Friday, April 26, 2024

ఓంప్రకాష్‌ చౌతాలాకు నాలుగేళ్ల జైలు.. రూ.50 లక్షల జరిమానా..

న్యూఢిల్లి : హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ అధినేత ఓం ప్రకాష్‌ చతాలా (87)కు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యూఢిల్లిలో నింస్‌ అవెన్యూ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. అక్రమాస్తుల కేసును విచారించిన న్యాయస్థానం, చతాలాకు జైలుశిక్షతో పాటు రూ.50 లక్షల జరిమానాను విధించింది. అలాగే, చతాలాకు చెందిన వివిధ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేసింది. 1993-2006 మధ్య కాలంలో దాదాపు రూ.6.09 కోట్ల మేర అక్రమంగా ఆస్తుల సంపాదించారని, వాస్తవ ఆదాయానికన్నా ఎన్నో రెట్లు అధికంగా ఆస్తులు కూడబెట్టారని అభియోగంపై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) 2005లో కేసునమోదు చేసింది. దీనిపై 2010లో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ కేసును విచారించిన కోర్టు చతాలా అక్రమాస్తులు పెంచుకోవడంతోపాటు మనీలాండరింగ్‌ (అక్రమ లావాదేవీలు)కు పాల్పడినట్లు 2021 జనవరిలో నిర్ధారించింది. తాజాగా ఆ కేసులో శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది.

జైలుశిక్ష, భారీ జరీమానాతోపాటు న్యూఢీల్లోని హెయిలీ రోడ్డు, పంచకుల, గురుగావ్‌, అసోలాలోని చతాలా ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. కాగా అక్రమాస్తుల కేసులో చతాలాకు కఠిన శిక్ష విధించి సమాజానికి, అక్రమార్కులకు హెచ్చరిక సంకేతాన్ని పంపాలని వాదనల సందర్భంగా న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. సీబీఐ కోరినట్టే గరిష్ఠంగా శిక్షపడింది. కాగా 2013లో అధికారంలో ఉండగా టీచర్ల నియామకాల్లో భారీ అవినీతికి పాల్పడ్డారన్న కేసులో దోషులుగా తేలడంతో ఓం ప్రకాష్‌ చతాలా, ఆయన కుమారుడు అజయ్‌ దోషులుగా తేలడంతో పదేళ్ల జైలుశిక్ష పడింది. ఎనిమిదేళ్ల తరువాత 2021 జులైలో ఆయన జైలునుంచి విడుదలయ్యారు. కాగా ఇప్పుడు అక్రమాస్తుల కేసులో మరోసారి జైలుశిక్ష పడింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement