Sunday, May 5, 2024

Big Story | నిధుల తవ్వకాల్లో శిథిలమవుతునన ప్రతాపగిరికోట..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దట్టమైన దండకారణ్యంలో శత్రుదుర్భేద్యమైన ప్రతాపగిరి కోట చరిత్ర ఆనవాళ్లు కనుమరుగైపోతున్నాయి. నిధుల అన్వేషణలో వాడిగునపాల దెబ్బలకు అరుదైన చరిత్ర సంపద కుప్పకూలిపోతోంది. తెలంగాణ చరిత్రలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ కోట చిక్కని అడవిలో చక్కని కాకతీయ వాస్తురీతులతో కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. జల,వన,గిరి దుర్గాలతో కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఈ కోట చైనాగోడను పోలీ భూపాలపల్లి నుంచి ఛత్తీస్‌గఢ్‌ వరకు విస్తరించిన ఈ దుర్గం చరిత్ర ఎంతో ప్రాచీనమైంది. గోదావరి నదీని భారీ కందకంగా చేసి నది ఒడ్డున కోటగోడలను నిర్మించారు. శత్రు సైనికులు గోదావరి దాటి కాకతీయ రాజ్యం పై దండెెత్తే అవకాశం లేకుండా దుర్భేద్యంగా వేయి ఏళ్ల క్రితం నిర్మిచిన ఈ కోట నిర్లక్ష్యం నీడలో కనుమరుగైపోతుంది. దేశంలో అనేక రాజవంశాలు జల, వన, గిరి దుర్గాలను వేరువేరుగా నిర్మిస్తే ప్రతాపగిరి కోట లో ఈ మూడు దుర్గాలను కాకతీయ రాజులు నిర్మించి వేలాది మంది సైనికులకు శిక్షణ కేంద్రంగా తీర్చి దిద్దారు. 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనం అనంతరం అనేక సంవత్సరాలు కోటను శత్రురాజులు గుర్తించలేకపోయారు.

జల, వన, గిరి దుర్గాలతో పటిష్టంగా నిర్మించిన ఈ కోటలో చెరువులు, బావులు, ఆలయాలు అనేకం ఉండటంతో పాటుగా అనేక రహస్య మార్గాలు, నిధుల భాండాగారాలు అనేకం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కోటగోడల వరుస గోదావరి నదీ తీరంలో విస్తరించి మధ్యలో కొంత కాళీమైదానస్థలం వదిలి ఛత్తీస్‌గఢ్‌ లోని దండకారణ్యంలోని గుట్టలలకు అనుసంధానం చేశారు. అయితే రహస్య స్థావరంగా, సైనిక శిక్షణ కేంద్రంగా అడవిలో విస్తరించిన ఈ కోట వైపు కన్నెత్తి చూసేందుకు గతంలో అనేకమంది సాహసం చేయలేదు. ఫలితంగా కాకతీయుల కోటలకు వచ్చిన గుర్తింపు ఈ కోటకు రాలేదు. చరిత్ర పరిశోధనచేసి నివేదికలు రూపొందించే పురావస్తు శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం చరిత్ర కారులు కోటపై సమగ్ర అధ్యయనం చేసి సమాజం ముందుంచారు. ఢిల్లి సుల్తానులు కాకతీయ రాజ్యంపై దండెత్తినప్పుడు కాకతీయ రాజకుటుంబీకులు ఈ కోటలోరహస్యజీవితం గడిపి ఆతర్వాత ఛత్తీస్‌ గఢ్‌ లోని దంతేవాడలో కాకతీయ సామ్రాజ్యం స్థాపించారు. ఢిల్లి సుల్తానుల నుంచి తప్పించుకుని ప్రతాపరుద్రుడు ఈ కోటలో కొంతకాలం ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ శాసనాధారాలు ఇప్పటికీ లభ్యం కాలేదు.

- Advertisement -


ప్రతాపగిరి కోట చుట్టూ కిలోమీటర్ల పరిధిలో 12 నుంచి 15 అడుగుల ఎత్తులో భారీ బండరాళ్లతో ప్రహారీ నిర్మించారు. కోట ప్రవేశ ద్వారానికి గజలక్ష్మీ, సర్వతోభద్ర యంత్రం చెక్కబడి ఉన్నాయి. కోటలో రాజప్రాదం, అంతపురాలు, సైనికుల నివాసాలు, గుర్రపుశాలల ఆనవాళ్ళు ఉన్నాయి. కోటలో అనేక రహస్య సొరంగ మార్గాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం నిధుల అన్వేషణలో కోటలోని ఆలయాలు, అంతపురాలు, చెరువుల్లో భారీ తవ్వకాలు జరుగుతున్నాయి. సింగరేణీ మైన్స్‌ లో ఉపయోగించే పేలుడు పదార్థాలతో ఆలయంలోని ప్రధాన ప్రాంతాలను ధ్వంసం చేస్తూ నిధుల వేట కొనసాగుతుంది. సంపదకు నిలయమై స్వర్ణయుగంగా గుర్తింపు పొందిన కాకతీయ సామ్రాజ్యం చివరిదశలో రాజవంశీయులు ఇక్కడ రహస్య జీవితం గడపడంతో కాకతీయుల విలువైన సంపద ఇక్కడ నిక్షిప్తమై ఉందనే ఆశతో తవ్వకాలు జోరుఅందుకున్నాయి.

చరిత్ర సంపద పేడుపదార్థాల విస్ఫోటనంతో కుప్పకూలుతున్నాయి. పర్యాటక రంగాభివృద్ధికి విస్తృతమైన అవకాశాలున్నా, కాకతీయ చరిత్ర అన్వేషణకు నిలయంగా ఉన్నా ఆమేరకు ప్రయత్నాలు జరగడంలేదు. నిద్రాణ స్థితిలో పురావస్తు శాఖ ఉండటంతో చరిత్ర సంపద ఆనవాళ్లు కనుమరుగైపోతున్నాయి. అలాగే అడ్వెంచర్‌ టూరిజానికి విస్తృతమైన అవకాశాలున్నా ఆమేరకు పర్యాటక శాఖ ప్రయత్నాలు కనిపించడంలేదు. మంథని పట్టణం నుంచి మహాదేవపూర్‌ దాటి కాటారం అటవీ ప్రాంతంమీదుగా ఛత్తీస్‌గడ్‌ వరకు విస్తరించిన ఈ కోటను పునరుద్ధరించి పదిలపర్చుకునేందుకు పురావస్తు, పర్యాటక శాఖలు కృషిచేయాల్సిన అవసరం ఏర్పడింది.

కాకతీయుల శాసనాధారాలు ఉన్నాయి

ప్రతాపగిరి కోటగోడపైతెలుగులో చెక్కిన శాసనం అనేక విషయాలకు ఆధారంగా నిలిచిందని చరిత్రకారుడు రామోజు హరగోపాల్‌ చెప్పారు. దుర్గాన్ని ముచ్చనాయింగారు నిర్మించినట్లు గా తెలుస్తోంది. గండగోపాలుడు, కంచిరక్ష్యాపాలకా, దాయ గజకేసరి, అరిరాయగజకేసరి బిరుదులు శాసనంలో అగుపిస్తాయని తెలిపారు, దాయగజకేసరి, అరిరాయ గజకేసరి వంటి బిరుదులు కాకతీయుల కాలం నాటివని చెప్పారు. ఈ కోటను పునరుద్ధరిస్తే పర్యాటకులను అమితంగాఆకట్టుకోవడంతో పాటుగా అడ్వెంచర్‌ టూరిజానికి అవకాశాలున్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement