Friday, April 26, 2024

పేదల సొంతింటి కల సాకారం.. మరో 95వేల డబుల్ ​బెడ్రూంలకు ఆమోదం!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలకు రెండు పడక గదుల ఇండ్ల సంఖ్యను పెంచుతూ సర్కార్‌ సంచలనాత్మక నిర్ణయాన్ని అమలు చేసేందుకు సమాయత్తమవుతున్నది. గతంలో నిర్ణయించిన కోటాకు అదనంగా ఒక్కో నియోజకవర్గానికి 1000 ఇండ్లను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఇక వేగంగా అమలు చేయాలని సంకల్పించింది. తద్వారా రాష్ట్రంలో గూడులేని నిరుపేదల కలలను సాకారం చేసేదిశగా సర్కార్‌ వేగం పెంచింది. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల నియోజకవర్గాలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత పేర్కొన్న సంఖ్యకు అదనంగా నియోజకవర్గానికి మరో 1000 ఇండ్ల చొప్పున రాష్ట్రంలోని 95 నియోజకవర్గాలకు 95వేల రెండు పడక గదుల ఇండ్లకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం నిధుల కేటాయింపు, భూ సేకరణ, కాంట్రాక్టర్ల గుర్తింపు వంటి చర్యలు తీసుకుంటోంది. తాజా పెంపు నిర్ణయంతో గ్రామీణ పేదలకు మరింత లబ్ది చేకూరనుంది. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగతా 95 నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి 1000 చొప్పున అదనపు ఇండ్లను మంజూరీ గతంలో సీఎం కేసీఆర్‌ విప్లవాత్మక నిర్ణయం ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 95 నియోజకవర్గాలకు 95వేల అదనపు ఇండ్లను మంజూరీ చేస్తూ గృహనిర్మాణ శాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అనివార్య కారణాలతో ఈ పథకానికి ఆటంకాలు ఎదురయ్యాయి. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని దరఖాస్తుల వడపోత పూర్తవుతోంది. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు జాప్యం కాకుండా, సొంత జాగ ఉన్నవాళ్లకు రూ. 3లక్షల ఆర్ధిక సాయం వంటి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

గతంలో సర్కార్‌ నియోజకవర్గాల వారీగా పెంచుతూ నిర్ణయించిన డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు జిల్లాల వారీగా… మహబూబ్‌నగర్‌లోని 14 నియోజకవర్గాలకు 14వేలు, వరంగల్‌లో 12వేలు, రంగారెడ్డి 6వేలు, మెదక్‌ 9వేలు, ఆదిలాబాద్‌ 10వేలు, నిజామాబాద్‌ 9వేలు, కరీంనగర్‌ 13వేలు, ఖమ్మం 10వేలు, నల్గొండ జిల్లాకు 12వేల ఇండ్లను ప్రభుత్వం కేటాయించింది. 2015–16 ఆర్ధిక ఏడాదిలో 72 వేల ఇండ్లను ప్రభుత్వం మంజూరీ చేసింది. నియోజకవర్గానికి 400ఇండ్లతోపాటు ముఖ్యమంత్రి కోటాలో కొన్ని యోజకవర్గాలకు అదనపు ఇండ్లను కేటాయించింది. 2016-17లో కూడా 2లక్షల ఇండ్లను ప్రభుత్వం మంజూరీ చేసింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లు, మిగతా ప్రాంతాలకు మరో లక్ష ఇండ్లను కేటాయించింది. అయితే ఇందులోనుంచి 95వేల ఇండ్లను జిల్లాలవారీగా మంజూరీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది.

రాష్ట్రంలో తీరిది…

రాష్ట్రంలో 56,43,739ఆవాసాలుండగా ఇందులో 51,96,080 మందికి సొంత నివాస గృహాలున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇతర నివాసాల్లో 31,432మంది, 4,09,346 మంది అద్దె గృహాల్లో ఉంటున్నారని ప్రభుత్వం వద్ద వివరాలు ఉన్నాయి. 2004 వరకు 17,34,826 ఇండ్లను వివిధ పథకాల్లో భాగంగా తెలంగాణలో నిర్మించినట్లు లెక్కలున్నాయి. అయితే గూడులేని నిరుపేద అర్హులైన లబ్దిదారులు మరికొందరు ఉన్నారని భావ్చిింన సర్కార్‌ వారి కోసం ఉచితంగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను కట్టించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌లో బహుళ అంతస్తుల భవనాలను, గ్రామీణ ప్రాంతాల్లో రెండు పడక గదుల ఇండ్లను అందించాలని సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యతగా పెట్టుకున్నారు. రాష్ట్రంలోని 56,43,739 ఇండ్లలో పక్కా గృహాలు 50,59,872, కచ్చా గృహాలు 5,77,691, సింగిల్‌ రూం ఇండ్లు 7,54,416, రెండు రూముల ఇండ్లు 28,19,737, 3కు మించిన గదులు 5,69,198 ఉన్నాయని గుర్తించారు.

నిధులు ఇలా…

- Advertisement -

ఇందుకు గానూ నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం వివిధ మార్గాల్లో ప్రయత్నాలను చేస్తోంది. రూ. 17,660కోట్లను వివిధ మార్గాల్లో సమీకరించుకుంది. రూ.15,900 కోట్లను హడ్కోద్వారా సేకరించింది. దీనికి ఉచితంగా ఇసుకతోపాటు బస్తాకు రూ. 230తో సిమెంట్‌ను అందించేందుకు 31 కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయంతో తెలంగాణలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణంలో మరింత వేగం పుంజుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement