Saturday, April 27, 2024

ఈవీ తయారీదార్లకు నోటీసులు.. వాహనాల్లో మంటలు చెలరేగడంపై వివరణ..

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పరిశ్రమల యాజమాన్యాలన్నింటికీ షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని కేంద్ర రోడ్డురవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. గత వేసవిలో చాలా కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల్లో మంటలు చెలరేగి ప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో ఆయా కంపెనీల సీఈఓలు, మేనేజింగ్‌ డైరక్టర్ల వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసినట్లు ఆయన పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. ఈవీల్లో ప్రమాదాలపై లేవనెత్తిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ వారి జవాబులనుబట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈవీల్లో ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, వాహనాల తయారీ సందర్భంగా మరిన్ని పరీక్షలకు ఆదేశించారా? ఆయా కంపెనీలపై జరీమానాలు విధించారా అన్న ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. కాగా ఆయా వాహనాల్లో వాడే బ్యాటరీల సామర్థ్యం, నాణ్యత, పనిచేసే విధానం వంటివాటిని పరిశీలించి, తగు సూచనలు ఇచ్చేందుకు నిపుణుల కమిటీని వేసామని గడ్కరీ సభ దృష్టికి తీసుకువచ్చారు. నిపుణుల కమిటీలో ఐఐఎస్‌ బెంగళూరు, నావల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ లేబరేటరీ (ఏపీ), ఐఐటీ మద్రాస్‌కు చెందిన ప్రముఖులున్నారని తెలిపారు.

ఈవీల్లో ప్రమాదానికి గల కారణాలు వివరించాలని, మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ను అనుసరించి ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని అన్ని తయారీ సంస్థలకు నోటీసులిచ్చిన విషయాన్ని ఆయన చెప్పారు. అంతకుముందు సభలో మాట్లాడిన భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి క్రిషన్‌ పాల్‌ గుర్జార్‌ మాట్లాడుతూ గత ఏప్రిల్‌లో సాంకేతిక లోపాల కారణంగా మూడు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థలు 6,656 టూవీలర్‌ ఈవీలను వెనక్కు పిలిపించిన విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఒకినవా సంస్థ 3215, ప్యూర్‌ ఈవీ 2వేలు, ఓలా 1441 వాహనాలను వెనక్కు తీసుకున్నాయని వివరించారు. ఆయా ఎలక్ట్రిక్‌ వాహనాల నాణ్యతను కేంద్ర మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌, 1989, 126 నిబంధన ప్రకారం అన్ని పరీక్షలు నిర్వహించామన్నారు. కాగా ఈవీల్లో ఉపయోగిస్తున్న బ్యాటరీల తయారీ, డిజైన్లలో లోపాలున్నట్లు ప్రాథమికంగా నిపుణులు గుర్తించినట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement