Saturday, April 27, 2024

జట్టులో కరోనా కలకలంపై స్పందించిన రవిశాస్త్రి

ఇంగ్లండ్ తో టీమిండియా ఐదో టెస్టు రద్దు అయిన విషయం తెలిసిందే. టీమిండియా సహాయక సిబ్బందిలో పలువురికి కరోనా సోకడంతో మ్యాచ్ రద్దయింది. టీమిండియాలో కరోనా రావడానికి కారణం కోచ్ రవిశాస్త్రి, ఆయన సహాయక బృందమే కారణమని తెలిసిందే. రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, జూనియర్ ఫిజియో నితిన్ పటేల్ కరోనా బారినపడడంతో టీమిండియా ఐదో టెస్టుకు సరిగా సన్నద్ధం కాలేకపోయింది. ఆటగాళ్లు కూడా మైదానంలో దిగేందుకు సంశయించారు. ఈ నేపథ్యంలో చివరి టెస్టు అనూహ్యరీతిలో ప్రారంభం కాకుండానే రద్దయింది. రవిశాస్త్రి తదితరులు ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లి కరోనా బారినపడ్డారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోచ్ రవిశాస్త్రి ఎట్టకేలకు స్పందించారు.

బ్రిటన్ లో కరోనా ఆంక్షలు ఎత్తివేశారని, దేశంలో అన్నీ తెరుచుకున్నాయని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి టెస్టు నుంచే ఏదైనా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ఈ పర్యటనలో భారత జట్టు అద్భుత ప్రతిభ కనబర్చిందని రవిశాస్త్రి వెల్లడించారు. ప్రత్యేకించి కరోనా సంక్షోభ సమయంలోనూ తిరుగులేని ఆటతీరు ప్రదర్శించారని కొనియాడారు. కాగా చివరి టెస్టు అవాంఛనీయ రీతిలో రద్దు కావడం పట్ల ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తీవ్ర నిరాశకు గురైనట్టు పేర్కొన్నాడు. సిరీస్ లో చివరి మ్యాచ్ ను ఆస్వాదిద్దామని భావించామని, కానీ ఈ విధంగా ముగియడం సిగ్గుచేటని వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ ను రీషెడ్యూల్ చేస్తారని ఆశిస్తున్నానని తెలిపాడు.

ఇది కూడా చదవండి: IPl కోసం కరోనా బూచిని చూపి టీమిండియా డ్రామాలాడింది: వాన్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement