Friday, April 19, 2024

తెలంగాణ‌లో మరో మూడు రోజులపాటు వర్షాలు.. లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాతోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాలను ప్రజలను అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తక్కువ ఎత్తులో గాలులు అగ్నేయ, తూర్పు దిశల నుంచి రాష్ట్రం వైపుకు వీస్తున్నాయని, దీంతో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ నాగరత్న తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

కాగా… హైదరాబాద్‌లో శనివారం అర్ధరాత్రి వరకు కురిసిన వర్షాలతో పలు కాలనీలు, అపార్టుమెంట్లు నీట మునిగాయి. మణికొండ పంచవటి కాలనీలోని ఓ అపార్టుమెంట్‌లో సెల్లార్‌లోకి నీరు చేరింది. అందులో ఉన్న క ఆర్లు, బైకులు నీట మునిగిపోయాయి. రహదారులపై కూడా నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర అవస్థులు పడ్డారు. ఎటూ చేసిన వర్షపు నీరు కనిపించడంతో స్తానికులు భయాందోళనకు గురయ్యారు. నగర ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపైకి భారీగా వరద చేరడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ లేక ప్రలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement