకు పైగా పని చేస్తున్న వారితోపాటు ఎడాదిలోపు వారికి కూడా బదిలీలు..
  • శివారు తహసీల్దార్లపై అవినీతి ఆరోపణలు..
  • 24 గంటల్లో విధుల్లో చేరాలని కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ ఆదేశం..

ఉమ్మడిరంగారెడ్డి, ప్రభన్యూస్ బ్యూరో : రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ నడుం బిగించారు. పెరుగుతున్న భూముల ధరలతోపాటు రెవెన్యూ పరమైన సమస్యలు పెరుగుతుండటంతో వాటిని పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా పెద్దఎత్తున తహసీల్దార్లను బదిలీ చేశారు. ఇందులో చాలాకాలంగా ఒకే ప్రాంతంలో పని చేస్తున్న వారితోపాటు ఏడాది లోపు ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. ఏకంగా 17మంది తహసీల్దార్లకు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. బదిలీ చేసిన వాళ్లు 24 గంటల్లో విధుల్లో చేరాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శివారు ప్రాంతాల్లో పని చేస్తున్న కొందరు తహసీల్దార్లపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోకపోవడం ప్రతి పనికి విలువ కట్టి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరిపై స్థానిక ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో బదిలీ అనివార్యమైందని తెలుస్తోంది…కొందరు శివారు తహసీల్దార్లపై ఏసీబీ కూడా ప్రత్యేక

దృష్టిని కూడా కేంద్రీకరించిందనే ప్రచారం కూడా ఉంది..

రంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్ల బదిలీ చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 17మందిని ఒకేసారి బదిలీ చేయడం ఆసక్తికరంగా మారింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత రెవెన్యూ వ్యవస్థపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. అందులో భాగంగానే రెండేళ్లు పూర్తి చేసుకున్న వారితోపాటు ఏడాది లోపు ఉన్న వారిని కూడా బదిలీ చేశారు. హైదరాబాద్‌ చుట్టూరా రియల్‌ వ్యాపారం పెరిగిపోయింది. దీంతో భూముల విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో శివార్లలో పోస్టింగ్‌ సంపాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. శివార్లలో కొందరు తహసీల్దార్లు అవినీతికి పాల్పడుతుండటం ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. కొందరు జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌కు కూడా నేరుగా ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. శివార్లలో విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. వీటిని కాపాలాడాల్సిన రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే శివార్లలో నిక్కచ్చిగా వ్యవహరించే అధికారులను నియమిస్తే విలువైన భూములను కాపాడటంతోపాటు అవినీతి తగ్గుతుందని జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ భావించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఏకంగా 17మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండుమూడు రోజుల్లో మరికొంతమందిని కూడా బదిలీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. బదిలీపై వెళ్లి ఏడాదిలోపు అవుతున్న కొందరు తహసీల్దార్లను కూడా బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అవినీతి ఆరోపణలు ఉన్న వారిని బదిలీ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ అవినీతి ఆరోపణలు లేనివారిని కూడా బదిలీ చేశారనే ప్రచారం సాగుతోంది. దీనిపై రెవెన్యూ సంఘం నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఏడాదిలోపు బదిలైన వారి పనితీరుపై ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే వారిని బదిలీ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కొన్ని మండలాల్లో రెండున్నర ఏళ్లు పూర్తి చేసుకున్న తహసీల్దార్లను బదిలీ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రెండవ విడతలో వీరిని బదిలీ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి….

అమావాస్య…మంగళవారం అడ్డు….

బదిలీ పై వెళ్లే తహసీల్దార్లు 24 గంటల్లో విధుల్లో చేరాలని జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బదిలీ ఉత్తర్వులు ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. సోమవారం అమావాస్య కావడంతో చాలామంది పోస్టింగ్‌ మండలాల్లో విధుల్లో చేరలేదు. దాంతోపాటు మరుసటి రోజు మంగళవారం కూడా కావడంతో చేరాలా వద్దా అని ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు మాత్రం కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ ఆదేశాలను పక్కాగా అమలు చేశారు.

- Advertisement -

బదిలైన తహసీల్దార్లు వీరే….

కృష్ణకుమార్‌ను కలెక్టరేట్‌లోని హెచ్‌ సెక్షన్‌కు బదిలీ చేశారు. శంకర్‌పల్లిలో పని చేస్తున్న సైదులును షాబాద్‌కు బదిలీ చేశారు. షాబాద్‌లో పని చేస్తున్న అమర్‌లింగంగౌడ్‌ను కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. మంచాల తహసీల్దార్‌గా పని చేస్తున్న దేవుజాను మాడ్గులకు బదిలీ చేశారు. మాడ్గులలో ఉన్న కృష్ణను తలకొండపల్లికి వెళ్లారు. తలకొండపల్లిలో పని చేస్తున్న శ్రీనివాస్‌ను చేవెళ్ల తహసీల్దార్‌గా నియమించారు. కలెక్టరేట్‌లో పని చేస్తున్న జయశ్రీని సరూర్‌నగర్‌కు బదిలీ చేశారు. సరూర్‌నగర్‌ తహసీల్దార్‌గా ఉన్న రామ్మోహన్‌రావును ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌గా నియమించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉన్న వెంకటేశ్వర్లును కలెక్టరేట్‌లోని డీ సెక్షన్‌కు బదిలీ చేశారు. మొయినాబాద్‌ తహసీల్దార్‌గా ఉన్న అనితారెడ్డిని అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌గా నియమించారు. ఇబ్రహీంపట్నంలో పని చేస్తున్న అనితను మంచాలకు బదిలీ చేశారు. హయత్‌నగర్‌ తహసీల్దార్‌గా పని చేస్తున్న సుచరితను యాచారం తహసీల్దార్‌గా నియమించారు. కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో పని చేస్తున్న సంధ్యారాణిని హయత్‌నగర్‌కు బదిలీ చేశారు. చేవెళ్ల తహసీల్దార్‌గా పని చేస్తున్న అశోక్‌కుమార్‌ను మొయినాబాద్‌ తహసీల్దార్‌గా నియమించారు. కలెక్టరేట్‌లోని పని చేస్తున్న నయిముద్దీన్‌ను శంకర్‌పల్లికి బదిలీ చేశారు. యాచారం తహసీల్దార్‌గా పని చేస్తున్న మహమూద్‌ఆలీని కందుకూరు రెవెన్యూ డివిజన్‌కు బదిలీ చేశారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో పని చేస్తున్న మహమ్మద్‌ ను మాడ్గుల తహసీల్దార్‌గా నియమించారు.

నలుగురు నయాబ్‌ తహసీల్దార్లు కూడా….

జిల్లాలో 17మంది తహసీల్దార్లతోపాటు నలుగురు నయాబ్‌ తహసీల్దార్లను కూడా బదిలీ చేశారు జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌. హయత్‌నగర్‌ నయాబ్‌ తహసీల్దార్‌గా పని చేస్తున్న కిష్టయ్యను చేవెళ్లకు బదిలీ చేశారు. ఈయన ఎలక్షన్‌ వింగ్‌లో పని చేయాల్సి ఉంటుంది. కందుకూరులో పని చేస్తున్న శ్రీధర్‌ను మహేశ్వరం ఎలక్షన్‌ వింగ్‌కు బదిలీ చేశారు. చేవెళ్ల ఎలక్షన్‌ వింగ్‌లో నయాబ్‌ తహసీల్దార్‌గా పని చేస్తున్న శంషోద్దీన్‌ను హయత్‌నగర్‌ నయాబ్‌ తహసీల్దార్‌గా నియమించారు. మహేశ్వరంలో పని చేస్తున్న తాజుద్దీన్‌ను కందుకూరు మండలానికి నయాబ్‌ తహసీల్దార్‌గా నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement