Thursday, May 2, 2024

కడెం వరద నివారణకు శాశ్వత చర్యలు.. ప్రాజెక్టుకు అదనంగా మరో 5 గేట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కడెం ప్రాజెక్టు వరద ముంపుకు శాశ్వత చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు గేట్లు మొరాయించడంతో గత 3 సంవత్సరాలనుంచి ప్రాజెక్టు పైనుంచి నీరు ప్రవహించడంతో పాటుగా బ్యాక్‌ వాటర్‌ ముంపు అధికమవుతోంది. ఈ నేపథ్యంలో కడెం ప్రాజెక్టు అధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పాండ్యా నేతృత్వంలో నిపుణుల కమిటీ నియమించింది.

ఈ కమిటీ నీటి పారుదల శాఖకు నివేదిక సమర్పించి అనేక సూచనలు చేసింది. ప్రధానంగా ప్రాజెక్టుకు ఉన్న 18 గేట్లతో పాటుగా మరో 5 గేట్లు బిగించాలని కమిటీ సూచించింది. గేట్ల బిగింపుతో ప్రస్తుతం 3.6 లక్షల క్యూసెక్కులకు బదులుగా 4లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేయవచ్చని నివేదికలో పేర్కొంది.

అలాగే ప్రస్తుతం ఉన్న గేట్లను హైడ్రాలిక్‌ విధానంలోకి మార్చాలని సూచింది. ప్రస్తుతం ఉన్న స్పిల్‌ వే కు 100 అడుగుల సామర్ధ్యంతో కొత్త కట్ట నిర్మించాలని పేర్కొంది. కడెం ప్రాజెక్టు పరిసరాల్లో వర్షం నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కట్ట ఎత్తుపెంచాల్సిన అవసరాన్ని నివేదికలో పొందుపర్చారు.

- Advertisement -

కొండల దిగువన ప్రాజెక్టు ఉండటంతో వరద నీటిని పదిలపర్చుకునేందుకు కడెంప్రాజెక్టుకు సమాంతరంగా మరో ప్రాజెక్టు నిర్మించాలని నిపుణుల కమిటీ చేసిన సూచనలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు త్వరలో క్షేత్ర స్థాయి పర్యటన చేసి పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు చెప్పారు. అయితే ప్రాజెక్టు ఆధునీకరణకు రూ. 450 కోట్ల అంచనావ్యాయంతో డీపీఆర్‌ రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పరిసరాల్లో నేల స్వభావాన్ని పరిశీలించి త్వరలో పనులు ప్రారంభించేందుకు నీటీపారుదల శాఖ సిద్ధమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement