Monday, May 6, 2024

Big story : ఢిల్లీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఈడీ.. శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్ బాబు అరెస్ట్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. గురువారం ఒక్కరోజే ఇద్దరు వ్యాపారవేత్తలను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచింది. అరబిందో గ్రూపు సహా 12 కంపెనీల్లో డైరక్టర్‌గా ఉన్న పి. శరత్ చంద్రా రెడ్డిని, పెర్నార్డ్ రిచర్డ్ కంపెనీకి చెందిన బినోయ్ బాబును ఈడీ అధికారులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి విచారణకు పిలిచి అరెస్టు చేసినట్టు ఈడీ వర్గాల ద్వారా తెలిసింది. అనంతరం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించి ఇద్దరికీ వైద్య పరీక్షలు చేయించారు. మధ్యాహ్నం వరకు ఈడీ కార్యాలయంలోనే అరెస్టు పత్రాలు, రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేసుకుని మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్సులో ఉన్న సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి ఎం.కే నాగ్‌పాల్ ఎదుట హాజరుపరిచారు. మద్యం కుంభకోణంపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ ఆధారంగా అందులో చోటుచేసుకున్న మనీలాండరింగ్ అంశాలపై ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ తొలుత ఇండోస్పిరిట్స్ సంస్థ అధినేత సమీర్ మహేంద్రును అరెస్టు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీలో కమ్యూనికేషన్ ఇంచార్జిగా ఉన్న విజయ్ నాయర్‌ను, కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న బోయినపల్లి అభిషేక్‌ను సీబీఐ అరెస్టు చేసింది. వీరితో పాటు అరెస్టు చేసిన మరో వ్యాపారవేత్త దినేశ్ అరోరా అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. ఓవైపు సీబీఐ, మరోవైపు ఈడీ ఈ కేసులో అరెస్టయిన నిందితుల నుంచి రాబట్టిన సమాచారం, దర్యాప్తులో వెల్లడవుతున్న ఇతర అంశాల ఆధారంగా మరిన్ని అరెస్టులు చేస్తూ దూకుడు పెంచింది. ఆ క్రమంలోనే తాజాగా శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబులను అరెస్టు చేసింది.

సీబీఐ కేసులో సాక్షి.. ఈడీ కేసులో నిందితుడు

సీబీఐ దర్యాప్తు మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా ఉన్న బినోయ్ బాబును ఈడీ నిందితుడిగా పేర్కొంటూ అరెస్టు చేసిందని ఆయన తరఫు న్యాయవాదులు జడ్జికి తెలిపారు. సీబీఐ, ఈడీ విచారణకు పిలిచిన ప్రతిసారీ హాజరై అడిగిన వివరాలన్నీ ఇచ్చారని, కుంభకోణంతో బినోయ్ బాబుకు చెందిన పెర్నార్డ్ రిచర్డ్ సంస్థకు ఎలాంటి సంబంధాలు లేవని, ఎలాంటి లావాదేవీలు చోటుచేసుకోలేదని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఉన్న సంస్థలకు ఫైనాన్స్ అందిస్తున్నాం తప్ప నేరపూరిత సొమ్మను తీసుకోవడం లేదా ఇవ్వడం ఎక్కడా జరగలేదని వివరించారు. అలాంటి లావాదేవీలు ఏవైనా జరిగినట్టు ఈడీ రిమాండ్ రిపోర్టులో చూపలేదని జడ్జి దృష్టికి తీసుకెళ్లింది. అయితే కేసు నమోదు చేసిన సమయానికి నిందితుల జాబితాలో లేనంత మాత్రాన నేరంతో సంబంధం ఉన్న వ్యక్తిని అరెస్టు చేయడం తప్పేమీ కాదని జడ్జి తెలిపారు. అయితే బినోయ్ బాబుకు నేరంతో ఎలాంటి సంబంధం లేదని, కేవలం లిక్కర్ పాలసీ కాపీ వాట్సాప్ ఫార్వార్డ్ ద్వారా అందింది తప్ప, దాని ద్వారా ఎలాంటి లబ్ది పొందలేదని చెప్పారు. ఒకవేళ నేరానికి కుట్ర చేశారని ఆరోపించినపక్షంలో అది ఈడీ దర్యాప్తు చేసే షెడ్యూల్డ్ నేరాల జాబితాలో లేదని వెల్లడించారు.

- Advertisement -

భయం మంచిదే, ఆమాత్రం ఉండాల్సిందే

మరోవైపు శరత్ చంద్రా రెడ్డి తరపున వాదనలు వినిపించే సమయంలో ఆయన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి చందన్‌ను విచారణకు పిలిచిన తర్వాత నుంచి ఒక చెవి వినికిడి పోయిందని, దాన్ని బట్టి ఈడీ అధికారులు కొట్టారని అర్థమవుతోందని న్యాయవాదులు జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. ఈడీ అధికారుల తీరుతో శరత్ చంద్రారెడ్డి కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, వేధింపులు తాళలేక కొందరు ఉద్యోగాలు వదిలి వెళ్లిపోతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ఈడీ తరఫు న్యాయవాది “ఆ మాత్రం భయం ఉంటే తప్పేం లేదు. భయం ఉంటే మంచిదే, అప్పుడే తప్పులు జరగకుండా వ్యవహరిస్తారు” అని వ్యాఖ్యానించారు. మరోవైపు శరత్ చంద్రా రెడ్డిపై ఈడీ అనేక ఆరోపణలు చేసింది. ఢిల్లీలోని లిక్కర్ రిటైల్ జోన్లలో 5 జోన్లను శరత్ చంద్రా రెడ్డి నియంత్రించారని చెప్పారు. ట్రైడెంట్ కెంఫార్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్గోనామిక్స్ ఎకోసిస్టమ్స్, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ పేర్లతో ఆయన 5 రిటెయిల్ జోన్లపై గుత్తాధిపత్యాన్ని కలిగి ఉన్నారని చెప్పారు. అలాగే ఇండోస్పిరిట్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టడమే కాకుండా, పరిమితి లేకుండా క్రెడిట్ నోట్స్ ఇచ్చారని చెప్పారు. దర్యాప్తును పక్కదారిని పట్టించేందుకు ఈ క్రెడిట్ నోట్స్ తిరిగి చెల్లించినట్టుగా పేపర్ మీద ఆగస్ట్ 2022లో చూపారని వెల్లడించారు. మొత్తంగా రూ. 60 కోట్ల మేర బకాయిలు ఉండడం మద్యం వ్యాపారంలో అసాధారణమని తెలిపారు. కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో వాటిని బకాయిలుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజానికి ఆ సొమ్మంతా నేరపూరితమైనదేనని పేర్కొన్నారు. మొత్తంగా లిక్కర్ కార్టెల్ (తయారీ, హోల్‌సేల్, రిటైల్) నడపడంలో అక్రమ వ్యాపార పద్ధతులను అవలంబించి, ఢిల్లీ ప్రభుత్వంలో నేతలు, అధికారులకు ముడుపులు చెల్లించారని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ఇప్పటి వరకు జరిపిన 169 సెర్చ్ ఆపరేషన్లలో సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి, క్రోడీకరించి, క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 9 రిటైల్ జోన్లను నియంత్రించిన శరత్ చంద్రారెడ్డిని మరింత ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ క్రమంలో తమ కస్టడీకి అప్పగించాలని జడ్జిని కోరారు. విచారణలో భాగంగా భౌతిక దాడులకు పాల్పడుతున్నారని శరత్ చంద్రారెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ స్పెషల్ కోర్ట్ జడ్జి ఎంకే నాగ్‌పాల్, ఇద్దరికీ వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే భౌతిక దాడుల గురించి శరత్ చంద్రారెడ్డి న్యాయవాది ప్రస్తావించిన నేపథ్యంలో.. కస్టడీ సమయంలో విచారణ పూర్తిగా సీసీటీవీ కెమేరాల ముందే జరపాలని నిబంధన విధించారు. మరోవైపు ప్రతి రోజూ సాయంత్రం గం. 5.00 నుంచి గం. 6.00 మధ్య నిందితుల కుటుంబ సభ్యులు కలవడానికి కూడా అనుమతించారు. శరత్ చంద్రారెడ్డిని కలవడానికి ఆయన భార్యకు, బినోయ్ బాబును కలవడానికి ఆయన భార్యతో పాటు సోదరుడికి జడ్డి అనుమతించారు. ఈ సందర్భంగా ఇంటి భోజనం కూడా అనుమతించాలని నిందితుల తరఫు న్యాయవాది కోరగా.. భద్రతా కారణాల రీత్యా అందుకు అనుమతించలేమని జడ్జి స్పష్టం చేశారు. అయితే ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement