Monday, April 29, 2024

అదిగ‌దిగో భూమి లాంటి ఉప‌గ్ర‌హం..

విశాల విశ్వంలో రహస్యాల ఛేదన ఖగోళ శాస్త్రవేత్తలకు ఓ సవాలు. అందుకే ఖగోళ శాస్త్రవేత్తలు నిత్యాన్వేషణలో మునిగితేలుతూ గుట్లు కనుగొనే ప్రయత్నం చేస్తూంటారు. ఇప్పుడు అలాంటి ఓ ఖగోళ రహస్యాన్ని వారు కనిపెట్టారు. మన సౌరమండలం ఆవల.. సుదూరంగా ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ భూమిలాంటి ఒక గ్రహం తిరుగుతోందని గుర్తించారు. అయితే, ఆ గ్రహం నిండా అగ్నిపర్వతాలు పరివేష్టితమై ఉన్నాయి. వాటిలో అత్యధికం… తరచూ జ్వాలలను చిమ్ముతూనే ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ గ్రహంపై నీటిజాడలున్నాయని, ఘనీభవించని నీటి నిల్వలున్నాయని, అందువల్ల అక్కడ భూ వాతావరణం లాంటిదే అక్కడా ఉండొచ్చని, కాకపోతే ఉష్ణోగ్రతలు మాత్రం ఎక్కువగా ఉంటాయని అంచనావేస్తున్నారు. ఇప్పటికీ ఆ గ్రహంలోని భూమండలం చురుకుగా, జీవంతో ఉంటే.. వాతావరణం తప్పనిసరిగా ఉంటుందని వారి విశ్వాసం. భూగ్రహం దక్షిణ ధ్రువం నుంచి 90 కాంతి సంవత్సరాల దూరంలోనున్న మరుగుజ్జు నక్షత్రం చుట్టూ ఈ సరికొత్త గ్రహం తిరుగుతోంది. దీనికి ఎల్‌పీ 791-18 డిగా పేరుపెట్టారు. ఆ మరుగుజ్జు నక్షత్రానికి ఎల్లప్పుడూ ఒకే పార్శ్వం అభిముఖంగా ఉంటూ ఈ గ్రహం తిరుగు తూండటం విశేషం. ఖగోళశాస్త్ర పరిభాషలో ఒక కాంతి సంవత్సర దూరం అంటే.. 9.5 ట్రిలియన్‌ కిలోమీటర్ల దూరం.

ప్రస్తుత మన సౌరమండలంలో గురుగ్రహ (జూపిటర్‌)కు చెందిన చంద్రుడి (ఐ ఓ) లోను, భూగ్రహం, శుక్రగ్రహం (వీనస్‌)పై మాత్రమే అగ్నిపర్వతాలు పరిమితంగా ఉన్నాయి. గురు చంద్రుడు ఐఓలో అగ్నిపర్వతాల పేలుళ్లు కాస్త ఎక్కువ. దీనితో పోలిస్తే ఇప్పుడు కనుగొన్న భూగ్రహం లాంటి కొత్తగ్రహంలో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు చాలా ఎక్కువ. ట్రాన్సిటింగ్‌ ఎక్సోప్లానెట్‌ సర్వే శాటిలైట్‌ (టీఈఎస్‌ఎస్‌-టెస్‌, స్పిట్జర్‌ స్పేస్‌ టెలిస్కోప్‌, భూమండలంలో పలుచోట్ల ఉన్న అబ్జర్వేటరీలు అందించిన సమాచారం ఆధారంగా ఈ గ్రహాంతర ప్రపంచాన్ని గుర్తించారు. ఈ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ మరో రెండు గ్రహాలు తిరుగుతున్నాయని, అవి అడ్డురావడం వల్ల, కొత్తగా కనుగొన్న గ్రహం ఆ నక్షత్రం చుట్టూ ఒకేవైపు స్థిరంగా (ఎప్పుడూ పగలే) ఉండి తిరుగుతూండటంవల్ల అదనపు సమాచారం తెలుసుకోవడం కష్టమవుతోంది. కాకపోతే ఆ గ్రహం అంతటా అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సంభవిస్తున్నట్లు భావిస్తున్న శాస్త్రవేత్తలు రెండోవైపు (చీకటి) రాత్రి భాగంలో నీటినిల్వలు ఉండొచ్చని, ఫలితంగా ఆ గ్రహంలోనూ వాతావరణం ఉంటుందని ఈ పరిశోధనా బృందం సారథి బార్న్‌ బెన్నెకె పేర్కొన్నారు.

జర్నల్‌ నేచర్‌లో వీరి పరిశోధనలకు సంబంధించిన వివరాలను ప్రచురించారు. ఈ కొత్త గ్రహంలో అగ్ని పర్వతాల విస్ఫోటనాలను నేరుగా చూడలేదు. కానీ అలా జరుగుతున్నాయనడానికి తగిన ఆధారాలు మాత్రం ఉన్నాయని, ఆ పరిశోధక బృందంలోని సభ్యుడు, యూనివర్శిటీ ఆఫ్‌ కాన్సాస్‌ ప్రొఫెసర్‌ ఇయాన్‌ క్రాస్‌ఫీల్డ్‌ చెప్పారు. అదీగాక, ఇది నక్షత్రానికి గోల్డిలాక్‌ జోన్‌లో తిరుగుతోందని, అంటే మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలు, మరీ ఎక్కువ చల్లని పరిస్తితులు ఉండవని, అందువల్ల నీటిజాడలు ఉంటాయని, అందువల్ల జీవించే పరిస్థితులు ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. విశ్వంలో ఇప్పటికే రెండు గ్రహాంతర ప్రపంచాలను ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్న విషయం తెలిసిందే. వాటిని ఎల్‌పీ 791-18బి అండ్‌ సీగా పిలుస్తున్నారు. వీటిలో సీ గ్రహం భూగ్రహం కన్నా రెండింతలు పెద్దదని తేల్చారు.
ప్రాణికోటి కేవలం భూమిపైనే ఉద్భవించిందా లేక గ్రహాంతర సీమలో జనించిందా… అందుకు అగ్నిపర్వత విస్పోటనాలు కారణమయ్యాయా? అన్నది ఖగోళ జీవభౌతిక శాస్త్రవేత్తలను దొలిచేస్తున్న ప్రశ్న అని కో ఆథర్‌ జెస్సీ క్రిస్టియాన్‌సెన్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement