Friday, May 17, 2024

Siddipet: మన చెరువుల్లో మన చేపల పంట..!

(ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి మెదక్) : సిద్దిపేట జిల్లాలోని అన్ని చెరువుల్లో చేపల పంట పండింది. దీనికి తోడు ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లల పంపిణీ, రుణాలు, మార్కెటింగ్ సదుపాయం, సమీకృత చేపల మార్కెట్, భీమా, ప్రత్యేక శిక్షణ ప్రోత్సాహంతో మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు నిండి నీలి విప్లవం వచ్చింది. మంత్రి హరీశ్ ప్రత్యేక చొరవతో ఏడేండ్లలో జిల్లాలో మత్స్య ఉత్పత్తి రెట్టింపయ్యింది. దీంతో మత్స్య రైతులకు చేపల పెంపకంపై ఆసక్తి పెరిగింది. మిషన్ కాకతీయ, కాళేశ్వరం జలాశయాలు, కాల్వలతో చెరువులు, కుంటలలో పుష్కలంగా నీళ్లు వచ్చి చేరాయి. జిల్లాలోని అన్నీ చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో ఉచితంగా చేప పిల్లలు వేయడంతో మత్స్యకారులకు చేతినిండా పని దొరికింది. అటు కాలం అనుకూలించి సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇటు కాళేశ్వరంతో చెరువు, కుంటలలో గోదావరి జలాలు నింపడంతో యేడాది పొడవునా చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారిపోయాయి. నీటి వనరుల లభ్యత సద్వినియోగంతో రైతులకు సాగునీరుతో పాటు మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తున్న వైనంపై ప్రత్యేక కథనం..

చెరువుల్లో నీళ్లు లేవు. కరెంటు లేదు. పంటలు పండలేదు. చెరువుపై ఆధారపడిన కుటుంబాల జీవన పరిస్థితి దయనీయం. ఇది ఒకప్పటి దుస్థితి. కానీ ఇప్పుడు భిన్నంగా మారింది. ఎక్కడా చూసినా చెరువుల నిండా నీళ్లు. 24 గంటలు కరెంటు, పుష్కలంగా రెండు పంటలు పండుతున్నాయి. వీటికి తోడు చెరువులపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయి. అప్పుడు చెరువుల్లో నీళ్లు లేక కూలీనాలీ పనులకు పోయి జీవనం సాగించిన కుటుంబాలు నేడు జీవన ప్రమాణం పెరిగి ఆనందంగా జీవిస్తున్నాయి.

మన చేపలు మనకే.

- Advertisement -

ఇటీవల కాలంలో వర్షాలు పుష్కలంగా కురవడంతో చెరువులన్నీ నిండి అలుగుపోస్తున్నాయి. తాజాగా చేపలకు మంచి డిమాండ్ వస్తున్నది. దీంతో ప్రజలకు తాజా చేపలు లభించడంతో కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. పలుచోట్ల ఒక్కో చేప కిలో నుంచి 10 కిలోల బరువు ఉన్న లభిస్తున్నాయి. కొంతమంది వ్యాపారులు చెరువుల వద్దే ఒకేసారి చేపలు కొని గ్రామాల్లో తిరుగుతూ అధిక విక్రయిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చికెన్, మటన్ తో పాటుగా చేపలు సండే స్పెషల్ వంటకంగా మారింది. పైగా తాజా చేపలు కావడంతో ఏంతో రుచిగా ఉంటున్నాయని ప్రజలు అంటున్నారు. ఒకప్పుడు సమీకృత మార్కెట్‌లో పూర్తిగా హైదరాబాద్‌ నుంచి వచ్చిన చేపలే విక్రయించగా,  ప్రస్తుతం స్థానిక చెరువులు, కుంటల నుంచి తెచ్చిన చేపలనే ఎక్కువగా విక్రయిస్తున్నారు. చెరువులు, కుంటల్లో పెరిగిన చేపలు సాధారణ పరిస్థితుల్లో పెరగడంతో పెంచిన చేపల కన్నా ఎంతో రుచితోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న విశ్వాసంతో లోకల్‌ చేపలనే తినాలని జనం ఆసక్తి చూపుతున్నారు. కొన్ని చెరువుల్లో 3 నుంచి 10 కిలోల వరకు ఉన్న చేపలు దొరుకుతుండడంతో మత్స్యకారులు, ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

లోకల్ చేపలకు పెరిగిన ఆదరణ.

ప్రస్తుతం మాంసం వినియోగం బాగా పెరిగింది. మటన్ కిలో రూ.800 ఉండటంతో చేపలకు డిమాండ్ బాగా పెరిగింది. చేపలు కిలో 50 నుంచే దొరుకుతున్నాయి. దీంతో చేపలకు ఫుల్ డిమాండ్ పెరిగి చేపల మార్కెట్లో జనం కిక్కిరిస్తున్నారు. గతంలో బయట నుంచి ఐస్ డబ్బాలో చేపలు మార్కెట్లో దొరికేవి. కానీ ఇవాళ గ్రామాల్లోని చెరువుల్లో లోకల్ గా పెరిగిన చేపలు దొరకడంతో ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. వర్షాల కారణంగా ఎప్పటిలాగే రోటీన్ మటన్, చికెన్ బదులుగా ఏలాగైనా చేపలు తినాలని జనం ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదే క్రమంలో చేప ధరలు కూడా తగ్గిపోవడం జనాలకు కలిసొచ్చి సిద్ధిపేట, గజ్వేల్ సమీకృత మార్కెట్ లో గత ఐదు రోజులుగా విపరీతమైన రద్దీ ఉంటున్నది. స్థానిక ప్రాంతంలోని చెరువుల్లో పట్టిన లోకల్ చేపలు పట్టి గత రెండు, మూడుసార్లు రాత్రిలు లారీలలో లోడ్ దింపారని సిద్ధిపేట, మార్కెట్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.

చేతికందిన కొర్రమీన.

చేపల ధరలు ఒక్కసారిగా తగ్గాయి. ప్రస్తుత ఈ వారం వర్షాల సీజన్ లో ఆల్ టైమ్ రికార్డు స్థాయికి దిగజారాయి. దీంతో చేపల కొనుగోలుకు జనం ఎగబడుతున్నారు. ఒకప్పుడు కొరమీను కిలో రూ.700 నుంచి రూ.800 ఆల్ టైమ్ రికార్డు ధర పలికితే ఇప్పుడు ఇదే చేప ధర రూ.450 నుంచి రూ.550 వరకూ చేరింది. కొర్రమీన చేప చేతికందిందని, లోకల్ చేపలకు ఆదరణ పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే రవ్వ, బంగారు తీగ చేపలు కిలోకు ఏకంగా రూ.120 నుంచి ధర పలికేవి. కానీ ఇవాళ రవ్వలు రూ.50 నుంచి రూ.70 ధర పలుకుతున్నాయి.

చేప..18కిలోల దాకా..!

ఒకప్పుడు అరకిలో. కిలో.. రెండు కిలోల చేపలు మాత్రమే దొరికేవి. ప్రస్తుతం ఐదు కేజీల నుంచి 18 కిలోల వరకూ చేపలు లభ్యమవుతున్నాయి. ఒక చేప కిలో బరువు పెరగడానికి 11 నెలల సమయం పడుతుంది. అదే విధంగా కిలో నుంచి ఐదు కిలోలు పెరగాలంటే రెండేళ్ల నుంచి మూడేళ్ల సమయం పడుతుంది. పైగా చేప పెరిగే కొద్దీ ఎదుగుదలలో కూడా మార్పు ఉంటుంది. యేడాదిలోపు ఉన్న చేపలు ఆహారం తక్కువగా తీసుకోవడంతో రెండు నుంచి మూడు కిలోలు పెరుగుతాయి. యేడాది దాటిన తర్వాత చేప జీర్ణ వ్యవస్థ పెరగడంతో ఎక్కువగా ఆహారం తీసుకుంటాయి. దీంతో చేపలు 5కిలోల నుంచి 10కిలోలు వరకూ పెరిగేందుకు అవకాశం ఉంది. దీనికి తోడు ఎక్కువ రోజులు చేపలు చెరువుల్లో ఉండటంతో 18కిలోల వరకూ పెరుగుతాయి. ఒక చేప సరాసరి 10ఏళ్ల వరకూ జీవిస్తుంది. ఆ తర్వాత చేప చనిపోయే ఆస్కారం ఉంటుందని మత్స్యశాఖ అధికార వర్గాలు తెలిపాయి.

 

ఏడేండ్లుగా ప్రభుత్వం జిల్లాలోని చెరువులు, కుంటల్లో ఉచితంగా చేప పిల్లలు వదిలింది. దీంతో ఆ ప్రాంత ముదిరాజ్, గంగపుత్ర కులస్తులకు తమ కులవృత్తి అయిన చేపలు పట్టడంతో ఆర్థికంగా బలపడుతున్నారు.
-ప్రత్యేకించి సిద్ధిపేట నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 56 మత్స్యకార సొసైటీలు ఉండగా, 3429 మంది మత్స్యకారులు శాఖాపరంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. సిద్ధిపేట నియోజక వర్గంలో సిద్ధిపేట అర్బన్, సిద్ధిపేట రూరల్, నారాయణరావుపేట, చిన్నకోడూర్, నంగునూరు మండలాల్లో చిన్నా, పెద్ద చెరువులలో చేపల పెంపకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో ఉచితంగా 2 కోట్ల 79 లక్షల చేప పిల్లలు వదిలి పెంచుతున్నది.

-గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లోని చిన్నా, పెద్ద చెరువులలో చేపలు పెంపకానికి ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో ఉచితంగా 4 కోట్ల 22 లక్షల చేప పిల్లలు వదిలి పెంచుతున్నది.

-దుబ్బాక నియోజకవర్గ పరిధిలో ఆయా మండలాల్లోని చిన్నా, పెద్ద చెరువులలో చేపలు పెంపకానికి ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో ఉచితంగా 4 కోట్ల 84 లక్షల చేప పిల్లలు వదిలి పెంచుతున్నది.

-హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లోని చిన్నా, పెద్ద చెరువులలో చేపలు పెంపకానికి ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో ఉచితంగా 2 కోట్ల 47 లక్షల చేప పిల్లలు వదిలి పెంచుతున్నది.

-అలాగే మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలాల చెరువులలో ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో 77.99 లక్షల చేప పిల్లలు వదిలి పెంచుతున్నది.

-అలాగే జనగామ నియోజకవర్గ పరిధిలోని సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలాల చెరువులలో ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో 2 కోట్ల 97 లక్షల చేప పిల్లలు వదిలి పెంచుతున్నది.

జిల్లా వ్యాప్తంగా 1634 సాగునీటి చెరువులు, కుంటల నీటి వనరుల నీటి విస్తీర్ణం 24914.577 హెక్టార్లు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ భాగంగా నిర్మితమైన మల్లన్న, రంగనాయక, కొండపోచమ్మ సాగర్ జలాశయాలతో మొత్తం నీటి విస్తీర్ణం 9915.4 హెక్టార్లు రావడంతో చేపల పంపకానికి ఎంతో అనువుగా మారింది.
జిల్లాలో మధ్య తరహా, చిన్ననీటి వనరుల ఆధారంగా 243 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఈ సంఘాలలో 18500 సభ్యులు సోసైటీ పరిధిలోని చెరువులు, కుంటలలో చేపల పెంపకం, అమ్మకం ద్వారా ఉపాధి పొందుతున్నారు. అలాగే జిల్లాలో రిజిస్ట్రేషన్ చేయబడిన 38 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 1851 సభ్యులు ఎండు చేపలు, రొయ్యలు, పచ్చి చేపలు, రొయ్యలు అమ్మకంతో జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని ఆయా సిద్ధిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజక వర్గ వ్యాప్తంగా చెరువులు, కుంటల్లో భారీస్థాయిలో చేపలు పెరుగుతుండగా వాటిని పట్టి గజ్వేల్‌, హైదరాబాద్‌ మార్కెట్‌కు తరలిస్తూ మత్స్యకారులు మంచి లాభాలను గడిస్తున్నారు. వీరంతా చేపలు పడుతూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు.

మంత్రి హరీశ్ ప్రత్యేక చొరవ.. గణనీయంగా పెరిగిన మత్స్య సంపద

ఓ వైపు ఎప్పటికప్పుడు మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవ, మరో వైపు జలాశయాల జిల్లా కావడంతో చేపల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టులో 20, 20, 815 రొయ్య పిల్లలను వేయించారు. జిల్లాలో వంద శతం సబ్సిడీపై చేప పిల్లలు సరఫరా చేస్తూ 2016 -17 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతీ యేటా మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా వందశతం రాయితీపై చేప పిల్లలు, రొయ్య పిల్లలు పంపిణీ చేపట్టింది.
క్రమ సంఖ్య చేప పిల్లలు విడుదల చేసిన సంవత్సరం విడుదల చేసిన నీటి వనరుల సంఖ్య విడుదల చేసిన చేప పిల్లల సంఖ్య-లక్షలలో చేప పిల్లల ఖరీదు విలువ-లక్షలలో విడుదల చేసిన నీటి వనరుల సంఖ్య విడుదల చేసిన రొయ్య పిల్లల సంఖ్య-లక్షలలో రొయ్య పిల్లల ఖరీదు విలువ-లక్షలలో

  1. 2014-15  0 0 0 0 0 0
  2. 2015-16   0 0 0 0 0 0
  3. 2016-17   234  102.24   82.21  0 0 0
  4. 2017-18   337  168.00  138.23   0 0 0
  5. 2018-19   96 59.39  57.34  01 2.40 4.704 
  6. 2019-20   780  248.87  180.18   03 4.72 8.8264 
  7. 2020-21   1352  372.70  352.37  03 11.71 24.35 
  8. 2021-22   1606  397.64   463.56   07 23.25 60.45 
  9. 2022-23   1553  392.447     403.06  07 25.04 61.34 
    మొత్తం 5958  1845.577    1705.94   21 67.12  159.6704  

చేపలు, రొయ్యల దిగుబడి.

క్రమ సంఖ్య చేపలు ఉత్పత్తి చేసిన సంవత్సరం చేపలు దిగుబడి టన్నులలో రొయ్యల దిగుబడి టన్నులలో

  1. 2014-15  843 0
  2. 2015 -16 1238  0
  3. 2016 -17  2911  0
  4. 2017 -18  14057.4    0
  5. 2018 -19  8825.79   0
  6. 2019 -20  15134   125 
  7. 2020 -21  17628    116 
  8. 2021 -22  19927   952 
  9. 2022 -23  18691   537 
    మొత్తం 97, 174.19    1730 

2023 -24 సంవత్సరమునకు గానూ సిద్ధిపేట జిల్లాలోని 1634 నీటి వనరులతో పాటు రంగనాయక, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ జలాశయాలలో 263.78 లక్షల 80-100 MM సైజు కలిగిన చేప పిల్లలు, 164.81 లక్షల 35-40 MM సైజు కలిగిన చేప పిల్లలు ప్రభుత్వమే ఉచితంగా పంపినీ చేసి వదిలేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి మత్స్యశాఖకు పంపగా త్వరలోనే ప్రభుత్వ ఆమోదం లభించనున్నది.
సిద్ధిపేట సమీకృత మార్కెట్ చేప ధరలు
సంఖ్య చేప రకం పాత రేట్ ప్రస్తుత రేట్

  1. రవ్వలు 120 50 నుంచి 70
  2. కొర్ర మట్ట-లోకల్ 400 `450
  3. జెల్లలు 400 300 
  4. బంగారు తీగ 120  70
  5. పాంప్లెట్ 80 60
  6. రొయ్యలు 400 350 
  7. పాపెరలు 400  300 
  8. కోర్రమట్ట-నాన్ లోకల్ 350  300

Advertisement

తాజా వార్తలు

Advertisement