Monday, April 29, 2024

దేవాలయాల్లో ప్లాస్టిక్‌ నిషేధం.. వరుస జాతరల నేపథ్యంలో దేవాదాయ శాఖ చర్యలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని దేవాలయాల్లో పర్యావరణహిత వస్తువుల వినియోగంపై దేవాదాయ శాఖ దృష్టి సారించింది. ఫిబ్రవరి నుంచి రాష్ట్ర్రంలోని ప్రధాన దేవాలయాలలో ఉత్సవాలు, జాతరలు జరుగుతున్న నేపథ్యంలో ప్లాస్టిక్‌ బ్యాగులు, పాలిథిన్‌ కవర్లపై నిషేధం విధించింది. శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన శైవాలయాలలో బ్రహ్మోత్సవాలు ఇప్పటికే ప్రారంభం కాగా, త్వరలో యాదాద్రి, భద్రాచలం వంటి దివ్య క్షేత్రాలలో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దేవాలయాలలో భక్తులు కొబ్బరికాయలతో పాటు స్వామివార్లకు నివేదించే ఇతర పూజా సామాగ్రిని ప్లాస్టిక్‌ కవర్లలోనే విక్రయిస్తున్నారు. వీటి వినియోగం తరువాత దేవాలయ పరిసర ప్రాంతాలు, కోనేరు వంటి ప్రాంతాలలో వేస్తుండటంతో మొత్తం కలుషితంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలోని ఆలయాల్లో ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించేందుకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్లాస్టిక్‌ కవర్ల స్థానంలో వెదురు బుట్టలు, క్లాత్‌ బ్యాగులు ఉపయోగించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఈమేరకు దేవాదాయ శాఖ కమిషనర్‌ అన్ని ఆలయాల ఈవోలకు సర్క్యులర్‌ జారీ చేశారు. భక్తులు ప్లాస్టిక్‌ కవర్లలో కొబ్బరికాయలు, పూలు, పసుపు, కుంకుమ, పండ్లు వంటి పూజా సామాగ్రి తీసుకు రాకుండా నిషేధం విధించారు. ఆలయ పరిసరాల ప్రాంతాల్లో ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేసి భక్తులకు అవగాహన కలిగిస్తున్నారు. ప్రముఖ ఆలయాలలో దేవాదాయ శాఖ సిబ్బంది క్యూలైన్లలో తనిఖీలు చేపట్టి ప్లాస్టిక్‌ కవర్లను తీసివేస్తున్నారు. అంతేకాకుండా అసలు నిషేధిక ప్లాస్టిక్‌ వస్తువుల విక్రయాలే జరుగకుండా దుకాణాదారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పసుపు, కుంకుమను ప్లాస్టిక్‌ కవర్లలో కాకుండా చిన్నచిన్న పేపర్లలో పొట్లాలుగా కట్టి ఇచ్చేలా కొబ్బరికాయలు, పూలు, పండ్లను వెదురు బుట్టలు, పేపర్‌ బ్యాగులలో విక్రయించేలా చర్యలు చేపట్టారు. దేవాదాయ శాఖ కూడా భక్తులకు పులిహోర, లడ్డు, వడ వంటి ప్రసాదాలను ఆలయం పేరుతో ముద్రించిన పేపర్‌ కవర్లలో అందజేస్తున్నారు. కాగా, నిబంధనలు పాటించని వ్యాపారులపై చర్యలు తీసుకునేందుకు దేవాదాయ శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. మునిసిపల్‌ అధికారుల సహకారంతో ఆయా దుకాణాల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement