Wednesday, May 15, 2024

భారత్‌పై క్షిపణి ప్రయోగానికి సిద్ధమైన పాక్‌?

హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి పొరబాటున పాకిస్తాన్‌లోకి క్షిపణి దూసుకువెళ్లిన సంఘటనపై దాయాది పాకిస్తాన్‌ ప్రతీకారంతో రగిలిపోయిందని, భారత్‌పైకి క్షిపణిని ప్రయోగించాలనుకుందన్న సంగతి వెలుగులోకి వచ్చింది. మార్చి9వ తేదీన రోజువారీ తనిఖీల్లో భాగంగా పరిశీలిస్తున్నప్పుడు బ్రహ్మోస్‌ మధ్యశ్రేణి క్షిపణి సాంకేతిక వైఫల్యంతో దూసుకెళ్లి పాకిస్తాన్‌ భూభాగంలో పడింది. పేలకపోయినప్పటికీ దాని ధాటికి అక్కడి భవంతులు ధ్వంసమైనాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే భారతదేశం నుంచి క్షిపణి ప్రయోగం జరిగిందని భావించిన పాకిస్తాన్‌ ప్రతీకారంగా బ్రహ్మోస్‌ మధ్యశ్రేణి క్షిపణులకు దీటైన మిసైల్‌ను ప్రయోగించేందుకు సన్నద్ధమైంది. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనావేసి తరువాత వెనక్కు తగ్గింది. ఈ విషయాలను బ్లూమ్‌బర్గ్‌ ప్రత్యేక కథనంలో వెల్లడించింది.

కాగా క్షిపణి ప్రయోగంపై పార్లమెంట్‌లో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ వివరిస్తూ సాంకేతిక సమస్యవల్ల అలా జరిగిందని, దర్యాప్తునకు ఆదేశించామని వెల్లడించారు. కానీ పాకిస్తాన్‌ సంయుక్త విచారణ జరపాల్సిందేనని పట్టుబడుతోంది. కాగా ఇది కాకతాళీయంగా జరిగిన ప్రమాదమేతప్ప అనుమానించాల్సింది ఏమీ లేదని అమెరికా సహా అనేక దేశాలు ప్రకటించాయి. అయితే ఆయా దేశాల ప్రతిస్పందన ఆశ్చర్యం కలిగిస్తోందని పాకిస్తాన్‌ తప్పుబట్టింది. హర్యానాలోని సిర్సా ప్రాంతంనుంచి భారత క్షిపణి దూసుకొచ్చి తమ భూభాగమైన మియాన్‌ చన్ను (పంజాబ్‌ ప్రావిన్స్‌)లో పడినంతవరకు తాము ట్రాక్‌ చేశామని పాకిస్తాన్‌ సైన్యం అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ బాబర్‌ ఇఫ్తికార్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement