Tuesday, April 30, 2024

వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూత..

ప్రముఖ వైద్యులు..కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న కాక‌ర్ల సుబ్బారావు నెల రోజుల క్రితం కిమ్స్ ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.   సుబ్బారావు మృతిప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

కాకర్ల మృతికి ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు సంతాపం సంతాపం తెలిపారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వైద్య రంగానికి కాకర్ల చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. నిమ్స్ డైరక్టర్ గా ఆయన చేసిన కృషి గొప్పదన్నారు. కాకర్ల కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పద్మశ్రీ కాకర్ల సుబ్బారావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటున్నారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు. కాకర్ల 5 దశాబ్దాలకు పైగా వైద్య సేవలందించి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని ఆయన నేటి యువతకు కాకర్ల సుబ్బారావు ఆదర్శమన్నారు. ఆయన రాసిన పరిశోధనా వ్యాసాలకు, పుస్తకాలకు అంతర్జాతీయంగా ప్రశంసలు లభించాయి. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు చంద్రబాబు.

కాకర్ల సుబ్బారావు 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్యాభ్యాసం చల్లపల్లిలో, కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ కళాశాలలో సాగింది. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్‌ పట్టా పొందారు. 1951లో హౌస్‌ సర్జన్‌ చేసిన తర్వాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్లారు. అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లో ఉత్తీర్ణులయ్యారు. న్యూయార్క్‌, బాల్టిమోర్‌ నగరాల్లోని ఆసుపత్రుల్లో 1954 నుంచి 56 వరకు పనిచేశారు. 1956లో స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా పదోన్నతి పొందారు. హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రి డైరెక్టర్‌గా సేవలందించారు. సుబ్బారావు రేడియాలజిలో అనేక పుస్తకాలు, జర్నల్స్ లో పరిశోధనా వ్యాసాలు వ్రాశాడు. దేశ విదేశాలలో వైద్య ఉపన్యాసాలు ఇచ్చాడు. యాభై ఏళ్ల అనుభవంలో అనేక బహుమతులు, సన్మానాలు పొందాడు.

సుబ్బారావు వైద్యశాఖకు, మానవాళికి చేసిన సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. ఇండియా రేడియాలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ వారి అనుబంధ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చార్టరు సుబ్బారావుకు 2001 మార్చి 17న జీవితకాలపు కృషి అవార్డు ప్రదానం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement