Wednesday, May 1, 2024

విద్యార్థులకు నీట్‌ లాంగ్‌టర్మ్‌ ఉచిత కోచింగ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు నీట్‌ లాంగ్‌టర్మ్‌ ఉచిత కోచింగ్‌ ఇస్తామని ఇంజనీర్‌ పొలాస విశ్వనాథం ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ పొలాస మూర్తి తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిభ ఉన్న ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సహాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది నీట్‌ యూజీ-2023 సన్నద్ధమవుతున్న వారు ప్రతిభావంతులైన పేద విద్యార్థుల్లో 25 మందికి అడ్వాన్స్‌డ్‌ బ్లాక్‌ బోర్డ్‌(ఏబీబీ) అకాడమిలో ఉచితంగా లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ ఇస్తామన్నారు.

ఈ అకాడమిలో గతేడాది కోచింగ్‌ తీసుకున్న విద్యార్థుల్లో 50 మంది మెడికల్‌ సీట్లు సాధించారని వివరించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 25వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నీట్‌ యూజీ-2022లో ఎస్సీలు 300 స్కోర్‌, ఎస్టీలు, బీసీలు, ఈడబ్ల్యూఎస్‌, మైనార్టీలు 350 స్కోర్‌ సాధించిన విద్యార్థులు ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమి డైరెక్టర్‌ పి.వెంకటరమణ, పొలాస రమ, పరమేశ్వర్‌, వీణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement