Saturday, May 28, 2022

అఖిలపక్షంలోనూ వ‌డ్ల‌ పంచాయితే.. ప్రస్తావించిన టీఆర్ఎస్ నేతలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ :  పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు జరిగే అఖిలపక్ష సమావేశం కూడా తెలంగాణ ధాన్యం పంచాయితీకి వేదికగా మారింది. ఆదివారం ఢిల్లీలోని పార్లమెంట్ అనెక్స్ భవనంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వర రావు, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాశ్ ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాన్ని లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైనవారిలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు రాజ్యసభలో అధికారపక్ష నేతగా ఉన్న ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ కూడా ఉండడంతో ఈ విషయం గురించి నేరుగా ఆయనతో మాట్లాడారు.

సమావేశం అనంతరం తెలంగాణ భవన్ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన నామ నాగేశ్వరరావు, కేంద్ర ప్రభుత్వ తీరుతో తెలంగాణలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అన్నారు. తెలంగాణలో పంట మొత్తం కొనాలని, ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు, అధికారులు 2 నెలల వ్యవధిలో నాలుగైదుసార్లు కేంద్ర ప్రభుత్వంతో చర్చించారని, చివరకు కేంద్రం చేతులెత్తేసి యాసంగి (రబీ) పంట అసలే కొనలేమని చెబుతోందని అన్నారు. మొత్తంగా ఎంత కొంటామన్నది కూడా చెప్పడం లేదని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై శీతాకాల సమావేశాల్లో తొలి రోజు నుంచే లేవనెత్తుతామని నామ తెలిపారు. సభ లోపల, వెలుపలా ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు.
 
ఈ సమావేశంలో కేంద్రం మొత్తం 37 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిందని, అయితే గతంలో మాదిరిగా బిల్లులు పెట్టి చర్చ లేకుండా పాస్ చేయవద్దని తాము తేల్చిచెప్పామని నామ అన్నారు. తొలుత ప్రజా సమస్యలపై ఉభయ సభల్లో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. తాము వ్యవసాయ బిల్లులను ఆదిలోనే వ్యతిరేకించామని, చివరకు ప్రధాని క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఏ బిల్లునైనా చర్చ జరిపి, అవసరమైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించి పాస్ చేస్తే ఇలాంటి పరిణామాలు ఉత్పన్నం కావని కేంద్రానికి హితవు పలికారు. ఇప్పటికైనా స్వామినాథన్ సిఫార్సుల మేరకు పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.

అలాగే రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తేయాలని, ఉద్యమంలో మరణించిన రైతుల కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పరిహారం ప్రకటించి ఆదుకోవాలని నామ నాగేశ్వర రావు అన్నారు. తమ ప్రతిపాదనలకు అన్ని పార్టీల నేతలు మద్ధతు పలికారని ఆయన వ్యాఖ్యానించారు. ఓ పక్క వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటూనే మరోవైపు విద్యుత్ బిల్లు పెట్టారని, దీనిపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దేశంలో రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తున్న రాష్ట్రం తమదేనని అన్నారు. కృష్ణా జలాల వాటాలు తేల్చడం కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీలు అన్ని నెరవేర్చాలని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ కోసం ఎస్సీ, ఎస్టీ బిల్లు తీసుకొస్తున్నారని, ఇదే అంశంపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినప్పటికీ ఎలాంటి స్పందన లేదని కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement