Sunday, April 28, 2024

Delhi | పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ బ్రోకర్.. టీడీపీని ఎన్డీయేకు దగ్గర చేసే ప్రయత్నం : సీపీఐ నారాయణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తెలుగుదేశం పార్టీని ఎన్డీయేకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ అదే గనుక జరిగితే వైఎస్సార్సీపీ నెత్తిన పాలు పోసినట్టేనని అభిప్రాయపడ్డారు. మంగళవారం నారాయణ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌‌పై స్పందించారు. బీజేపీతో జట్టుకట్టిన కూటమికి వ్యతిరేకంగా మైనారిటీలు ఏకమై వైఎస్సార్సీపీని గెలిపిస్తారని జోస్యం చెప్పారు. ప్రాంతీయంగా బలంగా ఉన్న వైఎస్సార్సీపీని బీజేపీ దూరం చేసుకోదని స్పష్టం చేశారు.

పరోక్షంగా ఆ పార్టీకి సహాయం చేయడం కోసమే ఈ ప్రయత్నాలన్న ఆయన, ఇవేవీ గ్రహించకుండా పవన్ కళ్యాణ్ బీజేపీ ట్రాప్‌లో పడ్డారని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తానంటే పాచిపోయిన లడ్డులు అంటూ వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని బీజేపీ చెంత చేరారని ప్రశ్నించారు. ఆయన కమ్యూనిస్టులను కలుపుకొని, వీలుంటే తెలుగుదేశం పార్టీని కూడా తీసుకొచ్చి పోటీ చేస్తే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అప్పుడు దేశంలో బీజేపీని, రాష్ట్రంలో వైఎస్సార్సీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవచ్చని నారాయణ అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement