Tuesday, April 30, 2024

Chennai: స్తంభించిన చెన్నై….ఇండ్ల‌లోనే ప్ర‌జ‌లు

ఇవాళ‌ తెల్లవారుజాము నుంచి చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని 14 రైల్వే సబ్‌వేల్లోకి నీరు చేరడంతో వాటిని మూసివేశారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నగరం, చుట్టుపక్కల జిల్లాల్లో మరో 24 గంటలపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఇప్పటికే చెన్నైలో మోహరించారు.

తాంబ్రం ప్రాంతంలో ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. నీటిలో చిక్కుకొన్న 15 మందిని కాపాడాయి. బాసిన్‌ బ్రిడ్జ్‌, వ్యాసర్‌పాడి మధ్యలోని బ్రిడ్జ్‌ నెం:14ను మూసివేసినట్లు ప్రకటించారు. ఈ ప్రాంతంలో చాలా ప్రదేశాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పాఠశాలలు మూసివేశారు. నగరంలోని కోర్టులకు సెలవు ఇచ్చినట్లు మద్రాస్‌ హైకోర్టు ప్రకటించింది. వీలైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు కోరారు.
రైళ్లు, విమాన స‌ర్వీసులు ర‌ద్దు…
చెన్నై-మైసూర్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, కోయంబత్తూర్‌ కోవై ఎక్స్‌ప్రెస్‌, కోయంబత్తూర్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, కేఎస్‌ఆర్‌ బెంగళూరు ఏసీ డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌, కేఎస్‌ఆర్‌ బెంగళూరు బృందావన్‌ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం రద్దు చేశారు. దీంతోపాటు సబర్బన్‌ రైళ్లను కూడా రద్దు చేశారు. కోయంబత్తూరు- చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. చాలా విమానాలను చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి మళ్లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement