Saturday, May 21, 2022

ముమ్మాటికీ మనదే విజయం, ఉక్రెయిన్‌పై సైనికచర్య అనివార్యం..

దేశ సరిహద్దుల్లో నాటో కూటమినుంచి ఎదురవుతున్న ముప్పు నేపథ్యంలో ఉక్రెయిన్‌పై సైనికచర్య అనివార్యమైందని, ఈ పోరాటంలో ముమ్మాటికీ విజయం మనదేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయమని స్పష్టం చేశారు. సహాయం పేరుతో సరిహద్దుల్లోని దేశాల్లో మోహరిస్తున్న నాటో కూటమితో రోజురోజుకు ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. ఇది తప్పనిసరి పరిస్థితుల్లో, అనివార్యంగా తీసుకున్న నిర్ణయమని తేల్చి చెప్పారు. ఈ పోరాటంలో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై విజయం సాధించినందుకు గుర్తుగా మే 9న విక్టరీ డే నిర్వహించడం ఆనవాయితీ. సోమవారం మాస్కోలోని రెడ్‌స్క్వేర్‌లో 77వ విజయోత్సవాలు నిర్వహించారు. ఆందులో భాగంగా దేశ ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తూ సైనిక బలగాలు కవాతు నిర్వహించాయి. వారిని ఉద్దేశించి పుతిన్‌ ప్రసంగించారు. ఉక్రెయిన్‌లో రష్యా సైనికులు చేస్తున్న పోరాటాన్ని పుతిన్‌ ప్రశంసించారు. మాతృభూమికోసం, దేశ భవిష్యత్‌ కోసం వారు ప్రాణాలొడ్డి పోరాడుతున్నారని అన్నారు. అయితే విక్టరీ డే సందర్భంగ ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటిస్తారని ప్రపంచ దేశాలు ఆందోళన చెందాయి. అయితే పుతిన్‌ ప్రసంగంలో ఆ ప్రస్తావన చేయలేదు. అదీగాక ఉక్రెయిన్‌పై పట్టు సాధించామని చెప్పలేదు. మునుముందు విజయం సాధిస్తామని విశ్వాసం మాత్రమే వ్యక్తం చేశారు. దాదాపు 75 రోజులు ముగిసిన తరువాత కూడా రష్యాను ఉక్రెయిన్‌ నిలువరిస్తున్న విషయాన్ని తేలిగ్గా తీసుకోలేమని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో యుద్ధం చేస్తున్న రష్యా సైనికులను నేరుగా ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతంలోని రష్యన్ల కోసం, మాతృదేశం కోసం మీరు చేస్తున్న పోరాటం గొప్పదని కీర్తించారు. ఉక్రెయిన్‌ గుప్పిట్లో చిక్కిన డాన్‌బాస్‌కు విముక్తి కల్పించాలని ప్రతినబూనిన విషయాన్ని గుర్తు చేశారు.

రష్యా చేతుల్లోకి పొపాన్సా..

కాగా ఉక్రెయిన్‌కు చెందిన పొపాన్సా, లుషాంకా ప్రాంతాలు రష్యా చేతుల్లోకి వెళ్లాయి. అక్కడినుంచి ఉక్రెయిన్‌ బలగాలు వెనుదిరిగాయని లుషాంక్‌ గవర్నర్‌ ధ్రువీకరించారు. కాగా పోర్టునగరం ఒడెశాపై సోమవారంనాడు నాలుగు ఒనిక్స్‌ రాకెట్లు, క్షిపణులతో రష్యా దాడులు చేసింది. రష్యా ఆధీనంలోని క్రిమియా భూభాగంనుంచి రష్యా ఈ దాడులు చేసింది. కాగా యూరోపియన్‌ యూనియన్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ చార్లెస్‌ మైఖేల్‌ పర్యటిస్తున్న సమయంలో ఈ దాడులు జరిగాయి. రెండో ప్రపంచ యుద్ధంలో అసువులు బాసిన సైనికులకు నివాళి అర్పిస్తున్న సమయంలో దాడులు జరగడంతో ఆయన కార్యక్రమం అర్థంతరంగా ముగించుకుని వెనుదిరిగారు.

మరియపోల్‌లో తరలింపు పూర్తి..

రష్యా స్వాధీనం చేసుకున్న మరియపోల్‌లోని అజోవత్సల్‌ స్టీల్‌ప్లాంట్‌లో చిక్కుకుపోయిన సాధారణ పౌరులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ పూర్తయింది. సమీపంలోని జపోరిరి&ురి&ుయాకు వీరిని ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఉక్రెయిన్‌ అధికారులు, అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ సొసైటీ, ఐరాస మానవతావిభాగం కార్యకర్తలు ఇందుకు సహకరించారు. కాగా ఉక్రెయిన్‌కు చెందిన దాదాపు 2వేల మంది సైనికులు ఇంకా స్టీల్‌ప్లాంట్‌లోని దిగువభాగంలోని బంకర్లలో తలదాచుకుని రష్యాను నిలువరిస్తున్నారు. మరియపోల్‌ పోర్ట్‌ సిటీని రష్యా బలగాలు స్వాధీనం చేసుకుని కొన్నివారాలైంది. కానీ యూరోప్‌లోని అతిపెద్ద స్టీల్‌ప్లాంట్‌లలో ఒకటైన అజోవత్సల్‌ ప్లాంట్‌ మాత్రం వారికి చేజిక్కలేదు. అక్కడ ఉక్రెయిన్‌ సైనికులనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ప్రతిరోజూ బాంబుల వర్షం కురిపించినప్పటికీ ఫలితం లేకపోయింది. స్టీల్‌ప్లాంట్‌లో ప్రజలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తడం, ఐరాస చీఫ్‌ గుటెరస్‌ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు ఉక్రెయిన్‌, రష్యా అంగీకరించాయి. ఈ నేపథ్యంలో పౌరుల తరలింపు పూర్తయింది. ఈ విషయాన్ని జెలెన్‌స్కీ ధ్రువీకరించారు. ఇకముందు ఇరుదేశాల సైనికుల మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement