Thursday, May 2, 2024

Delhi | వీర్రాజును తొలగించండి, పార్టీని కాపాడండి.. మంత్రి మురళీధరన్‌ను కోరిన ఏపీ బీజేపీ నేతలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగంలో అసమ్మతి సెగలు హస్తినను తాకాయి. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి ఇద్దరు చొప్పున నేతలు ఢిల్లీ చేరుకుని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ను కలిశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుపై ఫిర్యాదు చేశారు. ఆయన వ్యవహారశైలి కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోతోందని స్పష్టం చేశారు. అధిష్టానం జోక్యం చేసుకోకపోతే పార్టీ మరింత నష్టపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాబలం ఉన్న కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలు పార్టీని వీడి వెళ్ళడం వెనుక సోము వీర్రాజు వ్యవహారశైలే కారణమని నిందించారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయకుండా, పార్టీలో జిల్లా అధ్యక్షులను, మండలాధ్యక్షులను ఇష్టారీతిన మార్చుతున్నారని, సీనియర్ నేతలను అవమానాలకు గురిచేస్తున్నారని సోము వీర్రాజుపై నేతలంతా మండిపడ్డారు. పార్టీలోని కొందరిపై ఆయన కక్షగట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.

బీజేపీ కృష్ణా జిల్లా మాజీ అధ్యక్షులు కుమారస్వామి, శ్రీకాకుళం జిల్లా మాజీ అధ్యక్షులు భాస్కర్ నేతృత్వంలో సుమారు 26 మంది నేతలు గురువారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. నేతల బృందంలో పార్టీ సీనియర్ నేత దారా సాంబయ్య, పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి శ్యామ్ కిశోర్, మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే బాజి, బొడ్డు నాగలక్ష్మి, శ్రీనివాస రాజు తదితరులున్నారు. మధ్యాహ్నం గం. 2.30 సమయంలో వీరంతా ఢిల్లీలోని సునేరీ బాగ్‌లో ఉన్న కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ నివాసానికి చేరుకున్నారు. అయితే ఆ సమయానికి మంత్రి ఇంట్లో లేరు. మధ్యాహ్నం గం. 3.30 సమయంలో ఆయన ఇంటికి చేరుకున్నారు. తన కోసం ఎదురుచూస్తున్న నేతల బృందాన్ని చూసి ఆయన ఒకింత అసహనానికి గురైనట్టు తెలిసింది. ఇంత మంది నేతలు ఎందుకొచ్చారంటూ ప్రశ్నించారు. తాను తరచుగా రాష్ట్రానికి వస్తూనే ఉంటానని, అలాంటప్పుడు అక్కడే కలిసి చెప్పాల్సినవి ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా అని అన్నారు.

- Advertisement -

అసమ్మతి ప్రదర్శన భారతీయ జనతా పార్టీ సంస్కృతిలో లేదని, ఇలా ఇంత మంది నేతలు కట్టగట్టుకుని రావడం సరికాదని మందలించినట్టు తెలిసింది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరుండాలన్నది అధిష్టానం నిర్ణయమని, అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించకూడదని హితవు పలికినట్టు సమాచారం. పార్టీలో అంతర్గతంగా సమస్యలేమున్నా రచ్చ చేయకూడదని, నేరుగా తనను సంప్రదించవచ్చని వెల్లడించారు. తన సొంత రాష్ట్రం కేరళకు ప్రయాణమైన మురళీధరన్, నేతలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయారు. ఇక నుంచి తాను ప్రతి 15 రోజులకు ఒకసారి రాష్ట్రానికి వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటానని, ఏదున్నా తన దృష్టికి తీసుకురావాలని, కలవడం కుదరకపోతే లిఖితపూర్వకంగా అందజేయాలని నేతలకు చెప్పారు. అలకలు, అసంతృప్తి, అసమ్మతితో పదవులు రావని, క్రమశిక్షణతో పార్టీ ఎదుగుదల కోసం పనిచేయాలని వారందరికీ హితవు పలికారు.

ప్చ్.. ఉపయోగం లేదు

మురళీధరన్‌తో భేటీ అనంతరం బయటికొచ్చిన నేతల్లో అసంతృప్తి కనిపించింది. తాము వస్తున్న విషయం సోము వీర్రాజు వర్గం ముందే పసిగట్టి, తమకు వ్యతిరేకంగా మురళీధరన్‌కు చెప్పారని, అందుకే ఆయన ముందే ఏర్పర్చుకున్న ఒక అభిప్రాయంతో మాట్లాడారని కొందరు నేతలు పెదవి విరిచారు. తమ సమస్యలను చెప్పుకునే అవకాశం అందరికీ దక్కలేదని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత కష్టపడి ఢిల్లీకి వచ్చినా ఉపయోగం లేకపోయిందని, ఏదైనా చెప్పుకుందామంటే భాష కూడా సమస్యగా మారిందని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇద్దరు నేతలు మాత్రం బయట ఎదురుచూస్తున్న మీడియా కెమేరాల ముందుకొచ్చి మాట్లాడారు. సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్నంత కాలం పార్టీ మెరుగుపడకపోగా, మరింత నష్టపోతుందని వారన్నారు.

రాత్రికి రాత్రే జిల్లాల అధ్యక్షులను మార్చుతూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని, ఈ నిర్ణయంతోనే తామంతా మనస్తాపం చెందామని చెప్పారు. ఇదే విషయాన్ని మురళీధరన్‌తో చెప్పామన్నారు. కార్యకర్తల మనోభావాలను ఆయన అర్థం చేసుకున్నారని, రాష్ట్ర అధ్యక్షుణ్ణి మార్చినా, మార్చకపోయినా తాము పార్టీ శ్రేయస్సు కోసం పనిచేస్తామని, ఇదే బీజేపీ విధానమని చెప్పారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. వచ్చిన నేతల బృందంలో ఏ ఒక్కరూ కన్నా లక్ష్మీనారాయణ వర్గం కాదని, కాకపోతే ఆయన పార్టీ వీడి వెళ్తూ చేసిన వ్యాఖ్యలు తమ వాదనతో ఏకీభవించి ఉండవచ్చని అన్నారు. అలాగే తమలో ఏ ఒక్కరూ తెలుగుదేశం పార్టీతో పొత్తు కోరుకోవడం లేదని, బీజేపీ సొంతంగా బలపడాలన్నది తమ అభిమతమని స్పష్టం చేశారు.

లీకు వీరులపై విచారణ కమిటీ!

పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్న విషయాలు మీడియాకు లీకవడంపై బీజేపీ అధిష్టానం ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. పార్టీ సీనియర్ నేతలు, కోర్ కమిటీ నేతలకు మాత్రమే పరిమితమైన సమావేశాల్లో చర్చించే విషయాలు సైతం లీక్ అవుతున్నాయని గుర్తించింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలకు కొందరు పనిగట్టుకుని లీక్ చేస్తున్నారని గుర్తించింది. పేరుకు బీజేపీలో ఉన్నా.. తెలుగుదేశం పార్టీ ఎజెండాను అమలు చేయాలని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కోరుకుంటున్న వర్గం నేతలే ఈ చర్యలకు పాల్పడుతున్నట్టు గమనించింది. అయితే ఈ లీకులపై పార్టీ ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. విషయాలను ఎవరు లీక్ చేస్తున్నారో తెలుసుకుని, వారిపై పార్టీ క్రమశిక్షణాపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement