Monday, April 29, 2024

Delhi | జనసేనతో పొత్తు లాభమే.. తెలంగాణలో పవన్ ప్రచారం చేస్తారు : డా. కే. లక్ష్మణ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు డా. కే. లక్ష్మణ్ అన్నారు. గురువారం ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జనసేనతో పొత్తు వల్ల ప్రయోజనం ఉంటుందని తెలిపారు. గతంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో జనసేన పోటీ నుంచి విరించుకోవడం వల్ల బీజేపీ ఆ మేరకు లబ్ది పొందిందని అన్నారు.

అయితే ఎన్డీఏలో భాగంగా తెలంగాణలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీతో సాగిస్తున్న చెలిమి గురించి ప్రశ్నించగా.. తెలుగుదేశం పార్టీతో బీజేపీకి ఎలాంటి పొత్తు, చెలిమి లేదని స్పష్టం చేశారు. అయితే తెలుగుదేశం తెలంగాణలో పోటీ చేయకుండా విరమించుకోవడం వెనుక కారణం తమకు తెలియదని, ఆ పార్టీయే చెప్పాలని అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్టు టీడీపీ ఎక్కడా చెప్పలేదని వ్యాఖ్యానించారు.

మరోవైపు బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి గురించి ప్రశ్నించగా.. నేతలు పార్టీ మారినంత మాత్రాన ఓట్లు కూడా వారితో వెళ్లిపోవని, ఒకరిద్దరు నేతలు పార్టీని వీడినంత మాత్రాన బీజేపీకి వచ్చే నష్టం ఏదీ లేదని అన్నారు. నిన్న మొన్నటి వరకు బీజేపీని వీడబోనని తనంతట తాను స్వయంగా చెప్పిన వివేక్, ఇప్పుడు ఎందుకు మారారో ఆయనే చెప్పాలని డా. లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

మరోవైపు హైదరాబాద్‌లో నవంబర్ 7న బీసీ గర్జన లేదా బీసీ ఆత్మగౌరవం పేరుతో భారీ బహిరంగ నిర్వహించనున్నట్టు లక్ష్మణ్ ప్రకటించారు. ఈ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే బీజేపీ బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తుందని స్పష్టం చేశారు. బీసీల్లోనూ సమర్థులైన నేతలున్నారని, గెలుపు గుర్రాలను వెతికి గుర్తించి మరీ టికెట్లు ఇస్తున్నామని తెలిపారు.

కాంగ్రెస్ బీసీల ద్రోహి.. రాహుల్ వ్యాఖ్యలు బీసీలను గాయపరిచాయి

బీజేపీ ప్రకటించిన ‘బీసీ సీఎం’ వాగ్దానంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చులకనగా, అవహేళన చేసేలా ఉన్నాయని డా. లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర జనాభాలో 52% ఉన్న బీసీలకు రాజ్యాధికారం ఇస్తామంటే రాహుల్ జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. దేశాన్ని, రాష్ట్రాన్ని 6 దశాబ్దాలకు పైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా బీసీని ముఖ్యమంత్రిగా చేయలేదని గుర్తుచేశారు. బీసీలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా భావించారు తప్ప రాజ్యాధికారం, పాలనలో భాగస్వాములను చేయలేదని విమర్శించారు.

బీసీ నేత సీఎం ఎక్కడ సీఎం అయిపోతారోనన్న దుగ్ధ, ఓర్వలేనితనంతో రాహుల్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాట తప్పని బీజేపీ ఇచ్చిన ‘బీసీ సీఎం’ వాగ్దానాన్ని నిలబెట్టుకునేలా బీజేపీని గెలిపించే బాధ్యత బీసీలపైనే ఉందని, బీసీ సంఘాలు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అందివచ్చిన ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని విజ్ఞప్తి చేశారు. బడుగులు, బలహీనవర్గాలపై చులకన భావం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కొత్తేమీ కాదని అన్నారు. బర్రెలు, గొర్రెలు ఇస్తే చాలు, బీసీలు సంతృప్తి పడతారు అన్నట్టుగా ఈ రెండు పార్టీల నేతలు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.

“అమ్మ పెట్టదు, అడక్కు తిననివ్వదు” అన్నట్టుగా ఈ పార్టీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ పార్టీల ప్రలోభాలకు లొంగకుండా, బీసీల ఆత్మగౌరవ సమస్యగా భావించి బీజేపీకి ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. బీసీలకు ద్రోహం చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీయేనని, బీసీల రిజర్వేషన్లు వ్యతిరేకించిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని గుర్తుచేశారు. వెనుకబడ్డ సామాజికవర్గం నుంచి వచ్చిన నరేంద్ర మోడీ ప్రధాని కావడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.

బీసీల్లో చైతన్యం పెరిగి నేడు మోడీ వెంట నడుస్తున్నారు కాబట్టే రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. బీసీలకు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని, కేవలం పదేళ్ల కాలంలోనే తాము ఏం చేశామో చెప్పడానికి తాము సిద్ధమని సవాల్ విసిరారు. లోక్ సభలో 80కి పైగా, రాజ్యసభలో 30కి పైగా బీసీ నేతలను సభ్యులుగా చేసింది బీజేపీ అన్నారు. సమాజంలో సంఖ్యాబలం లేని బీసీ కులాలకు సైతం చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించిన పార్టీ బీజేపీ అని కొనియాడారు.

జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధత కల్పించింది బీజేపీ సర్కారు అన్న విషయం మర్చిపోవద్దని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల లక్షలాది బీసీ విద్యార్థులు లబ్ది పొందుతున్నారని వెల్లడించారు. తాజాగా ప్రవేశపెట్టిన “పీఎం విశ్వకర్మ’ పథకం ద్వారా చేతి వృత్తులపై ఆధారపడ్డ బీసీల అభ్యున్నతి కోసం తీసుకొచ్చినట్టు తెలిపారు. తెలంగాణలో బీసీ కార్పొరేషన్ కు బీఆర్ఎస్ సర్కార్ నిధుల్లేకుండా చేసిందని ఆరోపించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement