Saturday, May 4, 2024

నేతన్న బీమా పథకం ఈ నెల 7 నుంచి ప్రారంభం : మంత్రి కేటీఆర్‌

నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో భాగంగానే చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా పథకాన్ని ఈ నెల 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం రోజున నుంచి అమలు చేయబోతున్నామని ప్రకటించారు. బీమా కాలములో లబ్ధిదారులైన చేనేత, మరమగ్గాల కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా నామినీకి ఐదు లక్షల రూపాయలను అందచేస్తామన్నారు. లబ్ధిదారులు చనిపోయిన పది రోజుల్లో ఈ మొత్తం ఖాతాలో జమ అవుతుందని చెప్పారు. చేనేత, పవర్ లూమ్ కార్మికుల ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఈ పథకం అమలుకు చేనేత, జౌళి శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందన్నారు. నేతన్న బీమా కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా (LIC)తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. వార్షిక ప్రీమియం కోసం చేనేత-పవర్ లూమ్ కార్మికులు ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదని కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం మొత్తాన్ని ఎల్.ఐ.సికి చెల్లిస్తుందని తెలిపారు. ఇందుకోసం యాభై కోట్లు కేటాయించామన్న కేటీఆర్, 25 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేశామన్నారు. 60 సంవత్సరాల లోపు ఉన్న చేనేత, మరమగ్గాల కార్మికులందరూ ఈ నేతన్న బీమా పథకానికి అర్హులే అన్నారు. సుమారు 80 వేల చేనేత, మరమగ్గాల కార్మికులకు నేతన్న బీమా కవరేజ్ లభిస్తుందన్నారు. ఇక ఈ పథకమును అమలు చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు. అర్హులైన చేనేత / పవర్ లూమ్ కార్మికులు, అనుబంధ కార్మికులు అందరికి నేతన్న బీమా పథకాన్ని అమలు చేస్తామరి కేటీఆర్ అన్నారు.


చేనేత, జౌళి రంగానికి చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా ఏ ప్రభుత్వము కేటాయించని విధంగా 2016-2017 నుండి ప్రతి సంవత్సరం ప్రత్యేక బడ్జెట్ (బీసీ వెల్ఫేర్ నుండి) రూ. 1200.00 కోట్ల చొప్పున కేటాయిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. చేనేత & జౌళి శాఖ రెగ్యులర్ బడ్జెట్ కు ఇది అదనం అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి చేనేత జౌళి శాఖ సాధారణ బడ్జెట్ క్రింద రూ.55.12 కోట్లను కేటాయించామన్నారు. బలహీన వర్గాల సంక్షేమ బడ్జెట్ క్రింద స్పెషల్ బడ్జెట్ రూపంలో మరో 400.00 కోట్లు కూడా కేటాయించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో చేనేత కార్మికుల సంక్షేమం , ఉపాధి కోసం అనేక‌ కార్యక్రమాలను అములచేస్తున్నామమ‌ని కేటీఆర్ అన్నారు.. దేశంలో ఏ రాష్ట్రములో లేనివిధంగా చేనేత అభివృద్ధి, సంక్షేమము కొరకు తెలంగాణలో అమలవుతున్న వినూత్న పథకాలను పలు రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. ఒడిశా, కర్ణాటక , మధ్యప్రదేశ్ నుండి అధికారుల బృందాలు మన రాష్ట్రములో పర్యటించి, మన చేనేత పథకాలను అధ్యయనం చేసి ప్రశంసించాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement