Thursday, May 16, 2024

అధికారులతో నిజాం కాలేజీ విద్యార్థినుల చర్చలు విఫలం.. 50శాతం పీజీ, 50శాతం డిగ్రీ విద్యార్థినులకు సీట్లను కేటాయించిన అధికారులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నిజాం కాలేజీలో కొత్తగా నిర్మించిన గర్ల్స్‌ హాస్టల్‌ భవనం పంచాయతీ ఎంతకీ సద్దుమణగడం లేదు. ఆ హాస్టల్‌ను తమకే కేటాయించాలని యూజీ (డిగ్రీ) విద్యార్థినులు గత కొన్నిరోజులుగా ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో హాస్టల్‌ విద్యార్థినులతో టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, ఉన్నత విద్యా కళాశాలల కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ గురువారం చర్చలు జరిపారు. అయితే తమకు వసతి గృహంలో మొత్తం గదులు కేటాయించాలని విద్యార్థినులు డిమాండ్‌ చేశారు. వారి ప్రతిపాదనను కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తిరస్కరించినట్లు తెలిసింది. అయితే అంతకుముందు కమిషనర్‌తో జరిపిన చర్చలో కొత్తగా నిర్మించిన వసతి గృహంలో 50శాతం పీజీ విద్యార్థినులకు, మరో 50శాతం యూజీ విద్యార్థినులకు సీట్లను కేటాయిస్తామని ప్రతిపాదించారు. దీంతో విద్యార్థినులు కాలేజీకి వెళ్లి మిగిలిన వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని పేరర్కొన్నారు.

తోటి విద్యార్థినులతో మాట్లాడిన అనంతరం మొత్తం సీట్లు తమకే కేటాయించాలని, అధికారుల ప్రతిపాదనను వారు ఒప్పుకోలేదని తెలిసింది. చర్చలు విఫలం కావడంతో శుక్రవారం నుంచి తమ నిరసనలు మళ్లి కొనసాగిస్తామని పేర్కొన్నారు. నిజాం కాలేజీలో నూతనంగా నిర్మించిన హాస్టల్‌ను యూజీ విద్యార్థినులను కేటాయించాలని గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే మంత్రి కేటీఆర్‌ జోక్యంతో రంగంలోకి దిగిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే నిజాం కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌ అభ్యర్థన మేరకు 10 మంది విద్యార్థినులతో కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ సమావేశమైనా చర్చలు మాత్రం సఫలం కాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement