Wednesday, May 8, 2024

రాజీవ్‌ స్వగృహ అపార్ట్‌మెంట్లు.. కొందామా, వ‌ద్దా?.. సందేహిస్తున్న కొనుగోలుదారులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల వేలానికి ఒకవైపు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంటే మరోవైపు వాటిని కొనాలా వద్దా? అని కొనుగోలుదారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్ల వేలానికి నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే దీనికి ముందే సందేహాలు, అనుమానాలను నివృత్తి చేయాలనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఎప్పుడో పదేళ్ల క్రితం రాజీవ్‌ స్వగృహ ప్లాట్లను నిర్మించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఇవి ఖాళీగానే ఉన్నాయి. కొన్నింటి పనులు పూర్తయితే, ఇంకా కొన్ని ప్లాట్ల పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. ఎప్పుడో నిర్మించిన పాతప్లాట్లు కావడంతో ఎండకు ఎండి వానకు తడిచి ఉంటాయి. దాంతో ప్రస్తుతం ఆ అపార్ట్‌మెంట్ల నాణ్యత ఎలా ఉందో తెలియదు. తక్కువ రేటుకే ప్రభుత్వం విక్రయిస్తున్నప్పటికినీ కొనుగోలు చేశాక తీరా ఇంటిలోకి అడుగుపెడితే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

పైకప్పులు కారితే, కొనుగోలు చేసిన కొన్నాళ్లకే పగుళ్లు ఏర్పడితే ఎట్లా? బాత్రూంల లేకేజీల బాధ్యత ఎవరిదనే ప్రశ్నలు ఉత్పన్నమవతున్నాయి. మరమ్మతులు చేయించేదెవరు?. అంత పెద్ద అపార్ట్‌మెంట్‌ మెయింటెనెన్స్‌ ఎవరు చూస్తారు అని సందేహాలు వ్యక్తమవతున్నాయి. ప్లాట్ల చదరపు అడుగు ధరను తక్కువకే అధికారులు నిర్ణయించినా తీరా కొన్నాక వాటి పరిస్థితి ఎంటనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో కొనుగోలుదారుల సందేహాలను నివృత్తి చేశాక ప్లాట్లను విక్రయించాలని, అప్పుడే బండ్లగూడ, పోచారంలో ప్లాట్లను కొనుగోలు చేయడానికి జనం ముందుకొస్తారని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మోడల్‌ హౌస్‌ పెట్టారు కానీ…

బండ్లగూడలో మొత్తం 1501 ప్లాట్ల విక్రయానికి సిద్దంగా ఉండగా.. అందులో పనులు పూర్తి స్థాయిలో అయినవి 419 ప్లnాట్లు ఉన్నాయి. ఈ ప్లాట్లకు చదరపు అడుగుకు రూ.3 వేల చొప్పున ధరను నిర్ణయించారు. కొద్దిగా అసంపూర్తిగా ఉన్న 1082 ప్లాట్ల చదరపు అడుగు ధరను రూ.2750 చొప్పున విక్రయించాలని నిర్ణయించారు. పోచారంలో ఉన్న 1470 ప్లాట్లల్లో 1328 ప్లnాట్ల ధర చదరపు అడుగుకు రూ.2500 చొప్పున కాగా, మిగిలిన కొద్ది స్థాయిలో అసంపూర్తిగా ఉన్న 142 ప్లnాట్ల ధరను 2250 రూపాయల చొప్పున విక్రయించనున్నారు. ఆసక్తి కలిగిన కొనుగోలుదారుల కోసం బండ్లగూడ, పోచారంలో 6 చొప్పున మోడల్‌ హౌస్‌లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. వాటిని సందర్శించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇదంతా బాగానే ఉన్నా అపార్ట్‌మెంట్‌ కొన్న తర్వాత అందులో గృహప్రవేశానికి ముందు, తర్వాత నిర్వహణపరంగా రకరకాల సమస్యలు ఎదురయ్యే వీలుంది. వాటికి తక్షణమే పరిష్కార మార్గం చూపాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యల పరిష్కార బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందా? లేక ప్రైవేటు సంస్థకు అప్పగిస్తుందా? అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడైతేనే కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement