Wednesday, April 17, 2024

అతి త్వరలో పెన్నా, సంగం బ్యారేజ్‌లు.. యుద్ధ ప్రాతిపదికన ఇతర పనులు

అమరావతి, ఆంధ్రప్రభ : నెల్లూరు పెన్నా బ్యారేజ్‌, మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంగం బ్యారేజ్‌ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి త్వరలోనే రెండు ప్రాజెక్టులను ప్రారంభిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సోమవారం ఆయన నెల్లూరు జిల్లాలో పెన్నా, సంగం నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్‌ రెడ్డితో కలిసి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో బ్యారేజ్‌ పనుల పురోగతిని పరిశీలించిన ఆయన అధికారులనడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు బ్యారేజిల నిర్మాణ పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయన్నాని వెల్లడించారు. మిగిలిన పనులను కూడా యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేసి అతి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. పెన్నా, సంగం బ్యారేజిలు పూర్తయితే పెన్నా డెల్టా ప్రాంతంలోని రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. మెట్ట ప్రాంతాలకు కూడా సాగునీరు అందుతుంది.. వరద ఉధృతి సమయాల్లోనూ ఎలాంటి విపత్తులు ఏర్పడకుండా రెండు బ్యారేజిలు ఉపయోగపడతాయని తెలిపారు.

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్దన్‌ రెడ్డి మాట్లాడుతూ పెన్నా, సంగం బ్యారేజిలను ఈ ఏడాది జులై లో ప్రారంభించేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నట్టు- తెలిపారు. జూన్‌ నెలాఖరులోపు మిగిలిపోయిన పనులన్నీ పూర్తవుతాయన్నారు. జలవనరుల శాఖ మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఈ రెండు బ్యారేజిల నిర్మాణం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి పనులు త్వరితగతిన పూర్తి చేయించారని కాకాని తెలిపారు. పెన్నా, సంగం బ్యారేజిలకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి శంఖుస్థాపన చేస్తే..ఆయన తనయుడు ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. మంత్రుల పర్యటనలో నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్‌ బాబు తో పాటు- నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, మాజీ పార్లమెంట్‌ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి, తెలుగుగంగ చీఫ్‌ ఇంజనీర్‌ హరి నారాయణ రెడ్డి, ఇరిగేషన్‌ ఎస్‌ఇ కృష్ణ మోహన్‌, ఆర్డీవో కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement