Tuesday, April 30, 2024

రబీలో రికార్డు స్థాయిలో ఈ-క్రాప్‌ బుకింగ్‌.. 45.30 లక్షల ఎకరాల్లో రబీ సాగు

అమరావతి : ఆంధ్రప్రభ: ఈ ఏడాది రబీ సాగుకు సంబందించి రికార్డు స్థాయిలో పంటల నమోదు కార్యక్రమం జరిగింది. ఇప్పటి వరకూ 96 శాతం నమోదు కాగా ఈ నెల 20వ తేదీ నాటికి వంద శాతం పూర్తి చేయాలని. వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి సాగుతో పాటు ఈ-క్రాప్‌ నమోదు, ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సాగైన విస్తీర్ణంలో 96 శాతం ఈ-క్రాప్‌ నమోదు పూర్తికాగా, ఈ-కేవైసీ 55 శాతం పూర్తయింది. ఈ నెల 20వ తేదీలోగా 100 శాతం పంటల నమోదుతోపాటు ఈ-కేవైసీ పూర్తిచేయాలనే లక్ష్యంతో వ్యవసాయశాఖ ముందుకెళ్తోంది. గత ఆనుభవాలను దృష్టిలో పెట్టుకుని రబీసీజన్‌ నుంచి ఈ-క్రాప్‌ నమోదులో పలు సంస్కరణలు తీసుకొచ్చింది. నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) సౌజన్యంతో రూపొందించిన యాప్‌ ద్వారా డిసెంబర్‌ 8వ తేదీన ఈ-క్రాప్‌ నమోదుకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ గ్రామాల వారీగా వెబ్‌ల్యాండ్‌ డేటాతోపాటు పంట సాగుహక్కుపత్రాల (సీసీఆర్సీ) డేటా ఆధారంగా ఈ-క్రాపింగ్‌ చేస్తున్నారు. దీంతోపాటు- సమాంతరంగా రైతుల వేలిముద్రలు (ఈ-కేవైసీ) తీసుకుంటున్నారు.

గతేడాది డిసెంబర్‌లో విరుచుకుపడిన మాండూస్‌ తుపాన్‌ వల్ల దెబ్బతిన్న పంటల స్థానే రెండోసారి విత్తుకున్న పంటల వివరాలను స్థానిక వ్యవసాయాధికారి ధ్రువీకరణతో నమోదు చేస్తున్నారు. ప్రైవేటు విత్తన కంపెనీల కోసం విత్తనోత్పత్తికి సాగుచేసే పంటల వివరాలను సర్వే నంబర్ల వారీగా నమోదు చేస్తున్నారు. ఆయా సర్వే నంబర్లలో సాగైన పంటను కొనుగోలు చేయడానికి వీల్లేకుండా ఈ మార్పుచేశారు. సీజన్‌లో ఒకసారి పంట నమోదైన తర్వాత సాగుకాలం ముగిసేవరకు రెండోసారి పంట నమోదు కాకుండా లాకింగ్‌ సిస్టమ్‌ తీసుకొచ్చారు. ‘ఈ-ఫిష్‌’ ద్వారా ఆక్వా సాగవుతున్నట్టుగా గుర్తించిన సర్వే నంబర్లను ఈసారి ఈ-క్రాప్‌లో బ్లాక్‌ చేశారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఈ-క్రాప్‌, ఈ-కేవైసీ నమోదుతోపాటు మండల వ్యవసాయాధికారుల నుంచి కలెక్టర్ల వరకు ర్యాండమ్‌గా చెక్‌ చేస్తున్నారు.

- Advertisement -

గతంలో ఈ-క్రాప్‌, ఈ-కేవైసీ ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఈ తనిఖీలు చేసేవారు. మండల, డివిజన్‌, జిల్లాస్థాయిల్లో తనిఖీ కోసం ఎంపికచేసిన పంట వివరాలను సైతం కమిషనరేట్‌ నుంచే జిల్లాలకు పంపిస్తున్నారు. ఆ మేరకు ర్యాండమ్‌గా తనిఖీచేసి క్షేత్రస్థాయిలో గుర్తించిన లోటుపాట్లను సరిదిద్దుకునేలా మార్పుచేశారు. ప్రతి 15 రోజులకోసారి ర్యాండమ్‌గా చెక్‌ చేస్తున్నారు. ఈ-క్రాప్‌ నమోదు కాగానే రైతుల మొబైల్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌లు, ఈ-కేవైసీ పూర్తికాగానే భౌతిక రసీదులు ఇస్తున్నారు. 43.62 లక్షల ఎకరాల్లో పంటల నమోదు రబీ సీజన్‌లో సాధారణ సాగువిస్తీర్ణం 57.30 లక్షల ఎకరాలుకాగా ఈ ఏడాది 58 లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 45.31 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇప్పటివరకు 43.62 లక్షల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 20వ తేదీలోగా ఈ-క్రాప్‌ నమోదు, ఈ-కేవైసీ నూరుశాతం పూర్తిచేసి, సామాజిక తనిఖీల్లో భాగంగా 28వ తేదీ వరకు ఆర్బీకేల్లో ప్రదర్శనకు ఉంచనున్నారు. రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత మార్చి 7వ తేదీన తుది జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement