Friday, May 17, 2024

గ్రూప్‌-3కు 5,36,477 దరఖాస్తులు.. ఒక్కో పోస్టుకు 390 మంది పోటీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రూప్‌-3 పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ గురువారంతో ముగిసింది. మొత్తం 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. త్వరలోనే పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది. రాష్ట్రంలోని 1,375 గ్రూప్‌-3 పోస్టులకు జనవరి 24వ తేదీ నుంచి ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించారు. ముందస్తుగా 1363 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ విడుదల చేయగా, తర్వాత ప్రభుత్వం మరో 12 పోస్టులను కలిపింది. దరఖాస్తుల సంఖ్యను బట్టి ఒక్కో గ్రూప్‌-3 పోస్టుకు 390 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు టీఎస్‌పీఎస్‌సీ మొత్తం 26 నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. వీటిలో వివిధ కేటగిరీల్లో 17,134 ఖాళీలున్నాయి.

అయితే ఏదైనా నోటిఫికేషన్‌కు సంబంధించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే టీఎస్‌పీఎస్‌సీ వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) చేసుకొని ఆన్‌లైన్‌లో దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి టీఎస్‌పీఎస్‌సీ నిర్దిష్ట సమయం ఇస్తుంది. అయితే గతంలో జారీ చేసిన కొన్ని నోటిఫికేషన్ల దరఖాస్తు ప్రక్రియను పరిశీలిస్తే టీఎస్‌పీఎస్‌సీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అభ్యర్థులు దరఖాస్తు సమర్పణను మొదటి రెండు మూడు రోజులు, చివరి రెండు మూడు రోజుల్లోనే ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ గుర్తించింది. అంతేకాకుండా హాల్‌టికెట్లను కూడా చివరి రోజుల్లోనే డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి మొగ్గు చూపారు. .

- Advertisement -

దాదాపు 80 శాతం మంది అభ్యర్థులు ఇలానే దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. చివరి రోజుల్లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేయడం ద్వారా హైల్‌టికెట్లపై ఉన్న ముఖ్యమైన సూచనలను చదవకపోవడంతో పరీక్షా కేంద్రంలో ఓఎంఆర్‌ షీట్‌ను బబ్లింగ్‌ చేయడంలో విఫలమై తప్పులు చేస్తున్నారని తెలిపింది. ఇంకా కొంతమందైతే ఇతర పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా చేరుకుంటున్నారని వెల్లడించింది. దరఖాస్తులో ఉన్న ఫోటోలు సరిగా లేకుంటే అలాంటి అభ్యర్థులు గెజిటెడ్‌ అధికారితో 2 ఫోటోలు అటెస్ట్‌ చేయించుకోవాలి. చివరి రోజుల్లో డౌన్‌లోడ్‌ చేయడం ద్వారా అలాంటి అవకాశాన్ని అభ్యర్థులు కోల్పోతారని టీఎస్‌పీఎస్‌సీ వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement