Thursday, May 2, 2024

polling : ప్ర‌శాంతంగా తొలి ద‌శ పోలింగ్

- Advertisement -

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రారంభం కాగా సాయంత్రం 6 గంటలవరకూ కొనసాగనుంది. దీంతో సాధారణ పౌరులతో పాటు ప్రముఖులు కూడా ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్దకు తరలివెళ్లి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలోని శాసనసభ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం పోలింగ్ ప్రారంభం కాగా.. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హ‌క్కు వినియోగించుకోనున్న 16.63 కోట్ల మంది ఓట‌ర్లు
తొలిదశ లోక్ సభ ఎన్నికల్లో 8 మంది మంత్రులు, 2 మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్ పోటీలో ఉన్నారు. మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. 16.63 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1625 మందిలో 1491 మంది పురుషులుండగా..134 మంది మహిళలున్నారు. ఇక ఓటర్లలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 కోట్లమంది మహిళలు ఉండగా.. 11,371 మంది ట్రాన్స్ జెండర్లున్నట్లు ఈసీ వివరించింది. వీరిలో 35.67 లక్షలమంది ఓటర్లు తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 14.14 లక్షల మంది 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఉన్నారని, 13.89 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని.. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కును వినియోగించుకునే వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.

త‌మిళ‌నాడులో ఓటు వేసిన సినీ ప్ర‌ముఖులు
ఇక తమిళనాడులో కూడా తొలి దశలోనే పోలింగ్ జ‌రుగుతుండ‌గా.సద్గురు జగ్గీవాసుదేవ్‌ తమిళనాడులో ఓటు వేశారు. ప్రముఖ నటుడు రజనీకాంత్‌ చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజ్‌లో. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నైలోని ఓ పోలింగ్ బూత్ లో తన సతీమణితో కలిసి ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.. చెన్నైలో రాధికా-శరత్‌ కుమార్‌ కుటుంబం , భాజపా తమిళనాడు అధ్యక్షుడు, కోయంబత్తూర్ అభ్యర్థి కె.అన్నామలై ఉతుపట్టికి చెందిన కరూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో, భాజపా దక్షిణ చెన్నై అభ్యర్థి తమిళిసై సౌందర్‌రాజన్ . కేంద్రమంత్రి, నీలగిరి అభ్యర్థి ఎల్‌ మురుగన్ చెన్నైలోని కోయెంబేడులోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. యోగా గురువు రామ్‌దేవ్ బాబా, పతంజలి ఎండీ బాలకృష్ణ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ నటులు కమల్‌ హాసన్‌, ధనుష్, శివ‌కార్తికేయ‌న్, అజిత్ , ధ‌నుష్, విజ‌య్ సేతుప‌తి , యోగి బాబు, హీరోయిన్ త్రిష‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్, రాధికలు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

త్రిపుర సీఎం మాణిక్ సాహా, అరుణాచల్ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ, రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం దియా కుమారి, తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీర్‌సెల్వం, రాజస్థాన్‌ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్ రాఠోడ్‌, మణిపుర్ సీఎం బీరెన్‌ సింగ్‌, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, తూత్తుకుడి సిట్టింగ్‌ ఎంపీ కనిమొళి, డిబ్రూగఢ్‌ అభ్యర్థి సర్వానంద సోనోవాల్‌ వంటి ప్రముఖులు తొలిగంటల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తొలి విడ‌త‌లో తేల‌నున్న ఎనిమిది మంది కేంద్ర మంత్రుల భ‌విష్య‌త్

ఇది ఇలా ఉంటే బిజెపి నుంచి నితిన్‌ గడ్కరీ (నాగ్‌పూర్‌), కిరణ్‌ రిజిజు (పశ్చిమ అరుణాచల్‌ ), అన్నామలై (కోయంబత్తూర్‌), తమిళిసై సౌందరరాజన్‌ (చెన్నై దక్షిణం) సర్వానంద సోనోవాల్‌ (డిబ్రూగఢ్‌), భూపేంద్రయాదవ్‌ (అల్వర్‌), జితిన్‌ ప్రసాద (పీలీభీత్‌) బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌లో గౌరవ్‌ గొగొయ్‌ (జోర్హాట్‌), నకుల్‌నాథ్‌ (ఛింద్వాడా), కార్తీ చిదంబరం (శివగంగ)తో పాటు డీఎంకే నాయకురాలు కనిమొళి తదితరుల భవితవ్యాన్ని నేడు ఓటర్లు తేల్చనున్నారు.

చ‌త్తీస్ గ‌డ్ లో ఐఈడి పేలుడు ….

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చిహ్‌కా గ్రామ స‌మీపంలో ఓ ఐఈడీని పేల్చేశారు. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్‌కు చెందిన అసిస్టెంట్ క‌మాండంట్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. సీఆర్పీఎఫ్ జ‌వాన్ ఎన్నిక‌ల డ్యూటీలో ఉండ‌గా ఈ పేలుడు జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. గాయ‌ప‌డ్డ జ‌వాన్‌ను బైరామ్‌గ‌ర్హ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు బీజాపూర్ పోలీసులు పేర్కొన్నారు. ఐఈడీ పేలుడు నేప‌థ్యంలో పోలీసులు అప్ర‌మ‌త్తమ‌య్యారు. ఆ ఏరియాలో కూంబింగ్ చేప‌ట్టారు.

మ‌ణిపూర్ లో కాల్పులు.. బెంగాల్ లో ఘ‌ర్ష‌ణ‌లు…

ఇక మ‌ణిపూర్‌లోని త‌మ‌న్‌పోక్కి పోలింగ్ కేంద్రం వ‌ద్ద దుండ‌గులు కాల్పులు జ‌ర‌పడంతో క‌ల‌కలం రేగింది. ఇక ప‌శ్చిమ బెంగాల్ కూచ్‌బెహ‌ర్ జిల్లాలో బీజేపీ కార్య‌క‌ర్త‌లు గంద‌ర‌గోళం సృష్టించార‌ని టీఎంసీ ఆరోపించింది. సితాల్‌కుచిలోని ఓ పోలింగ్ కేంద్రం వ‌ద్ద బీజేపీ మ‌ద్ద‌తుదారులు దౌర్జ‌న్యానికి తెగ‌బ‌డి ఓట‌ర్ల‌ను సైతం బెదిరించార‌ని టీఎంసీ నేత‌లు ఆరోపించారు. పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement