Thursday, May 9, 2024

రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండలాలు.. 607కు చేరిన సంఖ్య..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా డిమాండ్‌ వినిపిస్తున్న జిల్లాల నుంచి పాలనకు అనుగుణంగా కొత్త మండలాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ ఆమోదముద్ర వేశారు. ముందుచూపు, దార్శనికతతో ప్రజలకు క్షేత్రస్థాయి పాలనను మరింత దగ్గరకు చేసే లక్ష్యంతో ఇప్పటికే సీఎం కేసీఆర్‌ నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 594 మండలాలు ఉన్న రాష్ట్రంలో కొత్త మండలాలతో కలుపుకుని ఈ సంఖ్య 607కు చేరింది. ప్రజల ఆకాంక్షలు, స్థానిక అవసరాలను పరిశీలించి కొత్తగా మరిన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఇటీవలె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పది జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ శనివారం ప్రాథమిక ఉత్తర్వులను జారీ చేసింది.

జిల్లా నూతన మండలం పేరు :

నారాయణపేట గుండుమన్‌, కొత్తపల్లె
వికారాబాద్‌ దుడ్యాల్‌
మహబూబ్‌నగర్‌ కౌకుంట్ల
నిజామాబాద్‌ ఆలూర్‌, డొంకేశ్వర్‌, సాలూర
మహబూబాబాద్‌ సీరోల్‌
నల్గొండ గట్టుప్పల్‌
సంగారెడ్డి నిజాంపేట్‌
కామారెడ్డి డోంగ్లీ
జగిత్యాల ఎండపల్లి, భీమారం

రాష్ట్రంలో కొత్త మండలాలు కోరుతూ డిమాండ్లు పెరుగుతూ వచ్చాయి. అయితే గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన మండలాల ఏర్పాటుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే పలు రాజకీయ కారణాలతో కొన్ని జిల్లాల నుంచి తమ ప్రాంతాన్ని మండలంగా చేయాలంటే తమ ఊరును మండలంగా ప్రకటించాలని ప్రభుత్వానికి దరఖాస్తులు చేరాయి. కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తయిన తర్వాత మండలాలకు గిరాకీ పెరుగుతోంది. పెరిగిన జనాభా, విస్తరించిన విస్తీర్ణం పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం ఉన్న మండలాలనుంచి కొన్ని కొత్త మండలాలు ఏర్పాటు చేయాలనే విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందుతున్నాయి. సాధ్యాసాధ్యాలు, అనుకూలతలు, అననుకూలతల వంటి అంశాలతోపాటుగా మరో 20 శాఖాపరమైన శాస్త్రీయ కొలమానాల ఆధారంగా ప్రభుత్వం కొత్త మండలాల ఏర్పాటుపై సమీక్షను తుది దశకు తెచ్చింది. జిల్లాల ఫార్మేషన్‌ యాక్టు-1974 ప్రకారం కొత్త జిల్లాలే కాకుండా రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు జరుగుతోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement