Saturday, May 18, 2024

తెలంగాణలో రాజ్య‌హింస పాలన… సీఎల్పీ నేత భట్టి

బాలాపూర్, మే 9, ప్రభ న్యూస్ : తెలంగాణను సాధించుకొని రాష్ట్రాన్ని రాజ్య‌హింస పాలకుల చేతుల్లో పెట్టి తెలంగాణ ప్రజలు నరకం అనుభవిస్తున్నారని, అందుకే పీపుల్స్ మార్చ్ పేరుతో ప్రజల వద్దకే వెళ్లి వారికి భరోసా ఇస్తున్నామ‌ని, వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు గుణపాఠం చెప్పడం తప్పదని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క హెచ్చరించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలంలో 500 ఎకరాల పేదల భూమిని అప్పనంగా ఫార్మాసిటీకి అప్పగించింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంను గద్దె దించడమే కాంగ్రెస్ పార్టీకి ముందున్న సవాల్ అని సిఎల్పి నాయకులు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపాలిటీ జిల్లెలగూడలో పీపుల్స్ మార్చ్ పాదయాత్రను మల్లు భట్టి విక్రమార్క నాయకత్వంలో ప్రారంభించారు. పాదయాత్ర మీర్పేట్, అల్మాస్ గూడ బడంగ్ పెట్, నాగర్ గుల్ ప్రాంతాల మీదుగా పాదయాత్ర సాగింది. పాదయాత్రలో ప్రజా గాయకులు గద్దర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి, బడంగ్పేట్ మున్సిపల్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, పిసిసి సభ్యులు యేల్మెటి అమరేందర్ రెడ్డి, దేప భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భ‌ట్టి విక్రమార్క మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో రాజ్యహింస భయంకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూస్తున్నట్లు ఉంద‌ని తెలిపారు.
ప్రశ్నించిన వారిపై కేసులు, నిలదీస్తే నిర్బంధం, ఎదురు తిరిగితే లాఠీ చార్జీలు, హక్కుగా ఇచ్చిన భూమిలో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తూ రాజధాని నడిబొడ్డున రాజ్యహింస భయంకరమైన పరిస్థితి ఎలా ఉంటుందో బీఆర్ఎస్ సర్కార్ చూపిస్తుందన్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిశ్శబ్దంగా, మౌనంగా, కనిపించకుండా ప్రభుత్వం రాజ్య హింస చేస్తుందని తెలిపారు.
ప్రభుత్వ ధమనకాండపై ప్రజాసంఘాలు, సామాజిక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు పేదలకు అండగా నిలబడేవి.. కానీ ఇప్పుడు పేదల భూములను బలవంతంగా గుంజుకుంటున్నా ఏ ఒక్కరూ నోరు మెదపకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు హక్కుగా పేదలకు ఇచ్చిన భూమి లాక్కునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే ఐదు లక్షల కోట్ల విలువైన పదివేల ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం పేదలను భయపెట్టి బలవంతంగా గుంజుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని చుట్టూ 25 లక్షల కోట్ల విలువైన పేదల భూములను ఈ ప్రభుత్వం గుంజుకున్నదని, ఇది పేదల పట్ల జరుగుతున్న అతిపెద్ద కుట్ర అని ఆరోపించారు.

పేదల నుంచి గుంజుకున్న భూములను సంపన్న వర్గాలకు, కంపెనీలకు, హెచ్ఎండీఏ లేఔట్ చేయడానికి కేటాయించడం దుర్మార్గ చర్యని అన్నారు. గత ప్రభుత్వాలు హక్కుగా ఇచ్చిన భూములు గుంజుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. వచ్చే జూన్ మాసంలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే లోపు మీ భూముల్లో మీరు అరక పట్టి దుక్కి దున్నుకొని పంట పండించుకోవడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మీకు ఇచ్చిన ఇంటి స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి సమాయత్తం కావాల‌న్నారు. ఎవరు అడ్డువస్తారో చూస్తామ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్, నాదర్గుల్, ఆల్మాస్ గూడ, మామిడిపల్లిలో గత కాంగ్రెస్ ప్రభుత్వం 4వేల మంది పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను బలవంతంగా గుంజుకోవడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన కట్టింది కూలగొట్టు.. కమిషన్లు కొట్టు.. ఎన్నికల్లో పంచి పెట్టు.. గద్దెనెక్కు అన్న చందంగా నడుస్తుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల విప్లవం రావలసిన సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు ఈ ప్రభుత్వాలు అవ‌లంబిస్తున్న విధానాలను వివరించి చైతన్య పరిచి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపే విధంగా ఓట్లు పోలరైజ్ చేసుకోవాలని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రశ్నించే వాళ్లు లేకుండా పోతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమ‌ని హెచ్చరించారు. చల్ల నరసింహారెడ్డి మాట్లాడుతూ… మహేశ్వరం నియోజకవర్గంలో భ‌ట్టి విక్రమార్క పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు తెలిపారు. మేయర్ పారిజాత నరసింహారెడ్డి మాట్లాడుతూ… బడంగ్పేట్ లో ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నారని ప్రశ్నిస్తే కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెడతారని ఆరోపించారు. ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తారని తెలిపారు. ఇచ్చిన మాట తప్పని కుటుంబం గాంధీ కుటుంబం అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు పెద్దబావి వెంకటరెడ్డి, కార్పొరేటర్స్ ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, రాళ్ల గూడెం సంతోషం శ్రీనివాస్ రెడ్డి, చల్ల కవిత బాల్ రెడ్డి, బండారి మనోహర్, సిద్దాల మౌనిక శ్రీశైలం, అమృత నాయుడు, బోయపల్లి రాఘవేంద్ర రెడ్డి బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, నవారు మల్లారెడ్డి, గట్టు బాలకృష్ణ, సుర్ణ గంటి విజయ్, పెద్ద ఎత్తున‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement