Wednesday, March 29, 2023

కుంగిపోతున్న జోషిమఠ్‌పై ప్రధాని కార్యాలయం సమీక్ష.. నిపుణులతో అధ్యయనం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ పట్టణం ఆందోళనకర రీతిలో కుంగిపోతున్న ఘటనపై ప్రధాని కార్యాలయం సమీక్ష నిర్వహించింది. పట్టణంలోని 600కు పైగా ఇళ్లు, భవనాలు, రోడ్లు కుంగిపోవడం వెనుక కారణాలను అన్వేషించడం కోసం సంబంధిత రంగాల నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయాల్సిందిగా ఆదేశించింది. ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ డా. పీకే మిశ్రా నేతృత్వంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అత్యున్నతస్థాయి సమావేశంలో కేబినెట్ సెక్రటరీ, హోంశాఖ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వానికి చెందిన మరికొందరు ఉన్నతాధికారులతో పాటు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) సభ్యులు ప్రత్యక్షంగా పాల్గొనగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, జోషిమఠ్ జిల్లా అధికారులు, ఐఐటీ (రూర్కీ) నిపుణులు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ అధికారులు, నిపుణులు పాల్గొన్నారు.

ఆందోళనకరంగా కుంగిపోతున్న జోషిమఠ్ గురించి ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారని, ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్పి పుష్కర్ సింగ్ ధామితో ఇప్పటికే మాట్లాడారని వెల్లడించారు. పగుళ్లుబారిన, బీటలువారి ఇళ్లు, భవనాల్లో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించినట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. పట్టణంలో 350 మీటర్ల మేర కుంగిపోతోందని తెలిపారు. సహాయచర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందం ఒకటి ఉందని వెల్లడించారు. జిల్లా ఎస్పీ, ఎస్డీఆర్ఎఫ్ కమాండెంట్ జోషిమఠ్‌లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

- Advertisement -
   

ఘటనాస్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఎన్డీఎంఏ సభ్యులు, బోర్డర్ మేనేజ్మెంట్ కార్యదర్శి సోమవారం జోషిమఠ్ సందర్శించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఐఐటీ-రూర్కీ, వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయ్ జియాలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రోలజీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి కుంగిపోవడం వెనుక కారణాలను అన్వేషించాలని నిర్ణయించారు. అలాగే నిర్ణీత కాలవ్యవధిలో జోషిమఠ్ పునర్నిర్మాణం వంటి ప్రత్యామ్నాయ చర్యలు సిఫార్సు చేయాలని కూడా సూచించారు.

నిరంతర భూకంప పర్యవేక్షణ చేపట్టాలని నిర్ణయించారు. జోషిమఠ్ కోసం రిస్క్ సెన్సిటివ్ అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్ రూపొందించాలని కూడా సమీక్షలో నిర్ణయించారు. జోషిమఠ్ పరిస్థితిపై ఇప్పటికే ఉత్తరాఖండ్ ముఖ్యమంమత్రితో సమీక్షించిన ప్రధాని మోదీ తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు తగిన వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందజేస్తామని వెల్లడించింది. మొత్తంగా ఈ సమావేశంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై సమాలోచనలు జరపడంతో పాటు నిపుణుల సలహాలు తీసుకున్నారు.

ఎందుకీ కుంగుబాటు?

జోషిమఠ్ కుంగుబాటుపై భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. స్థానిక జోషిమఠ్ వాసులు మాత్రం తపోవన్-విష్ణుగఢ్ సొరంగం తవ్వకం కారణంగానే జోషిమఠ్ కుంగిపోతోందని ఆరోపిస్తున్నారు. ఎన్టీపీసీ చేపట్టిన హైడల్ పవర్ ప్రాజెక్టు కోసం ఈ సొరంగాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. హిమాలయాలు ప్రపంచంలోనే తక్కువ వయస్సున్న పర్వతశ్రేణులని, మట్టి, రాళ్లు అంతగా పటుత్వాన్ని కలిగి ఉండవని, అలాంటి ఎకో-సెన్సిటివ్ జోన్‌లో చేపట్టిన భారీ ప్రాజెక్టుల కారణంగా హిమాలయాల్లో డొల్ల ఏర్పడి ఇలాంటి ఘటనలకు దారితీస్తోందని విమర్శిస్తున్నారు. జోషిమఠ్ బచావో సంఘర్ష్ సమితి ఈ విషయంపై చాలాకాలంగా పోరాడుతోంది. హిమాలయాల్లో చేపట్టే భారీ ప్రాజెక్టులే ఇక్కడ వైపరీత్యాలకు కారణమవుతున్నాయని ఆ సంస్థ ఆరోపిస్తోంది.

తాజాగా జోషిమఠ్ పట్టణంలో 600కు పైగా ఇళ్లు, భవనాల్లో పగుళ్లు రావడం, బీటలువారడం, అవి రోజురోజుకూ పెరగడంతో చుట్టుపక్కల నిర్మాణ పనులు పూర్తిగా నిలిపివేశారు. కొన్నిచోట్ల పగుళ్ల నుంచి బురద తన్నుకురావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా కొండపై చేపట్టిన సొరంగం కారణంగా పగుళ్ల నుంచి బురద బయటకు వస్తోందని ఆరోపిస్తున్నారు. స్థానిక ప్రజలు, బాధితుల ఆందోళనతో ఎన్టీపీసీ చేపట్టిన హైడ్రోపవర్ ప్రాజెక్టు పనులతో పాటు హెలాంగ్ బైపాస్ రోడ్డు, జోషిమఠ్-ఔలీ రోప్ వే ప్రాజెక్టు పనులను కూడా నిలిపివేశారు. నిజానికి 2013లోనే హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఈ తరహా విపత్తు సంభవిస్తుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కొద్ది నెలల క్రితం జోషిమఠ్ మున్సిపాలిటీ నిర్వహించిన అధ్యయనంలో 550 ఇళ్లు ప్రమాదం అంచున ఉన్నాయని, అందులో 150 ఇళ్లు ఎప్పుడైనా కూలిపోవచ్చని తేలింది. హిమానీనదాలు కరిగిపోయిన తర్వాత ఏర్పడ్డ ప్రాంతాలు (మోరెన్స్)పై జోషిమఠ్, నీతి వ్యాలీ, మానా వ్యాలీలు ఉన్నాయని, అలాంటిచోట పెద్ద ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టవద్దని 1978లోనే గఢ్వాల్ కమిషనర్ మహేశ్ మిశ్రా నేతృత్వంలోని కమిటీ సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement