Monday, April 29, 2024

National : వ‌యనాడ్‌లో నామినేష‌న్ దాఖ‌లు చేసిన రాహుల్‌గాంధీ…

సేఫ్ ప్లేస్ వ‌య‌నాడ్‌! కాంగ్రెస్‌కు కంచుకోట‌..
అమేథీని కాద‌ని కొత్త‌కోట నిర్మాణం
2019లో వ‌యానాడ్‌కు చేరిన రాహుల్‌
ఇత‌ర పార్టీల‌కు అక్క‌డ అంత సీన్ లేదు
ఈసారి లెఫ్ట్‌, రైట్‌ కొత్త ఎత్తులు
రాహుల్ ఓట‌మి ల‌క్ష్యంగా వ్యూహాలు
బ‌రిలో దిగ‌నున్న బీజేపీ నేత‌ స్మృతి ఇరానీ
క‌స్సుమంటున్న‌ క‌మ్యూనిస్టులు
రెండో ద‌శ ఎన్నిక‌ల‌కు ఈసీ స‌న్న‌ద్ధం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొత్త కోటగా వాయనాడ్ మారింది. గత ఎన్నికల్లో 4.31 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఈ లోక్‌స‌భ‌ నియోజకవర్గం నుంచే ఈసారి మళ్లీ పోటీ చేస్తున్నారు. రెండో విడతలో భాగంగా ఏప్రిల్ 26న పోలింగ్ జరగనున్న ఈ స్థానం కోసం బుధవారం (ఏప్రిల్ 3వ తేదీన) నామినేషన్ దాఖలు చేశారు. దశాబ్దాలుగా పార్టీకి కంచుకోటగా నిలిచిన అమేథీని వదులుకుని మరీ ఈ ఒక్క చోట నుంచే పోటీ చేస్తుండడంతో రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ సీటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

- Advertisement -

వాయనాడ్‌ను కూడా మరో అమేథీలా మార్చి రాహుల్ గాంధీ విజయావకాశాలను దెబ్బతీయాలని చూస్తున్నారు. పైగా దేశమంతటా మిత్రపక్షంగా ఉన్న కమ్యూనిస్టులు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బద్ద విరోధులుగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీ సైతం గట్టి పోటీ ఇచ్చేందుకు పావులు కదుపుతోంది. దీంతో ఈసారి గెలుపు సునాయాసం కాదని, గెలవాలంటే కష్టపడాల్సిందేనని సంకేతాలు వాయనాడ్ సంకేతాలు పంపుతోంది.

కాంగ్రెస్‌కు కంచుకోట వ‌య‌నాడ్‌
కేరళలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు అవకాశాలు మరింత పెంచవచ్చని రాహుల్ గాంధీ 2019లో వాయనాడ్ నుంచి బరిలోకి దిగారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో వాయనాడ్ కొత్తగా ఏర్పడింది. అప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. 2009లో ఎంఐ శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి సీపీఐ నేత ఎం. రహమతుల్లాపై భారీ మెజారిటీతో గెలుపొందారు. అప్పుడు ఇద్దరి మధ్య వ్యత్యాసం 1.53 లక్షలు (18%)గా ఉండగా.. 2014కు వచ్చేసరికి అది కేవలం 20 వేల మెజారిటీ (2.3%)కు పడిపోయింది. అప్పుడు కూడా సమీప ప్రత్యర్థి సీపీఐ అయినప్పటికీ.. అభ్యర్థిగా సత్యన్ మోకేరి ఉన్నారు. 2019లో రాహుల్ గాంధీ పోటీ చేయడంతో కాంగ్రెస్ మళ్లీ ఒక్కసారిగా పుంజుకుంది. రాహుల్ గాంధీ 64.94% ఓట్లు సాధించగా తన సమీప ప్రత్యర్థి సీపీఐ నేత పీపీ సునీర్ కేవలం 25.24% ఓట్లకే పరిమితం కావాల్సి వచ్చింది.

కమలదళం స్మృతి అస్త్రం
గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 303 సీట్లు సాధించినప్పటికీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఈసారి ఎలాగైనా ఖాతా తెరవాల్సిందేనన్న పట్టుదలతో ఆ పార్టీ నాయకత్వం, శ్రేణులు కేరళ అంతటా పనిచేస్తున్నాయి. ఆ క్రమంలో వాయనాడ్ స్థానాన్ని సైతం భారతీయ జనతా పార్టీ (BJP) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గాంధీ కుటుంబాన్ని ఓడించడం అసాధ్యం అనుకున్న అమేఠీలోనే రాహుల్ గాంధీని ఓడించిన ఘనతను సొంతం చేసుకున్న ఆ పార్టీ.. రాహుల్‌ను ఢీకొట్టేందుకు తమ కేరళ అధ్యక్షుడు కే. సురేంద్రన్‌ను ప్రయోగిస్తోంది. వాయనాడ్ నుంచి సురేంద్రన్‌ను బరిలోకి దించింది. నియోజకవర్గం ఏర్పాటయ్యాక 2009లో కేవలం 3.85% ఓట్లను సాధించిన బీజేపీ, 2014లో బలం పెంచుకుని 8.83% కు చేరుకుంది. 2019లో ఎన్డీఏ మిత్రపక్షమైన భారత్ ధర్మ్ జనసేన (BDJS) తుషార్ వెల్లపల్లి రాహుల్‌పై పోటీ చేసి 7.25% ఓట్లు సాధించారు.

రాహుల్ ఓట‌మి ల‌క్ష్యంగా బీజేపీ..
ఈసారి బీజేపీ రాష్ట్రాధ్యక్షుడే బరిలో ఉన్నందున పార్టీ నేతలు కూడా మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు. వీటన్నింటికీ తోడు కాషాయదళ అగ్రనాయకత్వం రాహుల్‌పై స్మృతి అస్త్రాన్ని కూడా ప్రయోగిస్తున్నారు. అమేఠీలో రాహుల్‌ను మట్టికరిపించిన ఘనత సొంతం చేసుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని వాయనాడ్‌లో ప్రచారాస్త్రంగా సంధిస్తున్నారు. 2014లో సైతం రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ పోటీ చేశారు. ఓడిపోయినా నిరాశ చెందకుండా అమేఠీని అంటిపెట్టుకుని ఉన్నారు. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. 2019లో సఫలీకృతమయ్యారు. పైపెచ్చు రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉండడంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు. ఈసారి కూడా తనకే గెలుపు అన్న నమ్మకాన్ని రాహుల్ గాంధీకే కల్పించగలిగారు. అందుకే ఆయన అమేఠీ నుంచి తప్పుకుని కేవలం వాయనాడ్‌కు పరిమితమయ్యారు. అమేఠీ అనుభవాలతో వాయనాడ్‌లో ప్రజలకు దగ్గరయ్యేందుకు అటు రాష్ట్ర శాఖతో పాటు జాతీయ నాయకత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగానే రాహుల్ గాంధీపై పదునైన విమర్శలతో స్మృతి ఇరానీని రంగంలోకి దింపింది.

2019 ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ప్రతిసారీ అభ్యర్థిని మార్చుతూ వచ్చిన సీపీఐ ఈసారి ఏకంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా సతీమణి ‘అన్నీరాజా’ను బరిలోకి దించింది. బీజేపీ తరపున ఆ పార్టీ కేరళ అధ్యక్షుడు కే సురేంద్రన్ పోటీ చేస్తున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో 4.31 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఈ నియోజకవర్గం నుంచే ఈసారి మళ్లీ పోటీ చేస్తున్నారు రాహుల్ గాంధీ. దశాబ్దాలుగా పార్టీకి కంచుకోటగా నిలిచిన అమేథీని వదులుకుని మరీ ఈ ఒక్క చోట నుంచే పోటీ చేస్తుండడంతో రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ సీటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement