Friday, May 10, 2024

TS | మైనార్టీలకూ లక్ష సాయం.. కొత్త పథకాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మైనార్టీలకు సీఎం కేసీఆర్‌ తీపి కబురునందించారు. మైనార్టీల ఆర్ధిక స్వావలంబన దిశగా మరో కీలక నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్‌ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనార్టీలకూ పూర్తి రాయితీతో రూ.లక్ష ఆర్ధిక సాయాన్ని అందించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. సమాజంలో కులమతాలకు అతీతంగా పేదరికాన్ని ప్రారదోలాలనే దార్శనికతతో ప్రభుత్వం పని చేస్తోందని సీఎం కేసీఆర్‌ ఈ సందర్బంగా పేర్కొన్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందన్నారు. మైనార్టీల అభివృద్ధికి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విద్యా, ఉపాధి సహా అన్ని రంగాలలో పలు సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలలోని పేదరికం, వెనుకబాటుతనం తొలగించేందుకు కృషి చేస్తోందని, ఈ కృషిని మరింత ముందుకు తీసుకువెళతామని పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వం చేపట్టిన సమర్ధవంతమైన కార్యాచరణ ఉత్తమ ఫలితాలనిస్తోందన్నారు.

- Advertisement -

భిన్న సంస్కృతులు, విభిన్న మత ఆచార సాంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమున తహజీబ్‌ను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. మైనార్టీలకు రూ. లక్ష ఆర్ధిక సాయం పూర్తి సబ్సిడీతో అందించాలి. కులమతాలకు అతీతంగా పేదల అభివృద్ధికి ప్రభుత్వం పనిచేస్తోంది. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. భిన్న సంస్కృతులు, మతాచారాలను ప్రభుత్వం సమానంగా ఆదరిస్తోంది. రాష్ట్రంలో గంగా జమున తహజీబ్‌ను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది అని స్పష్టం చేశారు.

ఆర్ధిక సాయానికి అర్హతలివే…

సామాజిక, మానవీయ కోణంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా బీసీలకు రూ. లక్ష ఆర్ధిక సాయం తరహాలోనే ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీలకు రూ. లక్ష ఆర్ధిక సాయం దిశగా సర్కార్‌ పూర్తి రాయితీతో కూడిన పథకాన్ని ప్రకటించింది. వారసత్వ వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వృత్తులకు సర్కార్‌ ఈ సాయం అందిస్తోంది. ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు 2023 జూన్‌ 2 నాటికి దరఖాస్తుదారు తప్పనిసరిగా 21నుంచి 55 ఏళ్ల మధ్య వయసు కల్గి ఉండాలని నిబంధన విధించింది.

ఒక్కో కుటుంబానికి ఒక యూనిట్‌గా పరిగణించి ఒక గ్రాంట్‌ మాత్రమే అందజేస్తారు. లబ్దిదారుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.5లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉండరాదు. అంతకుముందు ఏదైనా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని వినియోగించుకున్నట్లయితే ఆయా లబ్దిదారులు ఈ కొత్త పథకానికి అనర్హులుగా పేర్కొంది. తెలంగాణలోని వెనుకబడిన తరగతుల కళాకారులు, వృత్తిపరమైన సంఘాలు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది.

ముస్లిం లబ్దిదారులకు స్టేట్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా, క్రిస్టియన్లకు క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా ఆర్ధిక సాయం అందజేత. జిల్లా స్థాయి మానిటరింగ్‌, స్క్రీనింగ్‌ కమిటీల నేతృత్వంలో దరఖాస్తుల పరిశీలన, వడపోత, లబ్దిదారుల ఎంపిక జరుగుతుంది. జిల్లా కలెక్టర్ల ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జిల్లా ఇంచార్జి మంత్రి నేతృత్వంలో లబ్దిదారుల ప్రకటన. లబ్దిదారుల సెలక్షన్‌ జాబితా టీఎస్‌ఎంఎఫ్‌సి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. దశల వారీగా పథకం అమలవుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement