Friday, April 19, 2024

‘పాలమూరు’ పనుల్లో స్పీడ్​.. ఆన్‌గోయింగ్‌ పనులను అడ్డుకోవద్దని ఎన్‌జీటీకి తెలంగాణ విజ్ఞప్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలోని వివిధ కాంపోనెంట్లలో కొనసాగుతున్న పనులను మరింత వేగంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పాలమూరు-రంగారెడ్డికి పర్యావరణ అనుమతుల విషయంలో వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు (ఎన్‌జీటీ)కి విన్నవించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పర్యావరణ అనుమతులు తెచ్చేందుకు మరో ఏడాది సమయం ఇవ్వాలని ఎన్‌జీటీని కోరారు. వివిధ కాంపోనెంట్ల కింద కొనసాగుతున్న పనులను పూర్తి చేస్తామని, కాని ఎన్‌జీటీ అనుమతి, పర్యావరణ అనుమతులు వచ్చాకే వాటిని ఎత్తిపోతల పథకానికి అనుసంధానిస్తామని పేర్కొన్నారు.

పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల్లో జాప్యం నెలకొనడంతో మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్‌, నల్గొండ జిల్లాలకు తాగునీటి సరఫరాలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ ప్రాంతాలన్నీ కృష్ణా బేసిన్‌లోనే ఉన్నా తీవ్ర కరువును ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా 70 మండలాల్లోని 1226 గ్రామాలకు తాగునీరు అందనుందని పేర్కొన్నారు. తెలంగాణ రాజధాని జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాలకూ తాగునీరు అందనుందని చెప్పారు. వర్షాకాలంలో కృష్ణా నదిలో సమృద్ధిగా వరద జలాలు ఉన్నపుడు, అది కూడా ప్రతి ఏడాది నిర్ణీత మూడు నెలల సమయంలో మాత్రమే 90 టీఎంసీలను ఎత్తిపోసేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను చేపట్టినట్లు చెప్పారు. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటిని తరలించనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement