Friday, May 17, 2024

Pariksha pe charch – మీ పిల్ల‌ల ప్రొగ్రస్ కార్డు… మీ విజిటింగ్ కార్డు కాదు…పేరేంట్స్ కు మోడీ క్లాస్

న్యూఢిల్లీ – పిల్లల రిపోర్ట్ కార్డ్స్‌ని తమ సొంత విజిటింగ్ కార్డుగా పరిగణించొద్దని ప్రధాని నరేంద్రమోడీ విద్యార్థుల తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు. సోమవారం నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థులు ఇతరులతో కాకుండా తమతో తాము పోటీ పడాలని సూచించారు. పోటీ, సవాళ్లు జీవితంలో స్పూర్తిగా పనిచేస్తాయని, అయితే పోటీ ఆరోగ్యకరంగా ఉండాలని అన్నారు. ఒక పిల్లవాడిని మరొకరితో పోల్చొద్దని, అది వారి భవిష్యత్తుకు హాని కలిగించొచ్చని, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల రిపోర్ట్ కార్డును విజిటింగ్ కార్డుగా భావిస్తున్నారని, అది మంచిది కాదని ప్రధాని అన్నారు.

విద్యార్థులపై తోటివారి, తల్లిదండ్రులతో పాటు స్వీయ ఒత్తిడి వంటి మూడు రకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటారని చెప్పారు. కొన్ని సార్లు పిల్లలు తమ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నారని ఒత్తిడికి లోనవుతార‌ని అన్నారు. ప్రిపరేషన్ సమయంలో చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరుచుకుని, క్రమంగా పనితీరును మెరుగుపరుచుకోవాలని ప్రధాని సూచించారు. విద్యార్థులే భారతదేశ భవిష్యత్ రూపకర్తలుగా అభివర్ణించిన మోడీ పరీక్షా పే చర్చా కార్యక్రమం తనకు కూడా పరీక్ష లాంటిదని అన్నారు. విద్యార్థులు గతంలో కన్నా వినూత్నంగా మారారని ప్రధాని అన్నారు. మన విద్యార్థులే మన భవిష్యత్తును తీర్చిదిద్దుతారని చెప్పారు.

ఇది ఇలా ఉంటే విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించే పరీక్షా పే చర్చ గత ఆరు ఏళ్లుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్చించేందుకు సాయ పడుతోంది. కోవిడ్ మహమ్మారి సందర్భంగా నాలుగో ఎడిషన్ ఆన్‌లైన్ ద్వారా నిర్వహించారు. గత ఏడాది ఎడిషన్‌లో మొత్తం 31.24 లక్షల మంది విద్యార్థులు, 5.60 లక్షల మంది ఉపాధ్యాయులు, 1.95 లక్షల మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం, MyGov పోర్టల్‌లో 2.26 కోట్ల రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. వారంతా ప్ర‌ధాని ప‌రీక్షా పే చ‌ర్చ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement