Tuesday, May 7, 2024

రాజ్యసభ ఎంపీ పదవికే రిటైర్మెంట్.. రాజకీయాలకు, సేవకు కాదు : టీజీ వెంకటేష్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాజ్యసభ ఎంపీ పదవికే గానీ రాజకీయాలకు, తన సేవలకు రిటైర్మెంట్ ఉండదని బీజేపీ పార్లమెంట్ సభ్యులు టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. తాను ఛైర్మన్‌గా ఉన్న వివిధ కమిటీల ద్వారా రెండు రాష్ట్రాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించానని సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఆయన ఆంధ్రప్రదేశ్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై స్పందించారు. జేపీ నడ్డా ఈనెల 6,7 తేదీల్లో ఏపీ పర్యటనకు వస్తున్నారని, ఆయన మాటలు విన్నాక బీజేపీకి ఎందుకు ఓటు వేయలేదా అని ప్రజలు ఆత్మవిమర్శ చేసుకుంటారని టీజీ అభిప్రాయపడ్డారు. మోదీ ఈమధ్య కుటుంబ పాలన అంటూ విమర్శించారని, పార్టీని పూర్తిగా ఒక కుటుంబం ఆధీనంలో పెట్టుకుంటే దాన్ని కుటుంబ పాలన అంటారని ఆయన భాష్యం చెప్పారు. అంతే తప్ప తండ్రి, ఆ తర్వాత కొడుకు పదవుల్లో ఉంటే కుటుంబ పాలన కాదని చెప్పుకొచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర సంక్షేమం మర్చిపోయి దేశమంతా తిరిగారని, ఇప్పుడు తెలంగాణ సీఎం కూడా అలాగే చేస్తున్నారని టీజీ వెంకటేష్ ఎద్దేవా చేశారు.

కేసు వెనుక కుట్ర కోణం..

చంద్రబాబు 24 గంటలూ అమరావతి అనడం వల్ల టీడీపీ మిగతా ప్రాంతాల్లో దెబ్బ తిన్నదని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్ అని పెట్టడం వల్ల కోర్టుల్లో సమస్యలు లేకుండా అన్ని ప్రాంతాలకు న్యాయం చేయవచ్చని సూచించారు. ఆలయాల మీద దాడులు జరిగినప్పుడు ఆ పార్టీ వాళ్ళు చేశారు, ఈ పార్టీ వాళ్ళు చేశారని మాట్లాడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. మైనారిటీలకు మనదేశం చాలా పెద్దపీట వేసిందని, అందుకే పాకిస్తాన్‌లో మైనారిటీల సంఖ్య తగ్గుతుంటే, దేశంలో పెరుగుతోందని టీజీ అభిప్రాయపడ్డారు. వివిధ కమిటీలకు ఛైర్మన్‌గా ఉంటూ రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని తెలిపారు. సంపద వృద్ధిపై దృష్టి పెట్టండి, అభివృద్ధి రాజకీయాలు చేయండంటూ ఆయన హితవు పలికారు. తాను లక్షద్వీప్ పర్యటనలో ఉండగా ఏప్రిల్ 17న తనపై ఓ భూకబ్జా కేసు పెట్టారని చెప్పుకొచ్చారు. ఆ కేసును తెలిసి పెట్టారా? పొరపాటున పెట్టారా? దీని వెనుక ఎవరున్నారనేది త్వరలోనే తెలుస్తుందని టీజీ వెంకటేష్ వెల్లడించారు. ఆ సమయంలో రాజకీయాలకతీతంగా వివిధ పార్టీల నాయకులు తనకు మద్దతునిచ్చి నైతిక స్థైర్యమిచ్చారని హర్షం వ్యక్తం చేశారు. రాజ్యసభకు తిరిగి నామినేట్ అయ్యే సమయంలో తనపై కేసు నమోదు కావడం వెనుక కుట్ర ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ కమిషనర్, తెలంగాణా డీజీపీని కలుస్తానని, ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తానని టీజీ వెంకటేష్ తెలిపారు. వారి నుంచి స్పందన లేకపోతే, 50 కోట్ల రూపాయల మేర పరువు నష్టం దావా వేస్తానని ఆయన వెల్లడించారు. ఈ కేసు ఉండడం వల్లే కేంద్ర హోంమంత్రిని కలవలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పదేళ్ల వయసు నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉందని, 12 ఏళ్ల వయసులోనే జిల్లా స్థాయిలో విద్యార్థి పరిషత్ నాయకుడిగా వ్యవహరించానని తెలిపారు. యువ మోర్చాలో జాతీయ స్థాయిలో పని చేశానని, సంఘ్ పరివార్‌తో ఎంతో కాలంగా అనుబంధం ఉందని టీజీ వెంకటేష్ ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. తన తదుపరి కర్తవ్యం ఏమిటో బీజేపీ అగ్ర నాయకత్వం నిర్ణయానికే వదిలిపెట్టానని వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement