Sunday, May 5, 2024

యాసంగి వడ్ల కొనుగోళ్లు పూర్తి.. సీఎం కేసీఆర్​ నిర్ధేశం మేరకు లక్ష్యం పూర్తి: మంత్రి గంగుల‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రస్తుత యాసంగి సీజన్‌లో విజయవంతంగా ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేశామని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. రైతులకు సకాలంలో డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు. ఈ మేరకు యాసంగి ధాన్యం కొనుగోళ్లపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది రబీలో రూ.9916 కోట్ల విలువైన 50.67లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని దాదాపు 9లక్షల 52వేల మంది రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశామన్నారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకుని ఓపీఎంఎస్‌ లో నమోదైన 9724 కోట్లకు గాను 9680 కోట్లను రైతులకు సకాలంలో చెల్లించామన్నారు. ఓపీ ఎంస్‌లో నమోదైన ప్రకారం వెంట వెంటనే చెల్లింపులు కొనసాగుతాయన్నారు. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లాలో 6,42,894 మెట్రిక్‌ టన్నులను, అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 322 మెట్రిక్‌ టన్నులను సేకరించామని చెప్పారు.

2014-15 సీజన్‌ నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక కోటి ఎనిమిదివేల కోట్లను ప్రభుం రైతులకు అందజెెసిందన్నారు. ఎంఎస్‌పీ ప్రకారం పంట సేకరణ చేయడమే కాకుండా కరోనా, అకాల వర్షాలు, గోనె సంచుల ఇబ్బందులు వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బంది కలగకుండా పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ 6కోట్ల 6లక్షల 53 వేల 234 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. దేశంలో రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరిస్తూ రైతులకు సంపూర్ణంగా అండగా నిలుస్తున్నామని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి దేశంలో ఏ ప్రభుత్వం కూడా పోటీ రాదన్నారు. రైతు బంధు, రైతు భీమా , 24 గంటల ఉచిత కరెంటు, ధాన్యం సేకరణ తదితర రైతు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణదేనన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement