Sunday, May 5, 2024

టమాటా ధరలకు రెక్కలు… ఉల్లిఘాటు తప్పదు

దేశంలో అన్ని కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే చాలా మార్కెట్లలో వీటి ధర కేజీకి 200కి పైగా ఉంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు మండుతున్న కూరగాయల ధరలతో బెంబేలెత్తున్నారు. హోల్‌ సేల్‌ వ్యాపారాల అంచనా ప్రకారం ఆగస్టులోనూ టమాటా ధరలు దిగివచ్చే అవకాశం కనిపించడంలేదు. పైగా వీటి ధరలు మరింత పెరుగుతాయని వారు స్పష్టం చేస్తున్నారు.

ఇటీవల చాలా రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు టమాటా తోటలతో పాటు, పలు కూరగాయల పంటలకు నష్టం జరిగింది. అందు వల్ల సప్లయ్‌ మరింతగా తగ్గుతుందని భావిస్తున్నారు. సాధారణంగా అయితే ఆగస్టులో అన్ని రకాల కూరగాయల పంటలు మార్కెట్‌లోకి భారీగా వస్తాయి. ఈ సారి ఆ పరిస్థితి కనిపించడంలేదని వ్యాపారులు చెబుతున్నారు.

గత నెలరోజులుగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో టమాటా ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. మార్కెట్‌కి టమాటాలు చాలా తక్కువగా వస్తున్నందున వీటి ధరలు హోల్‌సేల్‌లోనే దాదాపు కేజీ 200 రూపాయలుగా పలుకుతోంది. పరిస్థితులు అనుకూలంగా లేనందున టమాటా కేజీ 300 రూపాయలకు చేరినా ఆశ్చర్యం లేదని వ్యాపారులు చెబుతున్నారు.

- Advertisement -

ఢిల్లిలోని అత్యంత పెద్దదైన ఆజాద్‌పూర్‌ కూరగాయల మార్కెట్‌లో కేజీ టమాటాలు 170-220 రూపాయలు పలుకుతోంది. కర్నాటక, మహారాష్ట్రలోని హోల్‌సేల్‌ మార్కెట్‌లో టమాటా కేజీ ధర 180-200 రూపాయల వరకు పలుకుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని అతి మార్కెట్‌గా ఉన్న మదనపల్లిలోనూ కేజీ టమాటా 180-190 రూపాయల వరకు పలుకుంతోంది.

ఉల్లిఘాటు తప్పదు..

ఉల్లి ధరలు ఈ నెలాఖరు వరకు పెరుగుతూ సెప్టెంబర్‌ నాటికి 60 నుంచి 70 రూపాయల వరకు చేరవచ్చని క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌ తెలిపింది. 2020 సంవత్సరం నాటికి ధరల కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. సరఫరా డిమాండ్‌ అసమతౌల్యం ఆగస్టు చివరి నాటికి ప్రతిబింబిచొచ్చుని తెలిపింది. ఉల్లి సరఫరాలు కూడా ఆగస్టు చివరి నాటికి తగ్గే సూచనలు ఉన్నాయని తెలిపింది.

అక్టోబర్‌లో ఖరీఫ్‌ పంట చేతికి వచ్చిన తరువాతే ఉల్లిగడ్డల ధరలు దిగి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. పండుగుల సీజన్‌ అస్టోబర్‌- డిసెంబర్‌ నాటికి ఉల్లి ధరలు తగ్గే అవకాశం ఉందని క్రిసిల్‌ తెలిపింది. తృఫ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఇతర కూరగాయల ధరలతో ఇబ్బంది పడ్డ వినియోగదారులు, ఈ ఏడాది జనవరి- మే నెలల మధ్య ఉల్లి ధరలు తగ్గడంతో కొంత ఊరట చెందారు. ఆగస్టు మొదటి వారంలోనూ ఉల్లి ధరలు కేజీ 25-35 రూపాయల మధ్య ఉన్నాయి.

మార్కెట్‌లో సరైన ధర రానందున రైతులు ఈ సారి ఉల్లితో సాగు తక్కువగానే వేశారు. దీని వల్ల ఈ సంవత్సరం 8 శాతం వరకు ఉల్లి పంట సాగు తగ్గింది. ఫలితంగా ఖరీఫ్‌లో 5 శాతం వరకు ఉల్లి ఉత్పత్తి తగ్గుతుందని అంచనా. వార్షిక ఉత్పత్తి 29 మిలియన్‌ టన్నులకు చేరుతుందని అంచనా. ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షపాతం ఎలా ఉంటుందన్న దానిపై ఉల్లి పంట దిగుబడులు ఆధారపడి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఉల్లితో పాటు, కూరగాయల మార్కెట్‌ విషయంలో ప్రభుత్వాలు ఉదాశీనత వల్ల ఏటా రైతులు తీవ్ర నష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పంట చేతికి వచ్చిన సమయంలో కనీస ధర కూడా రైతులకు లభించడంలేదు. ఉల్లి రైతులు కనీసం కూలీ ఖర్చులు రాకపోవడంతో పొలంలోనే పంటను వదిలేసిన ట్లు వార్తలు వచ్చాయి. రైతులకు ఈ విషయంలో ప్రభుత్వం అండగా ఉండి, కనీస మద్ధతు ధరకు ఉల్లి పంటను కొనుగోలు చేసి నిల్వ చేయాలని వ్యవసాయ రంగ నిపుణులు ఎప్పటి నుంచో కోరుతున్నారు.

వ్యవసాయం మార్కెటింగ్‌ సంస్థల ద్వారా కనీస ధరకు కొనుగోలు చేసి, పంట లేని సమయంలో వీటిని మార్కెట్‌లోకి సరఫరా చేయడం ద్వారా ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవచ్చు. దీని వల్ల అటు రైతులు, ఇటు వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని వీరు సూచిస్తున్నారు.

టమాటా రైతులు సైతం తమ పంటను కేజీకి కనీసం రూపాయికి కూడా కొనేవారు లేక అనేక సందర్బాల్లో రోడ్ల వెంట పారబోసిన ఉదంతాలు ఎన్నో జరిగాయి. టమాటాను రైతుల నుంచి కొనుగోలు చేసిన కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసి ధర పెరుగుతున్న సమయంలో విక్రయించవచ్చు. కూరగాయల సాగు పెంచేందుకు రైతులకు కనీస మద్ధతు ధర ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement