Friday, May 17, 2024

15న టెట్.. పేపర్‌-1 పరీక్షకు 2,69,557 మంది, నిమిషం నిబంధన అమలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (టెట్‌) పరీక్ష జరగనుంది. టెట్‌ పరీక్షకు నిమిషం నిబంధనను అమలు చేయనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరగనుంది. పేపర్‌-1 పరీక్షకు 2,69,557 మంది అభ్యర్థులు హాజరుకానుండగా, పేపర్‌-2 పరీక్షకు 2,08,498 మంది అభ్యర్థులు రాయనున్నారు. అయితే ఇందులో పేపర్‌-1 రాసేవారే చాలా మది పేపర్‌-2ను కూడా రాస్తున్నారు.

మొత్తంగా 4,78,055 మంది అభ్యర్థులు టెట్‌ పరీక్షను రాయనున్నారు. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2052 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్‌-1 పరీక్ష కోసం 1139 పరీక్షా కేంద్రాలు, పేపర్‌-2 కోసం 913 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణ కోసం విధులు నిర్వహించేందుకుగానూ 2052 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌ అధికారులు, 2052 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్స్‌, 22,572 మంది ఇన్విజిలేటర్లు, 10,260 మంది హాల్‌ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లను నియమించారు.

పకడ్బందీగా టెట్‌ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష సమయానికి కనీసం ఒక గంట ముందే తమ తమ కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు తమవెంట రెండు బాల్‌పాయింట్‌ బ్లాక్‌ పెన్నులు, హాల్‌టికెట్‌, గుర్తింపు కార్డు తెచ్చుకోవాలన్నారు. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, బ్యాగులు, ఇతర వస్తువులు కేంద్రాల్లోకి అనుమతించబడవని సూచించారు.

- Advertisement -

నిర్ణీత సమయం దాటితే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. హాల్‌టికెట్‌పై ఉన్న నిబంధనలను తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. ఓఎంఆర్‌ షీట్‌ను మలవడం, దానిపైన ఎలాంటి గీతలు గీయడం, పిన్నులు కొట్టకూడదని సూచించారు. ఆన్సర్‌ పెట్టేటప్పుడు ఓఎంఆర్‌ షీట్‌లోని గడులను బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్నుతో పూర్తిగా షేడ్‌ చేస్తేనే దాన్ని పరిగణలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాలున్న పాఠశాలలు, కళాశాలలకు నేడు విద్యాశాఖ సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement