Thursday, May 9, 2024

15న ఎన్‌డబ్ల్యూడీఏ గవర్నింగ్‌బాడీ భేటీ.. పాల్గొననున్న భాగస్వామ్య రాష్ట్రాల ఉన్నతాధికారులు

అమరావతి, ఆంధ్రప్రభ ; గోదావరి-కావేరి అనుసంధానంపై జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఈనెల 15న ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. గోదావరిలో ఇచ్చంపల్లి నుంచి కాకుండా తుపాకులగూడెం నుంచి నీటిని నాగార్జునసాగర్‌ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా కావేరి గ్రాండ్‌ ఆనకట్టకు తరలించాలన్న నూతన ప్రతిపాదనపై గవర్నింగ్‌బాడీతో చర్చించేందుకు ఎన్‌డబ్ల్యూడీఏ భేటీ నిర్వహించనుంది. ఎన్‌డబ్ల్యూడీఏ గవర్నింగ్‌ బాడీకి కేంద్ర జలశక్తి కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా కేంద్ర ఆర్ధిక, విద్యుత్‌, వ్యవసాయ, అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శులతో పాటు నీతి ఆయోగ్‌, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), భాగస్వామ్య రాష్ట్రాల్రకు చెందిన ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. తుపాకుల గూడెం నుంచి కావేరికి నీటిని తరలించే ప్రతిపాదన అమలుకు కేంద్రం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నందునే ఎన్‌డబ్ల్యూడీఏలో అత్యున్నత విధాన నిర్ణాయక కార్యవర్గంగా ఉన్న గవర్నింగ్‌ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం. గోదావరిలో తమ వాటాగా దక్కిన 141 టీఎంసీలను ఇంద్రావతి నుంచి చత్తీస్‌గఢ్‌ వినియోగించుకోకపోవటం వల్ల అవి సముద్రంలో కలుస్తున్నాయి.. ఆ నీటిని తుపాకులగూడెం నుంచి దారి మళ్ళించి కావేరికి తరలించాలనేది ఎన్‌డబ్ల్యూడీఏ కొత్త ప్రతిపాదన.

గతంలో ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీలను తరలించాలని ప్రతిపాదించగా, గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం చేసిన అనంతరం 141 టీఎంసీలకు తగ్గించి తుపాకులగూడెం నుంచి అనుసంధానం చేపట్టాలని ఎన్‌డబ్ల్యూడీఏ నిర్ణయించింది. ఈ నూతన అనుసంధాన ప్రతిపాదన ద్వారా తమిళనాడుకు 38.6 టీఎంసీలు, తెలంగాణకు 42.6, ఏపీకి 41.8, కర్ణాటకకు 9.8, పుదుచ్చేరికి 2.2 టీఎంసీలను కేటాయించనున్నట్టు ఎన్‌డబ్ల్యూడీఏ ప్రకటించింది. ఈ ప్రతిపాదనను చత్తీస్‌గఢ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ రాష్ట్రాన్రికి హక్కుగా, వాటాగా దక్కిన గోదావరి జలాలను కావేరికి ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తోంది. తమ వద్ద మిగులు జలాలే లేవని చత్తీస్‌ ఘడ్‌ చెబుతోంది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 50 శాతం నీటి లభ్యతతో అంచనాలు రూపొందించి ఆపైన మిగులు జలాలు ఉంటేనే తరలించాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు గతనెల 18న నిర్వహించిన ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో ఆ రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు నూతన అనుసంధాన ప్రతిపాదనపై తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అనంతరం చత్తీస్‌ ఘడ్‌ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ డబ్ల్యూడీఏ కొత్త ప్రతిపాదనపై చత్తీస్‌దఢ్‌తో పాటు ఇతర భాగస్వామ్య రాష్ట్రాల్రను ఒప్పించేందుకు ఈనెల 15న భేటీ- నిర్వహిస్తోంది.

- Advertisement -

వచ్చే నెలలో హైదరాబాద్‌ సమావేశం

ఈనెల 15న సమావేశంలో అన్ని రాష్ట్రాల అభ్యంతరాలు, అభిప్రాయాలను స్వీకరించటంతో పాటు వాటిపై సమీక్ష చేసి కార్యాచరణ రూపొందించేందుకు వచ్చే నెలలో మరోసారి హైదరాబాద్‌లో కీలక భేటీ నిర్వహించే ఆలోచనలో ఎన్‌డబ్ల్యూడీఏ ఉన్నట్టు సమాచారం. తమ వాటా జలాలు కాకుండా గోదావరిలో మిగులు జలాలుగా ఉన్న అదనపు నీటిని మాత్రమే గోదావరి-కావేరి అనుసంధానం కోసం తరలించాలనీ, ఈ మేరకు కొత్తగా అధ్యయనం చేసి గణాంకాలు వెల్లడించాలని ఏపీతో సహా దాదాపు అన్ని రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గోదావరిలో మిగులు నీటి లభ్యత లేదని గతంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రకటించింది. అందువల్లనే చత్తీస్‌ ఘడ్‌ వాడుకోని నీటిని మాత్రమే తరలించాలని నూతన ప్రతిపాదన సిద్ధం చేశామని ఎన్‌ డబ్ల్యూడీఏ చెబుతోంది. ఈ ప్రతిపాదనపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న చత్తీస్‌గఢ్‌ ఈనెల 15న నిర్వహించనున్న భేటీ-లో ఎలాంటి వాదన వినిపిస్తుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement