Friday, April 19, 2024

Followup : వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే.. తొలి రోజు మహానాడులో ఉత్సాహంగా చంద్రబాబు

ఒంగోలు, ప్రభన్యూస్‌ బ్యూరో : వచ్చే పార్వత్రిక ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఒంగోలులో శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైన మాహానాడులో ఆయన జ్యోతి వెలిగించి మహానాడును ప్రారంభించారు. అనంతరం అధ్యక్షోపాన్యాసం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాజకీయ పార్టీల్లో యువతను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని, పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కోసం పని చేసే వాళ్లకే అవకాశాలు వస్తాయన్నారు. రాష్ట్ర అప్పుల భారం రూ.8 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రం దివాళా తీసిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం లేదని, అంతా మోసకారి సంక్షేమమే జరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదన్నారు. ఉమ్మడి ఏపీలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెన్‌(ఐఎస్‌బి) వార్షిక దినోత్సవ వేడుకల్లో ప్రధాని నా పేరును ప్రస్తావించకపోవచ్చు, కానీ నా కృషి వల్లే ఐఎస్‌బి హైదరాబాద్‌కు వచ్చిందనే విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

అది నాకు సంతృప్తినిసుందని చంద్రబాబు చమత్కరించారు. పోలవరం డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందన్నారు. మద్యం, గంజాయి డ్రగ్స్‌తో రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారన్నారు. కేంద్రం దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, ప్రాజెక్టులు కట్టడం చేతకాకపోతే ప్రభుత్వం గద్దె దిగిపోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. కోనసీమను సర్వనాశనం చేయడానికి కులాల మధ్య చిచ్చు పెడతారా..? అంటూ చంద్రబాబునాయుడు మండిపడ్డారు. అంబేద్కర్‌ పై అభిమానం ఉంటే అమరావతిలో విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కోనసీమలో అల్లర్లకు వైసీపీయే కారణమని, వారే మనుషుల్ని పెట్టుకుని అమలాపురంలో విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. వారి ఇళ్లను వారే తగలబెట్టుకుని ఇతరుల పై బురద జల్లుతున్నారని ద్వజమెత్తారు. మంత్రి ఇళ్లు తగలబడిపోతుంటే అక్కడున్న పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌ పరిపాలన చేతకాక, అప్పులు పుట్టక, పథకాలు కొనసాగించలేక మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని వి వరించారు. ఆయనకు ఈ సారి ఎన్నికల్లో ఎలా బుద్ది చెప్పాలో ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుందన్నారు. పసుపు రంగు చూస్తే చైతన్యం వస్తుందన్నారు. రాజకీయం అంటే తమాషా కాదని, రాష్ట్రంలో ఉన్మాద పాలన కొనసాగుతుందన్నారు. చేతకాని దద్దమ్మ జగన్‌ వల్ల రాష్ట్రం పరువు పోతోందన్నారు. దావోస్‌లో సీఎం జగన్‌ ఎం చేస్తున్నారో చూశారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. గ్రీన్‌ కోతో టీడీపీ హయాంలో చేసిన ఒప్పందాన్ని ఇప్పుడు ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు అంటూ విమర్శించారు. క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ ప్రతి ఇంట్లో చర్చించుకోవాలని పిలుపునిచ్చారు. జగన్‌ అండ్‌ కంపెనీ ఆదాయం పెరిగిందని, ఆయన అనుయాయూల ఆదాయం పెరిగిందని, ప్రజల ఆదాయం మాత్రం తగ్గిందని విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని నిలదీసే సమయం వచ్చిందని గుర్తు చేశారు. ఏపీలో ఉన్మాదపాలన సాగుతోందని ద్వజమెత్తారు. సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండి పడ్డారు. రాకి కరెంటుకు కూడా బాదుడే బాదుడు మొదలు పెట్టారని విమర్శించారు. టీడీ పీ నేతల అక్రమ అరెస్టులతో తాను నిద్రలేని రాత్రులను గడపానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని విరోదులుగా చూస్తున్నారని అన్నారు. వైసీపీ తాటాకు తప్పుళ్లకు భయపడేది లేదని, ఎవరు తప్పు చేసినా వదిలి పెట్టమని, ప్రజా సమస్యల పైనే మన పోరాటమని చంద్రబాబు మహానాడు వేదిక పై నుంచి పిలుపునిచ్చారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, రోడ్ల పైకి రండి.. రైతులకు మళ్లీ మంచి రోజుల వస్తాయని, మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరేసే పరి స్థితి తీసుకోస్తారా..? రాష్ట్రంలో నిత్యావసరాలు కొనే పరిస్థితి లేదు. రాష్ట్రంలో అన్న క్యాంటిన్లను తీసేశారు. విదేశీ విద్య,పెళ్లి కానుక పథకాలన్నీ ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాదుడే బాదుడు కొనసాగుతుందని మండి పడ్డారు. వైసీపీకి అభివృద్ధి చేయడం చేతకాకపోతే చేతనైన వాళ్లను పక్కన పెట్టుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. పోలీసులను అడ్డం పెట్టుకొని పాలన చేస్తున్నారని, కేసులు, లాఠీలతో భయపడే ప్రశ్నే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. డీజీపీ నుంచి కానిస్టేబుల్‌ వరకు అందరూ ఆలోచించాలన్నారు. ఉన్నాది చేతిలో పోలీసులు బలికావద్దని సూచించారు. తప్పులు పనులు చేస్తే ఎవరిరీ వదిలిపెట్టేది లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పన్నులు పెంచారన్నారు. ప్రజల పై పన్నుల భారం వేసి ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఎవరైనా తప్పు తెలుసుకుంటే బాగుపడతారని, చెప్పింది వినకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. అమ్మ ఒడి అన్నా..నాన్న బుడ్డి పెట్టారని చలోక్తులు విసిరారు. అమ్మ ఒడి కంటే నాన్న బుడ్డి ద్వారా వసూలు చేస్తున్నారని విమర్శించారు. తెదేపా హయాంలో పెట్టిన అన్న క్యాంటిన్లు తీసేశారన్నారు. విదేశీ విద్య, పెళ్లి కానుక వంటి పథకాలన్నీ ఏం చేశారని ప్రశ్నించారు.

ఎన్నికల ముందు మద్యపాన నిషేదమన్నారు. మద్యపాన నిషేధ హామీ తుంగలో తొక్కారని, నాసిరకం బ్రాండ్లు తీసుకొచ్చి దండుకుంటున్నారన్నారు. ఇళ్లు కట్టిస్తామన్నారు..కనీసం ఇసుక కూడా దొరకడం లేదన్నారు. రాష్ట్రాన్ని పాలించే అర్హత వైకాపాకు లేద ని చంద్రబాబు స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం అవినీతి వల్లే రాష్ట్రం దివాళా తీసిందన్నారు. ముఖ్యమంత్రి పదవులు నాకు కొత్తేమి కాదని, ఎక్కువ సమయం సీఎంగా ఉండే అవకాశమిచ్చారని, కానీ నా ఆవేదన అంతా రాష్ట్రం నాశనమవుతుందని అన్నారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని జగన్‌ రెడ్డి నాశనం చేశారన్నారు. గడప గడపకు ప్రభుత్వం అని కార్యక్రమం పెట్టారని, ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో బస్సు యాత్ర మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయమని గొప్పలు చెప్పుకుని రాజ్యసభ సీట్లు ఎవరి కిచ్చారో అందరూ చూశారన్నారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, టీడీపీ పుట్టిన 40 ఏళ్లు పూర్తిందని, ఈ సారి మహానాడుకు ఓ ప్రత్యేకత ఉందన్నారు. పార్టీ పుట్టి 40 ఏళ్లయిందని, వ్యవస్థాపకులు ఎన్టీ ఆర్‌ శత జయంతి కూడా కావడంతో ఈ సారి మహానాడుకు ప్రత్యేకమైందన్నారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేసేందుకు ప్రతి కార్యకర్త శపథం చేయాలని అచ్చెన్నాయుడు కోరారు. టీడీపీ అంటే అధికారం ఉన్నప్పుడే రాజకీయం చేయడం కాదు. అధికారం ఉన్నా లేక పోయినా ప్రజల మధ్య ఉన్న పార్టీ అని పేర్కొన్నారు. గత 40 ఏళ్లలో ఈ మూడేళ్లలో తాము పడిన కష్టం ఎప్పుడూ పడలేదని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. జాతీయ స్థాయి నేతల నుంచి కార్యకర్త వరకూ దుర్మార్గమైన ముఖ్యమంత్రి నుంచి ఇబ్బందులు పడ్డారన్నారు. వైసీపీలా టీడీపీ గాలికి పుట్టిన పార్టీ కాదు, ప్రజల నుంచి పుట్టిన పార్టీ అని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు అసరా చూపించిన పార్టీ అన్నారు. ఈ పార్టీని లేకుండా చేయడం నీకు, నీ తండ్రికీ, తాతకూ సాధ్యం కాదని సీఎం జగన్‌ను ఉద్దేశించి వాఖ్యానించారు. వైసీపీ పాలనలో భయపడ్డ కార్యకర్తలకు చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంతో ధైర్యమిచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు పర్యటనలకు ఉత్తరాంధ్రకు మించి రాయలసీమలో స్పందన వచ్చిందన్నారు. 160 స్థానాలతో చంద్రబాబు సీఎం అవుతారని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. వైసీపీ మంత్రుల బస్సు యాత్రలో అలీబాబా 40 దొంగలున్నారని విమర్శించారు. టీడీ పికి బలహీన వర్గాలు దగ్గరవుతున్నాయనే బస్సు యాత్ర చేపట్టారని ఆరోపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement